గచ్చిబౌలి, వెలుగు: రాయదుర్గం లెదర్ ఇండస్ట్రీ స్థలంలోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం కూల్చివేశారు. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పరిధిలోని సర్వే నంబర్1, 3, 4, 19లో తెలంగాణ లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కు చెందిన స్థలం ఉంది. అందులో లిడ్ క్యాప్ సంస్థ నడుస్తోంది. సదరు స్థలంలోని 6 ఎకరాలను టీఎస్ఐఐసీకి కేటాయిస్తూ లెదర్ ఇండస్ట్రీ కార్పొరేషన్ కొన్ని నెలల కింద ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఆ 6 ఎకరాల్లోని 500 గజాల విస్తీర్ణంలో రెండు పక్కా భవనాలు, మరో 500 గజాల విస్తీర్ణంలో మూడు రేకుల షెడ్లు ఉన్నాయి. వాటిని ఖాళీ చేయాలని లెదర్ఇండస్ట్రీ కార్పొరేషన్ పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ భవన యజమానులు స్పందించలేదు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం కూల్చివేశారు. కొందరు లెదర్ఇండస్ట్రీకి సంబంధించిన స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. కొన్నేండ్ల పాటు స్థల వివాదం నడవగా, కోర్టు లెదర్ఇండస్ట్రీకి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. కూల్చివేతల టైంలో స్థానికులు ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.