- ఫస్ట్ నెగిటివ్ వచ్చినా..తర్వాత పాజిటివ్
- క్యారియర్లుగా మారుతున్న కాంటాక్ట్ పర్సన్స్
హైదరాబాద్, వెలుగు:కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీకి చెందిన వృద్ధుడు ఇటీవల కరోనాతో మరణించాడు. ఆయనకు ప్రైమరీ కాంటాక్ట్‌గా ఉన్న డ్రైవర్‌కు టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. వారం తర్వాత అతనిలో కరోనా సింప్టమ్స్ కనిపించడంతో మరోసారి టెస్ట్ చేస్తే పాజిటివ్‌గా తేలింది. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ లో చాలావరకు సింప్టమ్స్ లేట్‌గా బయటపడడం వైరస్ వ్యాప్తిని పెంచుతోంది. దాంతో క్వారంటెయిన్ లో ఉన్నవారికి వారాని కోసారి టెస్ట్ లు చేయాలని బల్దియా కోవిడ్ కంట్రోల్ టీం నిర్ణయించింది.
కేసులు తగ్గించేదెలా?
గ్రేటర్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లకు విడతల వారీగా టెస్ట్‌లు చేయనున్నారు. ఆ మేరకు మెడికల్, రెవెన్యూ, పోలీస్ టీమ్స్ రెడీ అవుతున్నాయి. తరచూ టెస్టుల వల్ల పాజిటివ్ పర్సన్స్ ని వేగంగా గుర్తించే వీలుంటుందని జీహెచ్‌ఎంసీ కరోనా కంట్రోల్ వింగ్‌లోని ఓ అధికారి తెలిపారు. లాక్‌డౌన్ రిలాక్సేషన్స్ తో కాంటాక్ట్ పర్సన్స్ బయట తిరగడం ఎక్కువైందని, కేసులు పెరగడానికి ఇదీ ఓ కారణమని అన్నారు.
బోరబండ లింక్ పహాడీషరీఫ్ లో..
ఈ నెల 21న బోరబండలో ఒకరికి కరోనా రావడంతో అధికారులు లింక్ కోసం సెర్చ్ చేసి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ ను గుర్తించి టెస్ట్ లు చేశారు. మొత్తం 30 మందికి పాజిటివ్ గా వచ్చింది. గౌలిపురా, సంతోశ్‌నగర్, జియాగూడ ప్రాంతాలకు చెందిన ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఫ్యామిలీతో కలిసి ఈ నెల 15న పహాడీషరీఫ్ లోని మటన్ వ్యాపారైన తండ్రి ఇంటికి వెళ్లారు. మూడ్రోజులు అక్కడే ఉండి దావత్ చేసుకున్నారు. తర్వాత హర్షగూడ, సంతోశ్ నగర్, బోరబండలోని బంధువుల ఇండ్లకు వెళ్లారు. బోరబండలో ఉండే బంధువుకు మొదట కరోనా సింప్టమ్స్ బయటపడ్డాయి. అతడికి టెస్ట్ చేయగా పాజిటివ్ రావడంతో అధికారులు ఆ చైన్ లింక్ అంతటికీ టెస్ట్ లు చేశారు. పహాడీషరీఫ్ లో13, హర్షగూడలో 4, గౌలిపురాలో 3, సంతోశ్‌నగర్ లో 3, జియాగూడలో 4, బోరబండలో 3 పాజిటివ్ కేసులు తేలాయి. హర్షగూడలో 125 ఇండ్లలోని వారిని హోం క్వారంటెయిన్ చేశారు. బుధవారం హెల్త్, జీహెచ్ ఎంసీ అధికారులతో కలిసి కందుకూరు ఆర్డీవో పహాడీ షరీఫ్ ఏరియాను సందర్శించి కంటెయిన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. పహాడీ షరీఫ్ మటన్ వ్యాపారి బంధువులకు ఉన్న నాన్ వెజ్ షాప్ లను మూయించారు.
క్యారియర్లుగా భావిస్తూ..
పహాడీషరీఫ్ మటన్ వ్యాపారికి సిప్టమ్స్ కనిపించిన 3 రోజుల తర్వాత కూడా అతడు మటన్ అమ్మినట్లు అధికారులు గుర్తించారు. ఆ టైమ్ లో అక్కడ ఎవరెవరు మటన్ కొన్నారో డీటెయిల్స్సేకరించి హోం క్వారంటెయిన్ చేస్తున్నారు. 35 ప్రైమరీలకు టెస్ట్ లు చేసి.. 45 మంది సెకండరీ కాంటాక్ట్ లను హోం క్వారంటెయిన్ చేశారు. వారందరినీ కరోనా క్యారియర్స్ గానే భావిస్తున్నారు. జియాగూడ, గుడిమల్కాపూర్ ఏరియాల్లో మటన్ మండీలు ఎక్కువగా ఉన్నాయి. లాక్ డౌన్ లోనూ అక్కడ మటన్ అమ్మకాలు ఎక్కువే జరిగాయి. ఈ మటన్ మండీల కారణంగానే ఆ ఏరియాల్లో వైరస్ వ్యాప్తి జరిగి ఉంటుందని అధికారులు అంచనాకు వస్తున్నారు.