ఇప్పటికీ ఇదేం కుల వివక్ష.. ఈ శివాలయంలో.. దళితులు అడుగుపెట్టడానికి 200 ఏళ్లు పట్టింది..!

ఇప్పటికీ ఇదేం కుల వివక్ష.. ఈ శివాలయంలో.. దళితులు అడుగుపెట్టడానికి 200 ఏళ్లు పట్టింది..!

‘‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’’ అని గురజాడ చెప్పిన మాటలు ఇప్పటికీ కొందరికి రుచించడం లేదు. ‘‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే కులంరోయ్.. కులమే మా బలమురోయ్’’ అని కొందరు కులాంహకారంతో కుళ్లిపోతూనే ఉన్నారు. మన దేశంలో ఇప్పటికీ కుల వివక్ష ఏ స్థాయిలో ఉందో కళ్లకు కట్టిన ఘటన ఇది. పశ్చిమ బెంగాల్లోని ఒక గ్రామంలో వందల ఏళ్ల తర్వాత దళితులకు ఆలయ ప్రవేశం దక్కింది. అక్కడి దళితులు అగ్ర కుల దురహంకార గోడలను కూల్చేశారు. గుడిలోకి వెళ్లి పూజలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు.

పశ్చిమ బెంగాల్లోని పుర్బా బర్ధమాన్ జిల్లాలో గిధ్ గ్రామ్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోని దస్పారా ప్రాంతంలో 130 పూరి గుడిసెల్లో దళితులు నివసిస్తున్నారు. గిద్దేశ్వర్ అనే శివాలయం ఉంది. 200 ఏళ్ల క్రితం ఈ శివాలయం నిర్మాణం జరిగింది. 1997లో ఈ శివాలయాన్ని పున: నిర్మించారు. ఇన్నేళ్ల నుంచి ఈ శివాలయంలోకి దళితులకు ప్రవేశం లేదు. ఒకవేళ ధైర్యం చేసి ఎవరైనా ఆలయంలోకి అడుగుపెడితే గ్రామంలోని అగ్ర కులాల నుంచి ఎదురుదాడులు తప్పవు. 

ఈ భయంతోనే ఇన్నాళ్లు ఆలయంలోకి వెళ్లేందుకు జంకిన దళితులు ధైర్యం చేసి ఫిబ్రవరి 24న.. మహాశివరాత్రికి సరిగ్గా రెండు రోజుల ముందు తాము ఎదుర్కొంటున్న వివక్ష గురించి జిల్లా యంత్రాంగానికి లేఖ రాశారు. సుమారు 200 ఏళ్ల నుంచి ఈ ఆలయంలోకి వెళ్లే అవకాశం లేక వివక్ష ఎదుర్కొంటున్నామని, చొరవ చూపి తమకూ ఆలయ ప్రవేశం కల్పించాలని లేఖలో గ్రామంలోని దళితులు జిల్లా యంత్రాంగాన్ని కోరారు.

మహాశివరాత్రి రోజు ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు కూడా. అయినప్పటికీ ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున ఆలయంలోకి ప్రవేశించాలని చూసిన గ్రామంలోని దళితులను తరిమేశారు. ఆలయ ప్రాంగణంలో కూడా అడుగుపెట్టనివ్వలేదు. అంతేకాదు.. పశు పోషణ ద్వారా పొట్టనింపుకుంటున్న దళిత కుటుంబాల ఆర్థిక మూలాలపై కూడా దెబ్బకొట్టారు. గ్రామంలోని వారెవ్వరూ ఈ దళితుల నుంచి పాలను కొనుక్కోలేదు. ఇంత కుల వివక్ష ఇప్పటికీ ఉందంటే.. అదీ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కత్తాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో ఉందంటే నమ్మగలమా..? నమ్మి తీరాలి.

ఈ వివక్ష ఈ గ్రామంలోని దళితుల్లో మరింత చైతన్యం పెంచింది. ఎలాగైనా ఆలయంలో పూజలు చేసి తీరాలనే కాంక్షను రగిల్చింది. చివరకు గిధాగ్రామ్ దళితులు అనుకున్నది సాధించారు. స్థానిక టీఎంసీ ఎమ్మెల్యే అపుర్బా చౌదరి, జిల్లా అధికార యంత్రాంగం గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ప్రతీ ఒక్కరికీ తమకు నచ్చిన దైవాన్ని ఆరాధించుకునే హక్కు ఉందని, ఈ గ్రామంలోని దాస్(దళిత) కుటుంబాలను గిద్ధేశ్వర్ శివ్ మందిర్ లోకి అనుమతించాల్సిందేనని ఎమ్మెల్యే, జిల్లా అధికార యంత్రాంగం తీర్మానం చేశారు. 

దీంతో.. వందల ఏళ్లుగా ఆ పరమశివుడి దర్శనానికి దూరమైన దళితుల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఐదుగురు దళితులు భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆ శివాలయం 16 మెట్లు ఎక్కి ఆలయంలోకి అడుగుపెట్టారు. ఆ శివయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మార్చి 12న ఉదయం 10 గంటలకు గ్రామంలోని దళితులు ఆ శివయ్య చెంతకు చేరారు. ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతున్నా.. ఇప్పటికీ కొన్ని విషయాల్లో మనం చాలా వెనుకబడే ఉంటున్నామని, ఇకనైనా కుల వివక్షను విడనాడి మనిషిని మనిషిగా చూడాలని గిధాగ్రామ్ దళితులు ఆకాంక్షించారు.