విద్యార్థులకు శాపంగా ఇంటర్ విద్యాశాఖ అనాలోచిత వైఖరి

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యాశాఖ అధికారుల అనాలోచిత వైఖరి అసంఖ్యాక విద్యార్థులకు శాపంగా పరిణమిస్తోంది. ఏ రెండు గడియారాలు ఒకే సమయం చూపవన్న వాస్తవం తెలిసి కూడా నిమిషం నిబంధనను ఇంటర్ అధికారులు అమలు పరచడం వల్ల విద్యార్థుల బంగారు  భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతున్నది. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదంటూ పరీక్షల నిర్వహణ సందర్భంగా విధిస్తున్న ఈ నిబంధన పలువురు విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారుతున్నది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో లోపాల్ని పరిష్కరించవలసిన అధికారులు, ప్రైవేటు సంస్థల దూకుడును అడ్డుకోవడంలో విఫలమైన పాలకులు తాము సైతం ఏదో గొప్ప పని చేస్తున్నామని అభిప్రాయం కలిగించడానికి ఈ కొత్త నిబంధన విధిస్తున్నారు. పరీక్షల నిర్వహణ వ్యవస్థ పట్ల సమాజంలో విశ్వాసం కలిగించేలా వ్యవహరించాల్సిన వారే అందుకు భిన్నమైన వైఖరి అవలంబించడం సిగ్గు పడాల్సిన విషయం.

పరీక్షల పరమార్థం ఇదేనా...

పరీక్షలు లక్ష్యాత్మక సోపానాలు. విద్యా వ్యవస్థలో అంతర్భాగంగా గుర్తింపు పొందిన పరీక్షలు కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నవి. విజ్ఞానాన్ని వెలికి తీయాల్సిన పరీక్షలు విద్యార్థుల ముందడుగుకు అవరోధం కాకూడదు. గతంలో లేనంత సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల బోధన, అభ్యసన ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోవాలి. అభ్యసన సులభ సాధ్యం కావాలి. కొత్త పరిశోధనలు ఆవిష్కరణలు విద్యా వ్యవస్థకు నూతనోత్తేజం కలిగించాలి. కానీ ప్రస్తుతం ఇంటర్ విద్యా  వ్యవస్థ లో కనీస వసతుల లోటు, సామర్ధ్యం పటిమ నిండిన బోధకుల కొరత, యాంత్రికమైన బోధనా విధానాలు మొత్తం వ్యవస్థను నీరుగారుస్తున్నాయి. ఈ వాస్తవాన్ని పక్కనపెట్టి అధికారులు పరీక్షల కాలంలో విద్యార్థులను అనుక్షణం భయభ్రాంతులకు గురి చేసే నిమిషం నిబంధన రుద్దుతున్నారు. ఇదే విషయాన్ని విస్తృత ప్రచారంలోకి తెచ్చామని గర్వపడుతున్నారు. ఈ నిబంధన కారణంగా పలువురు విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతున్న వాస్తవాన్ని వారు ఇప్పటికీ గుర్తించడం లేదు.

అదొక అర్థరహిత నిబంధన 

ప్రస్తుతం రాష్ట్రంలో 1473 పరీక్ష కేంద్రాల్లో 9,51,022 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. మార్చి 15 న ప్రారంభమై, ఈ పరీక్షలు ఏప్రిల్ 3న పూర్తవుతాయి. గత ఏడాది ఇంటర్ పరీక్షల్లో నిజామాబాద్ జిల్లాలో పది మంది, వేములవాడలో ఇద్దరు నిమిషం నిబంధనతో పరీక్షలకు దూరమయ్యారు. పాలేరు నియోజకవర్గం నుంచి ఖమ్మం నగరానికి పరీక్ష రాయడానికి వచ్చిన భూక్య దేవి అనే విద్యార్థినికి సమయానికి బస్సు దొరకక పది నిమిషాలు ఆలస్యంతో ఇంటర్ పరీక్ష రాయలేక పోయింది. ఈ విధంగా  నిమిషం నిబంధన చాలా మంది విద్యార్థుల బంగారు భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేస్తున్నది. పరీక్షలకు ఎంత ముందుగా బయలుదేరినా కొత్త చోటు, దూరం, రవాణా సౌకర్యాల కొరత వంటి సమస్యలు విద్యార్థుల ఆలస్యానికి కారణాలవుతున్నాయి. ట్రాఫిక్ స్తంభనలు, నడిరోడ్డుమీద ఊరేగింపులు, ధర్నాల వల్ల ఎదురయ్యే అవరోధాలు విద్యార్థులకు సవాళ్లు విసురుతున్నాయి. పరీక్ష పేపర్ల లీకేజీ, అవినీతి కార్యకలాపాల నియంత్రణ, సమయపాలన లక్ష్యాలుగా నిమిషం నిబంధన అమలు చేస్తున్నామని ప్రకటించుకున్నవారు, తన బాధ్యతల్ని తేలికగా తీసుకున్న సందర్భాలు అనేకం. పరీక్ష హాల్ టికెట్ పత్రాల్లో కేంద్రం పేరు ఒక దాని బదులు మరొకటి ఉండడం, చేతితో రాసిన పరీక్ష పత్రాలు పెట్టడం వంటి తప్పిదాలు సరి చేసుకోవడానికి అధికారులు ప్రయత్నించాలి. కానీ అర్థం పర్థం లేని నిమిషం నిబంధన చట్రాల్లో విద్యార్థులను బిగించవద్దు. కావున ఇంటర్ పరీక్షల విషయంలో భవిష్యత్తులో నిమిషం నిబంధనను బేషరతుగా ఉపసంహరించడం ఉత్తమం. 

- అంకం నరేష్, సోషల్​ ఎనలిస్ట్​