
ఇప్పటికీ మన విద్యావ్యవస్థలో సుమారు 40 రకాల పాఠశాలలు ఉనికిలో ఉన్నాయి. ఒకే జ్ఞాన అభ్యసన లక్ష్యంతో మొదలైన విద్యావ్యవస్థలో ఇన్నిరకాల పాఠశాలలు అవసరమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. బడి వయస్సున్న పిల్లలకు బడి యాక్సెస్ కల్పించాల్సిన సందర్బంలో అధికారులకు ఏ ఆలోచన పుడితే వాటిని కార్యాచరణలో పెట్టడం వలన ఈ రకమైన ప్రత్యేక పాఠశాలలు ఏర్పడి ఉనికిలో ఉన్నాయి. వాటి అవసరం తీరిన తర్వాత కూడా పాఠశాలలు అలాగే కొనసాగించడం వలన ప్రభుత్వాలు విద్యా వ్యవస్థపై పెట్టే ఖర్చు వృథా కావడంతోపాటు జరగాల్సిన వర్గాలకు కనీస లబ్ధి కూడా చేకూరడం లేదు.
ఏ పేద పిల్లల యాక్సెస్ కోసమైతే ఇన్ని పాఠశాలలు ఉనికిలోకి వచ్చాయో ఆ పిల్లల విద్యా అవసరాలు తీర్చే స్థితిలో మన పాఠశాల వ్యవస్థ నేడు లేదు. పాశ్చాత్య దేశాలలో, సోషలిస్టు దేశాలలో విద్యావ్యవస్థ ప్రభుత్వ రంగంలోనే ఉండడంతోపాటు క్యాచ్ మెంట్ ఏరియాగా నిర్ణయించిన పాఠశాలలలోనే అడ్మిషన్ ఇస్తారు. రాజైనా, బంటైనా వారి పిల్లలుకు ఆ క్యాచ్మెంట్ ఏరియా పాఠశాలనే శరణ్యం. మరి అలాంటి స్థితి మన దేశంలో ఎందుకు లేదు?
తెలంగాణ విద్యా గణాంకాలు 2023-–24 నివేదికను పరిశీలన చేస్తే ప్రభుత్వ బడులు 30,022ఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు19,734, మాధ్యమిక పాఠశాలలు 3,237, ఉన్నత పాఠశాలలు4,843 ఉన్నాయి. ఇటీవల తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికలో 13వేల ప్రాథమిక పాఠశాలల్లో 50 మందికంటే తక్కువ పిల్లలున్నారని, ఇంచుమించు ఉన్నత పాఠశాలల్లో అదేస్థితి ఉన్న విషయం బహిర్గతం చేసింది. అంటే ఈ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి వేతనం పొందుతున్న శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉండగా, అనేక ఏండ్లుగా సమకూరిన విలువైన స్థలాలు, సర్వశిక్షా అభియాన్ నిర్మించిన కోట్లాది రూపాయల భవన సముదాయాలు ఉన్నాయి. కానీ, పిల్లల సంఖ్య రోజురోజుకూ పడిపోతోంది.
స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ సిలబస్సీబీఎస్సీ సిలబస్ స్కూల్స్, ప్రభుత్వ రంగంలో, ప్రైవేటు రంగంలో సెంట్రల్ బోర్డు సిలబస్‌ను అనుసరించే పాఠశాలలు కొన్ని ఉన్నాయి.1985 నూతన విద్యా విధానం నుంచి అప్పట్లో జాతీయత పెంచాలని ఏర్పరచిన నవోదయ పాఠశాలలు జిల్లాకొకటి చొప్పున కేంద్రం ఏర్పాటు చేసింది. వీటిలో పిల్లలను రాష్ట్రాలవారీగా మార్చుకుంటారు. జాతీయవాదం బలపర్చే లక్ష్యంతో నెలకొల్పిన పాఠశాలలు అలాగే కొనసాగుతున్నాయి.
స్టేట్ సిలబస్ పాఠశాలలు, ప్రభుత్వ
పాఠశాలలన్నింటా ఇదే అమలు జరుగుతుంది. ఇంటర్నేషనల్ సిలబస్ అనుసరించే పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వరంగంలో ఢిల్లీలో ఓ ప్రయత్నం నడిచింది. ప్రైవేటు రంగంలో సిడార్ వ్యాలీ తదితర పేర్లతో నడుస్తున్నాయి. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్టాండర్డ్స్‌లో కొన్ని ఇంటర్నేషనల్ పాఠశాలలు ప్రైవేటు రంగంలో ఏర్పడ్డాయి. స్పెషల్ నీడ్స్ విద్యాలయాలుగా. మూగ, బధిర పాఠశాలలు, అంధుల కోసం బ్రెయిలీ లిపిలో ఏర్పడిన పాఠశాలలు ఉన్నాయి. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం మరికొన్ని పాఠశాలలు ఉన్నాయి. వీటి అవసరం ఉంది.
