
ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. గబ్బాగా పిలువబడే బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్‌ను కూల్చివేయనున్నారు. 2032 ఒలింపిక్స్ తర్వాత గ్రౌండ్ ను కూల్చి వేసి కొత్త స్టేడియాన్ని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని క్వీన్స్‌ల్యాండ్ క్రికెట్ CEO టెర్రీ స్వెన్సన్ ఒక ప్రకటనలో తెలిపారు. "గబ్బా చాలా సంవత్సరాలుగా క్రికెట్‌కు అద్భుతమైన వేదికగా ఉంది. అభిమానులు, ఆటగాళ్లకు లెక్కలేనన్ని జ్ఞాపకాలను అందించింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొత్త స్టేడియాన్ని నిర్మించాలనుకుంటున్నాం". అని అయన అన్నారు.
ఏడు సంవత్సరాల ఈ బ్లూప్రింట్ విశిష్ట లక్షణం ఏమిటంటే.. 63,000 సీట్ల సామర్థ్యం గల కొత్త స్టేడియం నిర్మించనున్నారు. స్టేడియం కట్టడానికి దాదాపు AUD 3.8 బిలియన్లు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఈ స్టేడియం క్రీడలకు ఒలింపిక్ స్టేడియంగా పనిచేస్తుంది. కొత్త స్టేడియం కార్యాచరణలోకి వచ్చిన తర్వాత కూడా గబ్బాలో క్రికెట్ మ్యాచ్ లు జరుగుతాయి. అనగా 2032 ఒలింపిక్స్ వరకు గబ్బాలో క్రికెట్ మ్యాచ్ లు కొనసాగుతాయి. 2032 ఒలింపిక్స్ తర్వాత గబ్బాను కూల్చివేసి, విక్టోరియా పార్క్‌లో 60,000 సీట్ల స్టేడియం నిర్మిస్తారు.
ALSO READ | DC vs LSG: కెప్టెన్సీ ఫ్లాప్.. చెత్త బ్యాటింగ్: లక్నోని చేజేతులా ఓడించిన రూ.27 కోట్ల వీరుడు
ఇప్పటివరకు క్రికెట్ మాత్రమే జరిగే ఈ గ్రౌండ్ లో 2032 ఒలింపిక్స్ తర్వాత ఇతర క్రీడలు కూడా జరుగుతాయి. క్వీన్స్‌ల్యాండ్ ప్రీమియర్ డేవిడ్ క్రిసాఫుల్లి ఈ క్రికెట్ గ్రౌండ్ ను AFL, రగ్బీ, యాషెస్, ICC టోర్నమెంట్‌ల వంటి ప్రధాన క్రికెట్ ఈవెంట్‌లకు ఈ స్టేడియాన్ని ఉపయోగించనున్నారు. 1931 లో గబ్బాలో తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం మెన్స్ ఈ గ్రౌండ్ లో 67 టెస్ట్ మ్యాచ్ లతో పాటు మహిళలు రెండు టెస్టులాడారు. 2021 లో రహానే కెప్టెన్సీలో భారత్ టెస్ట్ సిరీస్ గెలుచుకుంది ఈ మైదానంలోనే కావడం విశేషం. ఎన్నో దశాబ్దాలపాటు ఈ స్టేడియంలో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తూ వస్తుంది. 1988 నుంచి 2021 మధ్య ఆతిథ్య జట్టు ఇక్కడ ఓడిపోలేదు.