
- బీఆర్‌ఎస్‌తో పొత్తు ముచ్చట్నే లేదు
- బీఆర్ఎస్ను ప్రజలే ఖాళీ చేశారు.. మేం ఖాళీ చేయాల్సిన పని లేదు
- దోచుకోవడానికి కొడుకు, కూతుర్ని కేసీఆర్ వదిలిండు
- రాష్ట్రంలో సంస్థాగతంగా బలపడ్తున్నం..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీజేపీదే
- పార్టీలోని కొత్త నేతలు హద్దులు దాటొద్దు.. త్వరలో రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడి ప్రకటన
- తమిళనాడు, పశ్చిమ బెంగాల్లోనూ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడి
- బీజేపీలో జనసేన విలీనమయ్యే ప్రసక్తి లేదని వ్యాఖ్య
- మీడియా చిట్‌చాట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలు
కోయంబత్తూర్: తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదేనని, సంస్థాగతంగా తాము బలపడుతున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దక్షిణాదిలో తెలంగాణ, తమిళనాడులో విజయం సాధించడమే టార్గెట్‌గా పనిచేస్తున్నామని.. అటు పశ్చిమబెంగాల్లోనూ అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్పని అయిపోయిందని, ఆ పార్టీ ఫామ్ హౌస్‌కే పరిమితమైందని విమర్శించారు.
‘‘బీఆర్‌ఎస్‌తో మాకు పొత్తు ముచ్చట్నే లేదు. అదో ఫామ్‌హౌస్ పార్టీ. ఫామ్‌హౌస్ నుంచి పార్టీని నడిపిస్తే దానికి భవిష్యత్తు ఉంటుందా? మేం తెలంగాణలో ఏ పార్టీతోనూ కలిసి లేం” అని అమిత్ షా స్పష్టం చేశారు.
బుధవారం రాత్రి తమిళనాడులోని కోయంబత్తూర్‌లో అమిత్ షా మీడియాతో చిట్ చాట్ చేశారు. దీన్ని ఓ ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను చిట్‌చాట్‌లో అమిత్ షా ఖండించారు. తాము బీఆర్‌ఎస్‌తో కలిసే ప్రసక్తి లేదన్నారు. దోచుకోవడానికి కొడుకు, కూతుర్ని కేసీఆర్ వదిలారని.. ఇప్పటికే అనేక అవినీతి కేసుల్లో బీఆర్ఎస్ కూరుకుపోయిందని ఆయన ఆరోపించారు.
అవినీతి, కుటుంబ పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు. సిద్ధాంతపరమైన బీజేపీకి అవినీతి, కుటుంబ పార్టీతో పొత్తు ఉండదని ఆయన పేర్కొన్నారు. ‘‘బీఆర్ఎస్ను మేం ఖాళీ చేయాల్సిన పనిలేదు. తెలంగాణ ప్రజలే ఖాళీ చేశారు. ప్రస్తుతం ఫామ్‌హౌస్ నుంచే ఆ పార్టీ నడుస్తున్నది. దానికి ఫ్యూచర్ లేదు. రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయం, ప్రధాన ప్రతిపక్షం బీజేపీనే. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నం” అని ఆయన వివరించారు.
తెలంగాణ, తమిళనాడు, బెంగాల్ ఎన్నికలే టార్గెట్
దక్షిణాదిలో తాము తెలంగాణ, తమిళనాడులో అధికారంలోకి రావాలన్న టార్గెట్‌తో ముందుకు వెళ్తు న్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 2014 నుంచి సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నిస్తున్నామని.. తెలంగాణలో ప్రస్తుతం పార్టీ బలంగా ఉందని, ప్రధాన ప్రతిపక్షం కూడా తామేనని ఆయన చెప్పారు.
‘‘తెలంగాణలో భవిష్యత్తు మాదే. తప్పకుండా అధికారంలోకి వస్తాం. ఉత్తరాఖండ్, ఒడిశాలోనూ మేం మొదట సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నించారు. అదే ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి దోహదపడింది” అని వివరించారు. తమిళనాడులో అన్నాడీఎంకే, సినీ నటుడు విజయ్ పార్టీ ‘టీవీకే’తో బీజేపీకి పొత్తు ఉంటుందా? అని ప్రశ్నించగా.. ఎన్డీయేకు, డీఎంకేకు మధ్యనే తమిళనాడులో పోటీ ఉంటుందని అమిత్ షా వ్యాఖ్యానించారు. బీజేపీలో పవన్ కల్యాణ్ పార్టీ జనసేన విలీనం అవుతుందా? అని ప్రశ్నించగా.. అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదని ఆయన స్పష్టం చేశారు.
కొత్త నేతలు గీత దాటొద్దు
బీజేపీలో కొత్తగా చేరిన లీడర్లు గీత దాటొద్దని అమిత్‌షా వార్నింగ్ ఇచ్చారు. పాత, కొత్త లీడర్ల సమస్యతోనే బీజేపీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ ప్రకటన పెండింగ్‌లో ఉందా? అని ప్రశ్నించగా.. పలు రాష్ట్రాల్లోనూ ఈ ఇష్యూ పెండింగ్‌లో ఉందన్నారు. కొత్త లీడర్లు హద్దులు దాటొద్దని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు. త్వరలోనే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు జాతీయ అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని ఆయన వెల్లడించారు.