రెసిడెన్షియల్ పాఠశాలలు
తెలంగాణలో 1,009 వరకు వివిధ రకాల రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మినీ గురుకులాలుగా మార్చాల్సిన పాలకులు.. రెసిడెన్షియల్ పేరిట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పేరుతో సంస్కరణ, నాణ్యమైన విద్య పేరుతో ఏర్పరచి కోట్లాది రూపాయలు ప్రజాధనం కాంట్రాక్టర్ల పాలు చేశారు. ప్రభుత్వ పాఠశాల పిల్లల్ని ఇక్కడకు తెచ్చి సరైన శిక్షణ, పర్యవేక్షణ లేని బోధన అందించిన స్థితి మూలంగా లబ్థి చేకూరకపోగా, ప్రభుత్వ పాఠశాలల ధ్వంసానికి పరోక్షంగా తోడ్పడ్డాయి. ఇదే పంథాలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా 58 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఇటీవలనే ముఖ్యమంత్రి యంగ్ ఇండియా పేరుతో ఓ పాఠశాల ప్రారంభించారు. ఈ పాఠశాల ప్రభుత్వ గ్రాంట్ పొందుతూ ఫీజులు మెనూ కూడా ప్రకటించింది. అంటే, ప్రైవేటు పాఠశాల మాదిరిగా విద్యావ్యాపారం ప్రోత్సాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఉంది. కో- ఎడ్యుకేషన్ పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పిన ప్రభుత్వ పాఠశాలలు ఇవి
మంచి సామాజిక ప్రయోజనం ఇస్తున్నాయి.
దేశ భవిష్యత్తు తీర్చిదిద్దే విద్య
బాలికా సాధికారత పేరుతో కేంద్ర ప్రభుత్వం 20ఏళ్ళ క్రితం కస్తూరిబా బాలికా విద్యాలయాలు ఏర్పరిచింది. డ్రాపవుట్ బాలికల కోసం రూపొందించిన ఈ పాఠశాలల్లో రెగ్యులర్ బాలికలే చదువుతున్నారు. కానీ, ఇరవై ఏళ్ళుగా ఈ పాఠశాల సిబ్బంది, టీచర్లు తాత్కాలిక ఉద్యోగులుగా వెట్టిచాకిరి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల కోసం ఏకలవ్య పాఠశాలలు తెచ్చింది. వాస్తవంగా గిరిజనుల పిల్లలు డ్రాపవుట్స్ ఎందుకు అవుతున్నారంటే వారి మాతృభాషలో విద్యాబోధన లేకపోవడం వల్లనే. వందలాది గిరిజన భాషలకు లిపి లేదు. ఇకపోతే, స్పోర్ట్ స్కూల్స్, సైనిక పాఠశాలలు, చిత్రలేఖనం ఇలా ఎన్నో వైవిధ్య భరితమైన పాఠశాల వ్యవస్థను ఏర్పరచుకున్నాం. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మనదేశంలో ఇన్ని వైవిధ్యాలు, వైరుధ్యాలతో కూడిన పాఠశాల వ్యవస్థ అవసరమా? మన పాఠశాల వ్యవస్థను మన అవసరాలకు తగ్గ విధంగా సంస్కరించుకోవలసిన అవసరం ఉంది.
వృథా అవుతున్న ప్రభుత్వ ఖర్చు
పిల్లలులేని పాఠశాలలపై ప్రభుత్వం పెట్టే ఖర్చు వృథా అవుతోంది. ఈ పాఠశాలలన్నీ సర్వశిక్షా అభియాన్ యాక్సెస్ ఒక కిలోమీటరుకు ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల, 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాల ఉండాలన్న నిబంధనల ప్రకారం ఉనికిలో ఉన్నవే! కనుక ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలసంఖ్య పెంచడంతోపాటు, నిధుల సద్వినియోగం కోసం సంస్కరణ తప్పనిసరి అవసరం అవుతుంది. తరాల మధ్య అంతరాలు మూలంగా, ప్రైవేటు పాఠశాల వ్యవస్థ మనుగడలోనికి వచ్చింది.
సామాజిక మార్పులు, గ్లోబలైజేషన్ మూలంగా కొందరు తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంపై మోజు పెరగడంతో కుప్పలుతెప్పలుగా మన రాష్ట్రంలోనే 12,126 ప్రైవేటు పాఠశాలలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 662 వరకు ఉన్నాయి. ఇవి ప్రభుత్వ గ్రాంట్లుతోనే నడుస్తున్నాయి. కొన్ని సంస్థలు ఇచ్చిన ఆర్థిక సహకారంతో నడుస్తున్న అన్ -ఎయిడెడ్ పాఠశాలలు పరిమిత సంఖ్యలోఉన్నాయి. వీటిలో పిల్లల వద్ద ట్యూషన్ ఫీజులు వసూలు చేసుకుంటారు.