- బాసర ఆర్జీయూకేటీ స్టూడెంట్లను పట్టించుకోని సర్కారు
- మూడేండ్ల నుంచి ల్యాప్టాప్స్, యూనిఫామ్ బంద్
- పేద విద్యార్థులపై రూ.30 వేల కోట్ల భారం
- ఏండ్లుగా వీసీ సహా కీలక పోస్టులన్నీ ఖాళీ
హైదరాబాద్,వెలుగు: బాసరలో ఉన్న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(బాసర ట్రిపుల్ఐటీ)లో స్టూడెంట్స్‌కు టెక్నాలజీ అందట్లేదు. వర్సిటీలో చేరుతున్న స్టూడెంట్లకు మూడేండ్ల నుంచి సర్కారు ల్యాప్టాప్స్ ఇవ్వడం లేదు. యూనిఫామ్, షూస్కూడా బంద్పెట్టింది. ఎంతో ఆశతో ఆర్జీయూకేటీలో చేరుతున్న స్టూడెంట్లకు సర్కారు నిర్లక్ష్యంతో అవస్థలు తప్పడం లేదు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి వీసీ కూడా లేకపోవడం వర్సిటీ పరిస్థితికి అద్దం పడుతోంది. రాష్ట్రంలో ఆర్జీయూకేటీ ప్రత్యేకమైన వర్సిటీ. గ్రామీణ ప్రాంతాల్లో, సర్కారు స్కూళ్లలో టెన్త్ చదివి, టాపర్లుగా నిలిచిన వారికే ఇందులో అడ్మిషన్స్ఇస్తారు. ఇక్కడ ఏటా1,500 సీట్లు నింపుతారు. అడ్మిషన్ పొందిన స్టూడెంట్లు ఇంటర్(రెండేండ్లు)తో పాటు ఇంజనీరింగ్(నాలుగేండ్లు) ఆరేండ్లలో పూర్తి చేస్తారు. ఇది టెక్నికల్ వర్సిటీ కావడంతో సీటు పొందిన ప్రతి స్టూడెంట్‌కు ఒక ల్యాప్‌టాప్, ఒక జత యూనిఫామ్, ఒక స్పోర్ట్స్ డ్రెస్, షూస్ అందించేవారు. కానీ మూడేండ్ల నుంచి ఇవేవీ ఇవ్వడం లేదు. దీంతో 2019–20, 2020–21, 2021–22 అకడమిక్ ఇయర్లలో సీట్లు పొందిన స్టూడెంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఏటా రూ.10 కోట్లు ఇవ్వలేరా?
ఆర్జీయూకేటీ పేరుకే వర్సిటీగా మారింది. 2021–22 బడ్జెట్లో దీనికి నిర్వహణ పద్దు కింద రూ. 23 కోట్లు ప్రతిపాదించారు. వర్సిటీ అభివృద్ధి కోసం పైసా ఇవ్వలేదు. బడ్జెట్లో పెట్టిన నిధులూ సర్కారు రిలీజ్ చేయడం లేదు. దీంతో ఎంప్లాయీస్ కు నెలనెలా జీతాలు సక్రమంగా అందడం లేదు. సర్కారు నిధులివ్వకపోవడంతో మూడేండ్ల నుంచి ల్యాప్టాప్స్, యూనిఫామ్స్ ఇవ్వడం లేదు. ఏటా రూ.10 కోట్లు కేటాయిస్తే, ఇవన్నీ సమకూర్చవచ్చని అధికారులు చెప్తున్నారు. కానీ సర్కారు స్పందించకపోవడంతో ఈ మూడేండ్లలో రూ.30 కోట్ల అదనపు భారం పేద విద్యార్థులపై పడింది.
వర్సిటీ అనే విషయమే మరిచి..
ఆర్జీయూకేటీ ఓ వర్సిటీ అనే విషయం మరిచిపోయారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క వీసీని కూడా సర్కారు నియమించలేదు. ఏడున్నరేండ్ల నుంచి వీసీ, రిజిస్ర్టార్, డైరెక్టర్... తదితర పెద్దపెద్ద పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. వర్సిటీలో ఓ రిటైర్డ్ అధికారి ఏవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇన్చార్జీ వీసీగా ఉన్న రాహుల్ బొజ్జాకు అనేక బాధ్యతలున్నాయి. దీంతో ఆయన వర్సిటీకి టైమ్ ఇవ్వలేకపోతున్నారు. రెగ్యులర్ వీసీ ఉంటే, నిధుల కోసం సర్కారును నిత్యం కోరే అవకాశముండేది. ఇప్పటికైనా సర్కారు పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, యూనిఫామ్‌లు ఇవ్వాలని, వీసీ ఇతర ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని విద్యావేత్తలు కోరుతున్నారు.
ఐటీ సబ్జెక్ట్ ఎలా?
సిలబస్‌లో ఐటీ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ల్యాప్‌టాప్‌లు స్టూడెంట్స్‌కు చాలా అవసరం. ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఇష్టముంటే స్టూడెంట్లే కొనుక్కోవాలని వర్సిటీ అధికారులు సూచిస్తున్నారు. దీంతో కొందరు పేద విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి కొంటుండగా, డబ్బుల్లేక మరికొందరు కొనడం లేదు. వారంతా సెల్ఫోన్లలో చూడాల్సిన పరిస్థితి. 2018–19 అకడమిక్ ఇయర్లో ఒక్కో ల్యాప్‌టాప్‌ను రూ.51,600కు టెండర్లు ఇచ్చారు. ఈ టెండర్లలో గోల్మాల్ జరిగిందని అప్పట్లో తీవ్ర సంచలనమైన విషయం తెలిసిందే.