- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
మునుగోడు, (నల్గొండ జిల్లా) : మునుగోడు ప్రజలు సిద్ధాంతాలకు, భావజాలాలకే తప్ప డబ్బుకు లొంగరని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మునుగోడు ప్రజలు వేసే ఓటు మీదనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని అభిప్రాయపడ్డారు. మునుగోడు పీఆర్ఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ బూత్ స్థాయి ఇంఛార్జ్ లతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ మునుగోడుకు కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గం అన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు రాహుల్ గాంధీ, సోనియాగాంధీలపై ఆదరాభిమానాలు కలిగిన వారన్నారు. ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చిన పార్టీలు మునుగోడు నియోజకవర్గ ప్రజలను డబ్బులతో కొనవచ్చు అనుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవంపై అడుగులు వేస్తూ డబ్బులతో రాష్ట్రంపై దాడి చేయడానికి వస్తోందని హెచ్చరించారు. ఇక టీ ఆర్ఎస్ పార్టీ అధికార బలం, డబ్బు, మద్యంతో ఇక్కడి ప్రజలను కొనాలని చూస్తోందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న పాల్వాయి స్రవంతి ప్రతి గడపకు పరిచయమున్న వ్యక్తి అని.. ఇప్పుడు మునుగోడు ప్రజలు వేయబోతున్న ఓటుపైనే మొత్తం రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోపిడీలకు అడ్డుకట్టపడేలా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ‘‘కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా వున్నారు.. అవసరం ఉన్నప్పుడు పిలుస్తాం.. అప్పుడు వస్తారు..’’ అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.