సర్కారు కొంటలేదు.. కొనిపిస్తోంది

సర్కారు కొంటలేదు.. కొనిపిస్తోంది

రాష్ట్రంలో రైస్​మిల్లర్ల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. వీళ్ల దందాకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సర్కారే కారణమవుతోంది. నేరుగా తీసుకెళ్లే రైతులకు మద్దతు ధర ఇవ్వకపోయినా, తాలు, తప్ప పేరుతో క్వింటాల్​కు పది కిలోల వరకు కోత పెడుతున్నా, సీఎంఆర్(కస్టమ్​ మిల్లింగ్ రైస్) కోసం ఇచ్చిన వడ్లను మాయం చేసి బయట అమ్ముకుంటున్నా, ఏడాది దాటినా ఎఫ్ సీఐకి లెవీ పెట్టక తప్పించుకుంటున్నా, రేషన్​బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ అడ్డగోలు సంపాదిస్తున్నా, సదరు మిల్లర్లపై సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. పైగా ప్రతి సీజన్​లో మిల్లర్లు పెట్టే డిమాండ్లకు సర్కారే ఉల్టా తలొగ్గుతున్నది. ఇందుకు పలు కారణాలు కనిపిస్తున్నాయి. రాజకీయ కోణంలో చూసినప్పుడు మిల్లర్లు ప్రభావిత వర్గం కావడం ఒక కారణమైతే, మిల్లర్ల సహకారం లేకుండా రైతుల నుంచి సేకరించే  లక్షల టన్నుల వడ్లను ఏం చేయాలో, ఎక్కడ పోయాలో తెలియని స్థితిలో ప్రభుత్వం ఉండటం మరో ముఖ్య కారణం. 

సర్కారు కొంటలేదు.. కొనిపిస్తోంది

వడ్లను తామే కొంటున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు పూర్తిగా నిజం కాదు. ఆ మాటకొస్తే ప్రభుత్వం వడ్లను కొంటలేదు.. మిల్లర్లతో కొనిపిస్తోంది. ఒకవేళ సర్కారు చెప్పేదే వాస్తవమైతే సెంటర్​లో వడ్లను కాంటా పెట్టిన మరుక్షణం వాటి బాధ్యతను సివిల్​సప్లై శాఖ తీసుకోవాలి. కానీ సెంటర్ లో వడ్లను కాంటా పెట్టి, బస్తాలను లారీల్లో లోడ్​చేసి, మిల్లుల్లో దిగుమతి అయ్యే దాకా రైతులనే బాధ్యులుగా చేస్తున్నారు. ఇదే అదనుగా మిల్లర్లు రెచ్చిపోతున్నారు. ఐకేపీ సెంటర్లలో 40 కిలోల బస్తాకు 2 కిలోల చొప్పున, క్వింటాల్​కు 5 కిలోల వరకు కటింగ్​పెడ్తుండగా, ఆ బస్తాలు మిల్లులకు చేరగానే.. మరోసారి క్వింటాల్​కు 3 నుంచి 5 కిలోల కోతకు ఒప్పుకోవాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. ఒప్పుకోని రైతుల వడ్లు దింపుకోకుండా వెనక్కి పంపుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్​లో రైతులకు ముందుగా పైసలు చెల్లించి, కేంద్రం నుంచి వచ్చాక తీసుకునే మధ్యవర్తి పాత్రకే రాష్ట్రం పరిమితమవుతోంది. ఆ పాత్రను కూడా సరిగ్గా పోషించలేక రైతులకు, మిల్లర్లకు మధ్య లొల్లి పెట్టి వేడుక చూస్తోంది. సెంటర్ల నుంచి వస్తున్న వడ్లను మిల్లుల్లో ఎప్పటికప్పుడు అన్ లోడ్​ చేసుకోకున్నా, కటింగులు పెట్టినా బ్లాక్ లిస్టులో పెడ్తామని మే17న సివిల్​ సప్లై మంత్రి గంగుల కమలాకర్​ హెచ్చరించారు. ఇది జరిగి రెండు వారాలు గడిచిపోయాయి. నాటి నుంచి ప్రతిరోజూ ఏదో చోట రైతులు, తమ వడ్లను మిల్లుల్లో దింపుకోవడం లేదని,10 కిలోల దాకా కోత పెడ్తున్నారని రోడ్డెక్కుతున్నారు. రాష్ట్రమంతా రాస్తారోకోలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. కానీ సర్కారు మాత్రం ఇప్పటివరకు ఏ ఒక్క మిల్లును కూడా బ్లాక్​లిస్టులో పెట్టలేదు. 

