మేడిగడ్డ ఏడో బ్లాక్‌‌‌‌‌‌‌‌లో గేట్లను ఎత్తుతున్నరు

మేడిగడ్డ ఏడో బ్లాక్‌‌‌‌‌‌‌‌లో గేట్లను ఎత్తుతున్నరు

మహదేవపూర్, వెలుగు :  కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ లో కుంగిన ఏడో బ్లాక్ లోని గేట్లను అధికారులు ఒక్కొక్కటిగా ఎత్తుతున్నారు. ఎన్డీఎస్ఏ బృందం పరిశీలించి వెళ్లిన తర్వాత ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఎల్ అండ్ టీ సంస్థ ద్వారా ఇరిగేషన్ ఆఫీసర్లు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా కుంగిన ఏడో బ్లాక్ లోని 14, 15 వ పిల్లర్ల మధ్యనున్న గేటును ఎత్తారు. బ్లాక్ లోని గేట్లు పైకి ఎత్తడానికి వీలు లేకుండా ఉన్నాయి. బ్లాక్ లో స్టార్టింగ్ పాయింట్ లోని 15వ గేటును మొదటగా ఎత్తారు. 

వరుసగా మిగతా గేట్లను కూడా ఎత్తడానికి ప్రయత్నిస్తామని ఇరిగేషన్ ఆఫీసర్లు తెలిపారు. కాగా కుంగిన పిల్లర్ల మధ్య గేట్లు ఇరుక్కోవడంతో మిషన్ సహాయంతో పైకి లేచే అవకాశం లేదు. దీనితో పిల్లర్ల పైన ఏర్పాటు చేసిన గేట్లను ఆపరేట్ చేసే మిషన్లను తొలగించి మాన్యువల్ గా గేట్లను తీసే ప్రయత్నం చేయనున్నట్టు తెలిసింది. కుంగిన పిల్లర్ల వద్ద నున్న గేట్లను తీయడమే ఇప్పుడు పెద్ద పనిగా మారింది. వర్షాలు పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యే నాటికి మేడిగడ్డ బ్యారేజీ లోని కుంగిన బ్లాక్ లోని మొత్తం గేట్లను ఎత్తి బ్యారేజ్ వరద తాకిడికి గురికాకుండా ఏర్పాట్లు చేస్తున్నారని ఇరిగేషన్ ఆఫీసర్లు తెలిపారు.