
- వివరాలు వెల్లడించిన సీపీ అనురాధ
సిద్దిపేట టౌన్, వెలుగు : అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్‌చేసి శనివారం కోర్టులో హాజరుపరిచినట్లు సీపీ అనురాధ తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం చందర్ నాయక్ తండాకు చెందిన నగేశ్ రాధోడ్, బలరాం జాదవ్, పుండలిక్ జాదవ్, జైరామ్ జాదవ్, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల తండా కు చెందిన కెతావత్ రాజు ఒక ముఠాగా ఏర్పడి తాళం వేసిఉన్న ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్నారు.
3 నెలల నుంచి 38 దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. వీరిపై పలు పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకున్నారు. ముఠాలోని ఐదుగురు సభ్యలలో నలుగురిని పట్టుకోగా ఒకరు పరారీలో ఉన్నట్లు చెప్పారు. వారి దగ్గరి నుంచి 40.6 తులాల బంగారు నగలు, 55 తులాల వెండి నగలు, 33, 50, 600 నగదు, 4 బైక్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మరో కేసులో ఇద్దరు దొంగల అరెస్ట్
ఇండ్ల తాళాలు పగలగొట్టి దొంగతనం చేస్తున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ అనురాధ తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ర్టం పిపర్వ గ్రామానికి చెందిన షరీఫ్, తవాబ్ ఈనెల 13న గజ్వేల్పీఎస్పరిధిలోని ములకలపల్లి వెంకన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను వెతికి పట్టుకున్నారు. వారి దగ్గరి నుంచి ఆరున్నర తులాల బంగారంతో పాటు, రూ. 27 వేల నగదు, ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మూడు గంటల్లో బాలుడి కిడ్నాప్..కేసును ఛేదించిన పోలీసులు..
సిద్దిపేట జిల్లా మర్కుక్ పీఎస్పోలీసులు మూడు గంటల్లో బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించారు. సీపీ అనురాధ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మర్కుక్ పీఎస్పరిధిలోని కర్కపట్ల గ్రామంలో ఉన్న ఆస్పిరో ఫార్మా లో పనిచేసే తబ్రీజ్ ఆలం కొడుకు తావిద్ ఆలం(7) ఈనెల 19న స్కూల్ కు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తబ్రీజ్ పీఎస్‌లో కంప్లైంట్ ఇవ్వడంతో ఎస్ఐ మధుకర్ రెడ్డి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ద్వారా గుర్తు తెలియని వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు.
అదే సమయంలో పిల్లాడి తండ్రికి ఓ కొత్త నెంబర్ నుంచి ఫోన్ కాల్వచ్చింది. తన కొడుకును కిడ్నాప్ చేశామని, విడుదల చేయాలంటే రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే స్పెషల్ టీంను ఏర్పాటు చేసి కిడ్నాపర్లు బిహార్ కు చెందిన అనూప్ చౌదరి, చందన్ కుమార్ దాస్, మేఘనాథ్ కర్మాకర్ ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర పట్టుకున్నట్లు తెలిపారు. వీరిలో ప్రధాన నిందితుడైన అనూప్ చౌదరి బాలుడి తండ్రి వద్ద ఎనిమిది నెలల క్రితం పని చేశాడు. డబ్బులు బాకీ ఉండడంతో వాటిని వసూలు చేసుకోవడానికి అతడి కుమారుడిని కిడ్నాప్ చేశాడని సీపీ పేర్కొన్నారు.