
- 2047 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు
- వెల్లడించిన క్రెడాయ్-కొలియర్స్ రిపోర్ట్
సిడ్నీ/న్యూఢిల్లీ : మనదేశంలో రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని తాజా స్టడీ తేల్చింది. ఇండియా రియల్ ఎస్టేట్ మార్కెట్ సైజు 2047 నాటికి 5–-7 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. పెరుగుతున్న ఆర్థిక వృద్ధి, వేగవంతమైన పట్టణీకరణ కారణంగా 10 ట్రిలియన్ డాలర్లకు వరకు కూడా చేరుకోవచ్చని క్రెడాయ్–కొలియర్స్ 'ఇండియన్ రియల్ ఎస్టేట్: ది క్వాంటమ్ లీప్' పేరుతో విడుదల చేసిన రిపోర్టు వెల్లడించింది. రియల్టీ నుంచి జీడీపీ కంట్రిబ్యూషన్ 2021లో 0.2 ట్రిలియన్ డాలర్ల వరకు ఉండగా, 2030 నాటికి ఇది ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.
2047 నాటికి భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిమాణం నిరాశావాద కోణంలో చూసినా 3-5 ట్రిలియన్ డాలర్లకు, వాస్తవిక దృక్పథంతో చూస్తే 5-7 ట్రిలియన్ డాలర్లకు, ఆశాజనక ఆలోచనతో చూస్తే 7-10 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. భారతదేశ మొత్తం జీడీపీలో రియల్ ఎస్టేట్ రంగం వాటా 14-–20 శాతం వరకు ఉంటుందని అంచనా. అన్ని రియల్ ఎస్టేట్ విభాగాలలో ఎక్కువ సంస్థాగతీకరణ, మార్కెట్ ఏకీకరణ ఉండొచ్చు.
చిన్న నగరాలకు కూడా...
పెద్ద నగరాలతోపాటు చిన్న నగరాలకూ రియల్ ఎస్టేట్ చేరుకుంటుంది. వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న సాంకేతిక పురోగతి ఇందుకు కారణమని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ అన్నారు. 2047 నాటికి, భారతదేశ జనాభాలో 50 శాతం మంది పట్టణ కేంద్రాలలో నివసిస్తారని, నివాసం కోసం, ఆఫీసులు, రిటైల్ నుంచి విపరీతమైన డిమాండ్ ఉంటుందని ఆయన అన్నారు. రియల్ ఎస్టేట్ రంగం సంస్థాగత పెట్టుబడులను భారీగా ఆకర్షిస్తుందని, పోటీ మరింత పెరుగుతుందని ఆయన వివరించారు.
క్రెడాయ్ నేషనల్ చైర్మన్ మనోజ్ గౌర్ మాట్లాడుతూ, రెరా, రీట్ వంటి రూల్స్రావడం వల్ల ఈ రంగంలో పెట్టుబడులపై నమ్మకం పెరిగిందని చెప్పారు. కేంద్రం చేపడుతున్న పీఎం ఆవాస్ యోజన వంటి కార్యక్రమాలు రియల్ ఎస్టేట్‌కు మరింత ఊతమిస్తాయన్నారు. పట్టణీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటలైజేషన్, జనాభా మార్పులు, స్థిరత్వం, పెట్టుబడి వైవిధ్యం వంటివి రియల్టీకి ఊతమిస్తాయని రిపోర్ట్ వివరించింది.