ఆస్తి పంపకాల కోసం తల్లి శవం వద్దే కొడుకు, కూతుళ్ల పంచాది

  • రెండ్రోజులు ఫ్రీజర్​లోనే మృతదేహం
  • ఆస్తి పంపకాలు పూర్తయ్యాక అంత్యక్రియలకు డబ్బుల్లేవన్న కొడుకు 
  • ఖర్చులకు రూ.2 లక్షలు ఇచ్చిన తర్వాతే తల్లికి తలకొరివి
  • సూర్యాపేట జిల్లా కందులవారిగూడెంలో ఘటన 

నేరేడుచర్ల, వెలుగు : ఆస్తి పంపకాల కోసం తల్లి అంత్యక్రియలను రెండ్రోజుల పాటు ఆపేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారిగూడెంలో జరిగింది. గ్రామానికి చెందిన వేము వెంకటరెడ్డి, లక్ష్మమ్మ (80) దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. లక్ష్మమ్మ భర్త వెంకటరెడ్డి, చిన్న కుమారుడు గతంలోనే చనిపోయారు. దీంతో ఆమె గత ఐదేండ్లుగా నేరేడుచర్లలోని చిన్న కుమార్తె వద్ద ఉంటున్నది. లక్ష్మమ్మ ఇటీవల కాలు జారి కింద పడటంతో మిర్యాలగూడలోని ఓ హాస్పిటల్​లో చికిత్స అందిస్తున్నారు.

 అయితే, ఆమె పరిస్థితి విషమంగా మారడంతో ఇంటికి తీసుకెళ్లాలని, ఆక్సిజన్ పైనే బతుకుతుందని డాక్టర్లు బుధవారం చెప్పారు. దీంతో లక్ష్మమ్మను ఆక్సిజన్​తోనే చిన్న కుమార్తె తమ ఇంటికి తీసుకెళ్లింది. బుధవారం రాత్రి 9 గంటలకు ఇంటి ముందు ఉన్న వెంచర్ వద్ద అంబులెన్స్ ను పార్క్ చేయించగా, లక్ష్మమ్మ ఆక్సిజన్​తో అందులోనే ఉండిపోయారు. ఈలోగా లక్ష్మమ్మ కుమారుడు అక్కడికి చేరుకుని, పెద్దమనుషులతో పంచాయితీ పెట్టించాడు. లక్ష్మమ్మను కందులవారిగూడెం తీసుకెళ్తానని చెప్పాడు. ఆస్తి పంపకాల లెక్కలు తేలే వరకు అంబులెన్స్ కదిలేది లేదని లక్ష్మమ్మ ముగ్గురు కూతుళ్లు పట్టుబట్టారు. ఓవైపు వీళ్ల పంచాది నడుస్తుండగా.. రాత్రి 11 గంటల సమయంలో లక్ష్మమ్మ కన్నుమూశారు. 

డబ్బులిచ్చిన తర్వాతే తల్లికి తలకొరివి..

మృతదేహాన్ని కందులవారిగూడెం తరలించినా.. కొడుకు, కూతుళ్ల పంచాదీ ఆగలేదు. లక్ష్మమ్మ గతంలో రూ.21 లక్షల వరకు పలువురికి అప్పులిచ్చారు. ఆమె ఒంటిపై 20 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే లక్ష్మమ్మ వైద్య ఖర్చులు భరించిన చిన్నకూతురికి రూ.21 లక్షల్లోంచి రూ.6 లక్షలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. మిగిలిన రూ.15 లక్షలకు సంబంధించిన పేపర్లను కొడుకుకు అప్పజెప్పారు. 20 తులాల బంగారు ఆభరణాలను ముగ్గురు కూతుళ్లు పంచుకున్నారు. అంతా అయిపోయిందిలే అనుకుంటున్నా సమయంలో కుమారుడు కొత్త పేచీ పెట్టాడు. తల్లి అంత్యక్రియల ఖర్చు భరించలేనని, తనకు డబ్బులిస్తేనే తలకొరివి పెడతానని చెప్పాడు. శుక్రవారం ఉదయం పెద్ద మనుషులు అంత్యక్రియల ఖర్చుకు రూ.2 లక్షలు ఇప్పియడంతో ఆ పంచాయితీ కొలిక్కి వచ్చింది. తర్వాత లక్ష్మమ్మ అంత్యక్రియలు పూర్తి చేశారు.