మిల్లర్లకు లాసే లేదు.. 

ఈసారి యాసంగి వడ్ల కొనుగోలుపై ఆలస్యంగా మేల్కొన్న సర్కారు, మిల్లర్లతో హడావిడిగా ఓ మీటింగ్​పెట్టింది. అప్పటికే నాలుగోవంతుకుపైగా వడ్లను రైతుల నుంచి అగ్గువకు కొన్న మిల్లర్లు అదును చూసి తమ డిమాండ్లు ముందుపెట్టారు. బాయిల్డ్​రైస్​ కాకుండా రా రైస్​ఇస్తే నూక ఎక్కువగా వచ్చి లాస్​ అవుతామని, అందువల్ల క్వింటాల్ కు రూ.300 బోనస్​ఇవ్వాలన్నారు. ఈసారి వడ్లకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ.1960 కాగా, అప్పటికే నాలుగోవంతు వడ్లను రైతుల నుంచి క్వింటాలుకు రూ.1800 నుంచి రూ.1900 వరకు పెట్టి మిల్లర్లు కొన్నారు. అదే రేటుకు కొంటామని లక్షలాది మంది రైతులతో ముందే అగ్రిమెంట్లు కూడా చేసుకున్నారు. కానీ సర్కారును మాత్రం రూ.300 బోనస్​ఎందుకు అడిగారో అంతుచిక్కదు. ఇక మిల్లర్లు అడిగిందే తడువు సర్కారు, సీఎస్​ నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. నూకశాతం పెరగడం వల్ల మిల్లర్లకు ఎంత నష్టం వస్తుందో నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీన్ని ఇన్నాళ్లూ నాన్చిన కమిటీ మే 26న ఈ బాధ్యతను మైసూర్‌‌కు చెందిన సీఎఫ్‌‌టీఆర్‌‌ఐ(కేంద్రీయ ఆహార సాంకేతిక పరిశోధనా విభాగాని)కి అప్పగించింది. నిజానికి ఎఫ్‌‌సీఐ నిబంధనల ప్రకారం క్వింటాల్‌‌ వడ్లకు మిల్లర్లు 67 కిలోల బియ్యం(50 కిలోల బియ్యం, 17 కిలోల నూకలు) ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లర్లు చెబుతున్నట్లు యాసంగిలో క్వింటాల్ వడ్లకు 35 కిలోల బియ్యం మాత్రమే వస్తాయనుకుందాం. అలా తగ్గే15 కిలోలకు(కిలోకు రూ.27 చొప్పున) రూ.405 లాస్​ వస్తుందన్నది మిల్లర్ల వాదన. కానీ ఆ 15 కిలోల నూకలకు రూ.18(ప్రస్తుత మార్కెట్​ రేటు) చొప్పున రూ.270 వస్తాయి కదా! అంటే ఇక్కడ మిల్లర్లు లాసయ్యేది కేవలం రూ.135. ఇవిగాక మిగిలిన నూకలు, పరం, తవుడులో వేస్టయ్యేది ఏదీ ఉండదు. రైస్​బ్రాన్​ఆయిల్​లో వాడుతున్న తవుడు రేటు ఒకప్పుడు కిలోకు రూ.20 ఉండగా, ఉక్రెయిన్​ యుద్ధం తర్వాత రూ.40కి పైగా పలుకుతోంది. ఇక మక్కలకు బదులు దాణా కింద ఉపయోగిస్తున్న పరం కూడా కిలోకు రూ.16 చొప్పున అమ్ముడుపోతోంది. ఊక రేటు కూడా టన్నుకు రూ. వెయ్యి దాకా ఉంది. ఇది కాకుండా వడ్లు మరాడించినందుకు మిల్లింగ్​చార్జీల కింద కేంద్రం ఎలాగూ క్వింటాల్​కు రూ.25 చొప్పున చెల్లిస్తోంది. ఇలా ఏ లెక్కన చూసినా మిల్లర్ కు లాస్​ లేనప్పుడు సర్కారు ఎవరి ప్రయోజనాల కోసం మిల్లర్ల డిమాండ్లకు తలొగ్గుతోందో అర్థం కాదు. 

తనిఖీలు ఎందుకు ఆపినట్లు?

