- ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.దానకిశోర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: 16వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ యాత్రికుడు జీన్ బాప్టిస్ట్ టావెర్నియర్ మూసీని ప్యారిస్‌లోని సీన్ నదితో పోల్చాడని, పురాణాపూల్ ను ప్యారిస్‌లోని పాంట్ న్యూఫ్ వంతెనతో పోల్చాడని, నదికి పూర్వ వైభవం తెచ్చి అందులోని నీళ్లను తాగేలా చేయడమే లక్ష్యమని ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం.దానకిశోర్ చెప్పారు.నగరంలో 13 రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ అర్బన్ వర్క్‌షాప్ ముగింపు కార్యక్రమం శుక్రవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, లెస్ అటెలియర్స్ డి సెర్జీ, ఫ్రెంచ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, ఫ్రెంచ్ సంయుక్త సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే 100 శాతం మురుగునీటిని శుద్ధి చేసిన తొలి దక్షిణాసియా నగరంగా హైదరాబాద్ అవతరించనుందన్నారు.
ఫ్రాన్స్ రాయబారి థియరీ మాథౌ మాట్లాడుతూ.. హైదరాబాద్ వంటి నగరాలు వాతావరణ మార్పుల నేపథ్యంలో కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ వర్క్‌షాప్‌కు మించిన కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి ఫ్రాన్స్ పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. ఎంఆర్డీసీఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పూజారి గౌతమి, ఈడీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.