- నీళ్లు ఎక్కడి నుంచి లిఫ్ట్చేస్తారో నేటికీ నో క్లారిటీ
- రాష్ట్ర సర్కారు వద్దే మూలుగుతున్న ప్రపోజల్స్
- ఏపీ ఫిర్యాదుతో పనులపై స్టే ఇచ్చిన ఎన్జీటీ
- ముందుకు కదలని పబ్లిక్ హియరింగ్స్
- తాజాగా పాలమూరుకు అనుమతులతో తెరపైకి ఇష్యూ
నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు వరదాయనిగా భావించే డిండి లిఫ్ట్ఇరిగేషన్ ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పాలమూరు– రంగారెడ్డికి ఎట్టకేలకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు లభించగా, ఆ ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మిస్తున్న డిండి స్కీంను మాత్రం ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. ఈ ఎత్తిపోతలకు ఎక్కడి నుంచి నీళ్లు తీసుకుంటారనే విషయంలో సర్కారుకు ఇప్పటివరకు క్లారిటీ లేకుండా పోయింది. దీనికి సంబంధించి ఇంజినీర్లు ఇచ్చిన ప్రపోజల్స్రెండేండ్లుగా సీఎం టేబుల్‌పైనే మూలుగుతున్నాయి. మరోవైపు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టడంతో ఏపీ ప్రభుత్వం నేషనల్గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ఈక్రమంలో ఎన్జీటీ స్టే ఇవ్వడంతో పనులన్నీ ఆగిపోయాయి.
నీళ్ల సంగతి తేలాల్సిందే..
డిండి లిఫ్ట్ స్కీంకు నీళ్లు ఎక్కడి నుంచి తీసుకోవాలనే క్లారిటీ లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం, వేల కోట్లతో తొమ్మిది రిజర్వాయర్ల పనులు చేపట్టింది. ఈ నిర్మాణాలు దాదాపు పూర్తికావస్తున్న తరుణంలో ఏపీ సర్కారు ఎన్జీటీ తలుపుతట్టింది. అసలు నీళ్ల సంగతి తేల్చకుండానే రిజర్వాయర్లు కడ్తున్నారని ఫిర్యాదు చేసింది. వాస్తవానికి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడానికి ముందే నీళ్ల కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. దీని తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ కోసం పొల్యూషన్ కంట్రోల్‌బోర్డుకు ఆదేశాలివ్వాలి. ఆ మేరకు నల్గొండ, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, యాదాద్రి జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. దీని తర్వాత కేంద్రం అనుమతులు కోరాల్సి ఉంటుంది. ఇదంతా పూర్తిచేశాక కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ పర్మిషన్తీసుకోవాలి. ఒక క్రమపద్ధతిలో చేయాల్సిన ఈ ప్రక్రియను పక్కన పెట్టి, నీళ్ల సంగతి తేలకుండానే రిజర్వాయర్లను నిర్మించడంతో మొత్తం ప్రాజెక్టు భవిష్యత్ప్రశ్నార్థకంగా మారింది.
ఇటు ప్రతిపాదనలు.. అటు అభ్యంతరాలు..
శ్రీశైలం నుంచి 30 టీఎంసీల కృష్ణా జలాలను నల్గొండ జిల్లాలోని 3.5లక్షల ఎకరాల ఫ్లోరైడ్ ప్రభావిత భూములకు తరలించడమే లక్ష్యంగా సర్కారు డిండి ప్రాజెక్టు చేపట్టింది. మొదట పాలమూరు స్కీంలో రెండో రిజర్వాయర్అయిన ఏదుల నుంచి రోజుకు 0.5 టీఎంసీ నీటిని 60 రోజుల పాటు తరలించేలా పరిపాలన అనుమతులిచ్చింది. దీని తర్వాత ఏదుల రిజర్వాయర్‌కు బదులు పాలమూరులోని మొదటి రిజర్వాయర్ నార్లాపూర్ నుంచి నీటిని తీసుకునేలా ప్లాన్లు రూపొందించింది. కానీ, ఈ ప్రతిపాదనలతో భూసేకరణ పెరగడం, అటవీ భూములు ముంపునకు గురవుతుండడంతో తిరిగి ఏదుల నుంచే తీసుకోవాలని నిర్ణయించింది. ఆ తర్వాత మళ్లీ ఏదుల నుంచి కాకుండా వట్టెం నుంచి వాటర్ డైవర్షన్ చేద్దామని, ఆ రకంగా ఎస్టిమేట్లు తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
దీంతో ఇరిగేషన్ ఇంజినీర్లు వట్టెం నుంచి ఎత్తిపోసేందుకు రూ.1320 కోట్లతో ప్రపోజల్రెడీ చేసి పంపారు. కానీ, ఈ ప్రతిపాదన పై తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం తీవ్ర అభ్యంతరం వ్య క్తం చేసింది. నార్లాపూర్నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఏదుల రిజర్వాయర్ నింపడం చాలా సులువని, అలాకాకుండా వట్టెం రిజర్వాయర్‌లోకి నీటిని మళ్లించి, మళ్లీ అక్కడి నుంచి ఏదుల రిజర్వాయర్‌లోకి ఎత్తిపోయడం వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగిపోవడమేగాక, ఏడాదికి అనవసరంగా రూ.235 కోట్ల కరెంట్ బిల్లుల భారం పడ్తుందని రిటైర్డ్ ఇంజినీర్లు వాదించారు. ముందు అలైన్మెంట్ చేసిన ప్రకారం ఏదుల నుంచి డైరెక్ట్‌గా ఉల్పర రిజర్వాయర్‌లోకి నీటిని మళ్లిస్తే అక్కడి నుంచి గ్రావిటీ రూపంలో కెనాల్స్ద్వారా రిజర్వాయర్లలోకి నీరు వచ్చి చేరుతుందని, దీనికోసం అయ్యే ఖర్చు కూడా రూ.635 కోట్లు మాత్రమేనని చెప్తున్నారు. రిటైర్డ్ ఇంజినీర్ల ప్రతిపాదనలు సర్కారుకు చేరి కూడా రెండేండ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.