సర్కారు ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు బయట మార్కెట్​లో అమ్ముకుంటున్నారనే ఫిర్యాదులతో మార్చిలో స్వయంగా ఎఫ్ సీఐ రంగంలోకి దిగింది. 2020-–21 యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించి సీఎంఆర్​కోసం ఇచ్చిన ధాన్యం రైస్​మిల్లుల్లో ఉందో లేదో చెక్​చేసేందుకు ఫిజికల్​వెరిఫికేషన్​ చేపట్టింది. ఈ తనిఖీల్లో యాసంగికి సంబంధించి 475 మిల్లుల్లో వానా కాలానికి సంబంధించి1,825 మిల్లుల్లో అక్రమాలు బయటపడ్డాయి. 562 మిల్లులైతే  బస్తాలను అస్తవ్యస్తంగా నిల్వ చేసి ఫిజికల్‌‌ వెరిఫికేషన్‌‌కు ఏమాత్రం సహకరించలేదు. వెరిఫికేషన్​కు వీలుగా ఉన్న 40 రైస్​మిల్లుల్లో 4 లక్షల 53 వేల 896 ధాన్యం బస్తాలు(1.85లక్షల క్వింటాళ్లు) మాయమైనట్లు గుర్తించారు. సంబంధిత మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు నివేదికలు పంపించారు. ఈలోగా కేంద్రమంత్రి కిషన్​రెడ్డి అన్ని  మిల్లుల్లోనూ ఫిజికల్​వెరిఫికేషన్​ చేపట్టాలని ఎఫ్​సీఐకి లేఖరాశారు. దీంతో ఏప్రిల్​28 నుంచి ఫిజికల్​వెరిఫికేషన్​కు ఎఫ్​సీఐ సిద్ధం కాగానే మిల్లర్లంతా సర్కారుతో రాయబారం నడిపారు. లాబీయింగ్​కు తలొగ్గిన సర్కారు మిల్లర్లకు మద్దతుగా ఫిజికల్​వెరిఫికేషన్​ఆపాలని ఎఫ్​సీఐని డిమాండ్​చేసింది. గత యాసంగికి సంబంధించి 5.50 లక్షల మెట్రిక్​ టన్నుల బియ్యం ఎఫ్​సీఐకి డెలివరీ చేయాల్సి ఉందని, తనిఖీల వల్ల కొనుగోళ్లకు సైతం ఇబ్బంది కలుగుతుందంటూ మిల్లర్లకు ప్రభుత్వం వంత పాడింది. ఇది జరిగి నెల గడిచిపోయింది. అయినా గత యాసంగికి సంబంధించి ఇంకా 5 లక్షల టన్నులు బియ్యం మిల్లుల నుంచి ఎఫ్ సీఐకి పోలేదు.102 రైస్ మిల్లుల వద్ద ఇంకా రూ.400 కోట్ల విలువైన ధాన్యం ఉండిపోగా, చర్యలకు వెనుకాడుతోంది.102 మందిలో రాజకీయ పలుకుబడి పెద్దగా లేని కేవలం13 మందిపై తూతూమంత్రంగా కేసులు పెట్టి చేతులు దులుపుకున్నది. 

గోడౌన్ల కెపాసిటీ పెంచితేనే.. 

రాష్ట్రంలో పండే వరి ధాన్యాన్ని రైతుల నుంచి కొని నిల్వ చేసేందుకు సరిపడా గోడౌన్లు అందుబాటులో లేకపోవడం వల్లే మిల్లర్లకు సర్కారు తలొగ్గుతోందనే అభిప్రాయాలున్నాయి. మనకు కోటి మెట్రిక్​టన్నుల కెపాసిటీ కలిగిన గోడౌన్లు అవసరం కాగా, ప్రస్తుతం రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గోడౌన్ల కెపాసిటీ కేవలం 24.85 లక్షల టన్నులు మాత్రమే. వీటి కెపాసిటీని కనీసం 64 లక్షల టన్నులకు పెంచాలనే ప్రతిపాదన ఉంది. రాబోయే ఒకటి, రెండేండ్లలో మరో 40 లక్షల టన్నుల కెపాసిటీ గల గోడౌన్లను కొత్తగా నిర్మిస్తేనే రైతుల నుంచి కొనే వడ్లను నిల్వ చేసుకునే కెపాసిటీ సర్కారుకు వస్తుంది. అప్పుడే రైస్​మిల్లుల ఆగడాలకు కొంతలో కొంతైనా చెక్​పెట్టే వీలుంటుంది.
- చిల్ల మల్లేశం సీనియర్​ జర్నలిస్టు