ఖమ్మం, వెలుగు: బీసీ గురుకులంలో చదువుతున్న ఓ స్టూడెంట్ కాళ్లు, చేతులు చచ్చుబడిన స్థితిలో నాలుగు రోజుల కింద హాస్పిటల్‌లో చేరింది. ఇందుకు గురుకులం సిబ్బంది నిర్లక్ష్యంగా రేబిస్ వ్యాక్సిన్ వేయించడమే కారణమని స్టూడెంట్ తల్లి ఆరోపించింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మంలోని ముస్తఫానగర్‌కు చెందిన సముద్రాల లక్ష్మీ భవాని కీర్తి రఘునాథపాలెంలోని దానవాయిగూడెం బీసీ గురుకులంలో టెన్త్ చదువుతోంది.
కీర్తి వారం రోజుల కింద తల్లి భానుసాయి బిందుకు ఫోన్ చేసి కాళ్లు గుంజుతున్నాయని చెప్పింది. దీంతో ఆమె గురుకులానికి వెళ్లి చూడగా కీర్తి నడవలేని స్థితిలో కనిపించింది. వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి చూపించగా కుడి కాలు, ఎడమ చేయి చచ్చుబడిపోయాయని డాక్టర్లు చెప్పారు. నాలుగు రోజులు ట్రీట్‌మెంట్ చేయడంతో ప్రస్తుతం కీర్తి చేయి పనిచేస్తుండగా, కుడి కాలు కింది భాగంలో ఇంకా స్పర్శ రాలేదు.
స్టూడెంట్ తల్లి బిందు మాట్లాడుతూ.. గురుకులంలో రెండేండ్లలో నాలుగు సార్లు ఎలుకలు కరిచాయని, దీంతో 15 డోసుల రేబిస్ వ్యాక్సిన్ వేయించారని ఆరోపించింది. వ్యాక్సిన్ ఓవర్ డోస్ కారణంగానే తన కుమార్తెకు పార్శియల్ పెరాలిసిస్ వచ్చి కాళ్లు, చేతులు పనిచేయకుండా పోయాయని డాక్టర్లు చెప్పారని ఆవేదన వ్యక్తం చేసింది.
నాలుగు డోసులు మాత్రమే వేయించారు
స్టూడెంట్ కీర్తిని ఈ ఏడాది ఫిబ్రవరి 28న రాత్రి ఎలుక కరిచింది. తర్వాతి రోజు సిబ్బంది ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ వారానికి ఒకటి చొప్పున నాలుగు డోసుల రేబిస్ వ్యాక్సిన్ వేయించాకే బాలిక కోలుకుంది. నేను ఆర్సీవోగా జాయిన్ అయిన తర్వాత ఒక్కసారి కూడా ఎలుకలు కరిచిన ఘటన జరగలేదు. బాలిక గతేడాది ఇంటి నుంచే స్కూల్‌కు వచ్చేది, ఈ సారి టెన్త్ కావడంతో గురుకులంలోనే ఉండాలని చెప్పాం.
జూలారాణి.. బీసీ గురుకులాల ఆర్సీవో
వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు
రేబిస్ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాళ్లు, చేతులు చచ్చుబడి పోవడానికి వ్యాక్సిన్ కారణం కాకపోవచ్చు. ఇతర కారణాలేవైనా ఉన్నాయేమో టెస్టులు చేసిన తర్వాత గానీ చెప్పలేం. – డాక్టర్ చైతన్య, న్యూరో సర్జన్, ఖమ్మం