
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ పట్టణంలో నల్లపోచమ్మ బోనాలు వైభవంగా నిర్వహించారు. టెంపుల్ 17వ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నవాపేట, పెద్దబజార్, పిట్లంబేస్, ఫతేనగర్, చమన్, గాంధీనగర్, ఇందిరాపురి కాలనీ, బ్రాహ్మణవీధి, ఆజంపుర, వీరహనుమాన్ కాలనీలకు చెందిన మహిళలు బోనాలతో రాందాస్ చౌరస్తాకు తరలివచ్చారు. అక్కడి నుంచి డీజే సౌండ్, బ్యాండ్ మేళాలు, యువకుల డాన్సుల మధ్య మహాత్మా గాంధీ రోడ్డు, మున్సిపల్ ఆఫీస్, పాత బస్టాండ్ మీదుగా ఆటోనగర్‌లోని నల్లపోచమ్మ ఆలయం ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు.
ఈ ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మెదక్ శివారులో కేటాయించిన మున్నూరుకాపు భవవ నిర్మాణ స్థలం ప్రొసీడింగ్ కాపీని ఆ సంఘం జిల్లా ప్రెసిడెంట్ బట్టి ఉదయ్ కుమార్‌కు అందజేశారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్, మున్నూరుకాపు మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండ నారాయణ, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, టీఎన్జీవో జిల్లా ప్రెసిడెంట్ దొంత నరేందర్, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, లలిత, చందన, ఆవారి శేఖర్, మున్నూరు కాపు నేతలు పాల్గొన్నారు.