దుబాయ్: హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీతోపాటు విదేశాంగ మంత్రి హొస్సేన్, ఇతరుల అంతిమయాత్ర మంగళవారం ప్రారంభమైంది. వాతావరణం అనుకూలించక అజర్బైజాన్ సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో ఆదివారం హెలికాప్టర్ కూలిపోగా, అధ్యక్షుడితోపాటు 9 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ మృతదేహాలను రెస్క్యూ ఆపరేషన్‌కు వెళ్లిన దళాలు గుర్తించాయి. అనంతరం వారి భౌతిక కాయాలను తబ్రిజ్ నగరానికి తరలించారు. మంగళవారం ఉదయం మృతదేహాలను తీసుకురాగా, ఇస్లాం సంప్రదాయాలకు అనుగుణంగా వేలాది మంది ప్రజలు నల్లరంగు దుస్తుల్లో శవపేటికల వెంట నడిచారు.
వాటిపై కొందరు పూలుచల్లుతూ ముందుకు కదిలారు. చనిపోయినవారిని అమరవీరులుగా కీర్తించారు. భౌతికకాయాలను ముందుగా పవిత్ర షియా సెమినరీ నగరమైన కోమ్‌కు అక్కడి నుంచి టెహ్రాన్‌కు తరలిస్తారు. బుధవారం ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అధ్యక్షతన రైసీ అంతిమయాత్ర ఊరేగింపు అధికారికంగా ప్రారంభమవుతుంది. గురువారం రైసీ స్వస్థలం బిర్జాండ్కు చేరుకుంటుంది. అనంతరం మషాద్ పవిత్ర నగరంలోని ఇమా రెజాలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అధ్యక్షుడి మరణంతో ఇరాన్ ఐదు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టెక్నికల్ స్నాగ్ వల్లే అటవీప్రాంతంలో కుప్పకూలినట్టు ఇరాన్ అధికారులు ప్రాథమికంగా తేల్చారు.
జూన్ 28న ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు
రైసీ ఆకస్మిక మృతితో ఇరాన్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమైంది. జూన్ 28న ప్రెసిడెంట్ఎలక్షన్స్ నిర్వహించాలని ఇరాన్ ప్రభుత్వం నిర్ణయించిందని అధికారిక మీడియా తెలిపింది. తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ మొఖ్బర్ అధ్యక్షతన నిర్వహించిన న్యాయ, కార్యనిర్వాహక, శాసనాధికారుల అధిపతుల సమావేశంలో ఈ తేదీని ఖరారు చేశారని తెలిపింది.
ప్రమాదంపై దర్యాప్తులో సహకరించని యూఎస్హెలికాప్టర్ ప్రమాద ఘటనపై దర్యాప్తునకు సహకరించాలంటూ ఇరాన్ విజ్ఞప్తి చేసినా.. అమెరికా స్పందించలేదు. లాజిస్టిక్ కారణాలవల్ల ఇరాన్‌కు సహకారం అందించలేకపోయామని సీనియర్ దౌత్యవేత్త మాథ్యూ మిల్లర్ తెలిపారు. రైసీ మృతిపై విచారం వ్యక్తం చేస్తున్నామని, అదే సమయంలో ఇరాన్ ప్రజల హక్కులను రైసీ కాలరాశాడనే విషయం మరిచిపోమని చెప్పారు.
ఇరాన్‌కు జగదీప్ దన్ఖడ్..
ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ అంత్యక్రియల్లో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్పాల్గొనే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం. ఇందుకోసం ఆయన బుధవారం ఇరాన్ వెళ్లనున్నట్టు తెలిసింది.