- జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ఘటన
- లివర్ చికిత్స కోసం రూ.1.30 లక్షలు దాచుకున్న ప్రైవేటు టీచర్
- కండ్లకు పచ్చడి పూసి వేధింపులు
- దాడిచేసిన ఆరుగురు నిందితుల అరెస్టు
దొంగతనం చేశారని బాలికలను చెట్టుకు కట్టేసి, కండ్లకు పచ్చడి పూసి వేధింపులకు గురిచేశారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరులో జరిగిందీ దారుణం.
పాలకుర్తి, వెలుగు: దొంగతనం చేశారని బాలికలను చెట్టుకు కట్టేసి, కండ్లకు పచ్చడి పూసి వేధింపులకు గురిచేశారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరులో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్నూరుకు చెందిన పుస్కూరి మధుకర్ రావు ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆయన గత కొద్ది రోజులుగా లివర్ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం రూ.1.30 లక్షల నగదు దాచుకున్నారు. గత నెల 27న ఆయన ఇంట్లో ఈ డబ్బు చోరీకి గురైంది. దీంతో మధుకర్ రావు.. స్థానికంగా ఉంటున్న ఇద్దరు బాలికల (12) ను అనుమానించారు. ఆ ఇద్దరినీ స్థానిక పెద్ద మనుషుల దగ్గరకు పిలిపించి నిలదీశారు. ఎంత అడిగినా వారు డబ్బుల గురించి చెప్పకపోవడంతో మధుకర్ ఈ నెల 3న పోలీసులను ఆశ్రయించారు.
మైనర్ బాలికలను స్టేషన్‌కు పిలిపించడం కుదరదని ఎస్ఐ తాళ్ల శ్రీకాంత్ చెప్పారు. ఊర్లోనే విచారించేందుకు కానిస్టేబుల్‌ను పంపించారు. అయితే, బాలికల్లో తన తమ్ముడి కూతురు కూడా ఉండడంతో తామే సెటిల్ చేసుకుంటామని, కేసు అవసరం లేదని మధుకర్ రావు చెప్పడంతో కానిస్టేబుల్ వెళ్లిపోయారు. మరోసారి పెద్ద మనుషుల ఎదుట బాలికలను ప్రశ్నించగా.. తామిద్దరం కలిసి డబ్బులు తీశామని ఒప్పుకున్నారు. మధుకర్ తమ్ముడి కూతురు తనకు రూ.5 వేలు ఇచ్చిందని రెండో బాలిక చెప్పింది. మిగిలిన డబ్బులను దాచిపెట్టామని చెప్పారు. ఆ డబ్బు కోసం బాలికలను ఊర్లో పలు చోట్లకు తిప్పి వెతికించినా డబ్బులు దొరకలేదు. దీంతో మధుకర్ కొంతమందితో కలిసి ఈ నెల 5న ఉదయం ఇద్దరు బాలికలనూ చెట్టుకు కట్టేసి, కండ్లకు మామిడికాయ పచ్చడి పూసి కొట్టారు. ఓ బాలిక తల్లిపైనా దాడి చేశారు. అదే రోజు సాయంత్రం గ్రామ పంచాయితీ ఆఫీసుకు వారిని పిలిపించి బెల్టుతో కొడుతూ చెట్టుకు కట్టేయబోతుండగా స్థానికులు అడ్డుకోవడంతో ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసి మంగళవారం రాత్రి ప్రజా సంఘాల నాయకులు బాధితుల ఇంటికి వెళ్లి మాట్లాడారు. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో ఎస్ఐ శ్రీకాంత్ బాధితుల దగ్గర స్టేట్మెంట్ తీసుకొన్నారు. నిందితులు మధుకర్ రావు, ఆయన తమ్ముడు, వెంకటేశ్వర్లుతో పాటు మరో ముగ్గురు మహిళలపై కేసు నమోదు చేసి వారందరినీ అరెస్టు చేశారు.
రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా, నిరసన
చెన్నూరులో బాలికలను చిత్రహింసలకు గురిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేశ్ రాజా, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సింగారపు రమేశ్, బహుజన కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి రాజుల సాంబయ్య, బహుజన ముక్తి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేంద్ర పవర్ డిమాండ్ చేశారు. బుధవారం పాలకుర్తి రాజీవ్ చౌరస్తా వద్ద వారు ధర్నా చేశారు. ఘటన జరిగి 20 రోజులైనా నిందితులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు కూడా ధర్నాలో పాల్గొన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని ఎస్ఐ శ్రీకాంత్.. ఆందోళనకారులకు నచ్చచెప్పారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు.