బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్లను పట్టించుకోవట్లే

ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో 13 బీసీ ఫెడరేషన్లకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రజక, నాయీబ్రాహ్మణ, శాలివాహన, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్లకు తప్ప, మిగతా ఫెడరేషన్లకు పైసా బడ్జెట్ కేటాయించలేదు. ఆ 4 ఫెడరేషన్లకు కేటాయించిన బడ్జెట్ నూ ఖర్చు పెట్టలేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఈ ఏడేండ్లలో ఈ 13 ఫెడరేషన్లకు పాలక మండళ్లను కూడా నియమించలేదు. బీసీ కులాల అభివృద్ధికి పాటు పడుతున్నామని ప్రకటనలు గుప్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆచరణలో ఈ కులాల అభివృద్ధికి కనీస చర్యలు తీసుకోవడం లేదు. అత్యంత వెనుకబడిన కులాలు, సంచార జాతులను ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, సామాజిక రంగాల్లో అభివృద్ధి చేయవలసిన రాజ్యాంగ బాధ్యతను ఈ ప్రభుత్వం విస్మరిస్తోంది.

సమాజం ఎప్పటికప్పుడు మారుతుంది. ప్రజల్లో కూడా దానికి అనుగుణంగా మార్పులు వస్తున్నాయి. సైన్స్​ అండ్​ టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లో మెకనైజేషన్​ పెరుగుతోంది. ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక, వ్యవసాయ, సాంస్కృతిక రంగాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఆధునిక టెక్నాలజీ అన్ని రంగాలకూ విస్తరిస్తోంది. ఈ పరిణామ క్రమంలో కులవృత్తులు–-చేతివృత్తులు తమ ఆస్థిత్వాన్ని కోల్పోతున్నాయి. ఇంతవరకు ఈ వృత్తులపైనే ఆధారపడిన కులాలు, వర్గాలకు యాంత్రీకరణ–-కార్పొరేటీకరణ దక్కాలి. కానీ ప్రస్తుతం వ్యవస్థలో అలా జరగడం లేదు. స్టీల్-, ఐరన్ పరిశ్రమలతో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి కులాలు తమ వృత్తులను కోల్పోయాయి. ప్లాస్టిక్ పరిశ్రమ కారణంగా మేదరి, కుమ్మరి వృత్తులు మరుగున పడ్డాయి. జేసీబీలు, హిటాచీ మెషిన్లతో వడ్డెర్ల బతుకులు ఆగమై కూలీలుగా మారారు. ట్రాక్టర్లు-–సా మిల్లులు రావడంతో వడ్రంగి, కమ్మరి పని దెబ్బతింది. డ్రై క్లీనింగ్ షాపులు వల్ల చాకలి, నేత మిల్లులు రావడంతో నేత వృత్తి, బ్యూటీపార్లర్లు, హేర్ కటింగ్ సెలూన్ల రాకతో మంగళి, రెడీమేడ్ దుస్తులతో దర్జీలు, జ్యూయెలరీ షాపులతో విశ్వ బ్రాహ్మణుల వృత్తులు దెబ్బతిన్నాయి.

1974లో బీసీ కార్పొరేషన్​ ఏర్పాటు

ఉమ్మడి రాష్ట్రంలో 1974లో బీసీ కార్పొరేషన్ ను​ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2014 వరకు దీని ద్వారా లక్షలాది మందికి సబ్సిడీ రుణాలు అందాయి. రజక, నాయీబ్రాహ్మణ ఫెడరేషన్లను 1976 లో స్థాపించారు. బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి మేరకు 2006–-2007లో వడ్డెర, విశ్వబ్రాహ్మణ, ఉప్పర, మేదర, శాలివాహన, భట్రాజు, పూసల, దర్జీ, వాల్మీకి, గీత, సంచార జాతుల ఫెడరేషన్లను రెండు దఫాలుగా ఏర్పాటు చేశారు. బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ల ద్వారా ఇచ్చిన మార్జిన్ మనీ రుణాలను మాఫీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం అప్పటి సీఎం వైఎస్​ రాజశేఖర్ రెడ్డికి విజ్ఞప్తి చేయగా 2007లో 18 లక్షల మంది బీసీ లబ్ధిదారులకు చెందిన దాదాపు రూ.800 కోట్ల రుణాలను మాఫీ చేశారు. మార్జిన్ మనీ రుణాల స్కీము ఎత్తేయాలని, మొత్తం సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కోరగా 20 శాతం సబ్సిడీ రుణాల పథకాన్ని ప్రారంభించారు. 

సబ్సిడీ రుణ పథకాలకు కొత్త రూపు

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సబ్సిడీ రుణాల పథకానికి సీఎం కేసీఆర్​ కొత్త రూపు ఇచ్చారు. లక్ష రూపాయల రుణం వరకు 80%, రెండు లక్షల వరకు 70%, 3 లక్షల వరకు 60%, ఆపై రుణాలకు 50% సబ్సిడీ ఇచ్చేలా స్కీములను డిజైన్ చేశారు. స్కీముల డిజైన్ బావుంది కానీ, రుణాలు మాత్రం ఇవ్వడంలేదు. ఈ ఏడేండ్లలో 2015–-16లో 3.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 50 వేల మందికి, 2018లో 5.77 లక్షల మంది  దరఖాస్తు చేసుకోగా 40 వేల మందికి రుణాలు మంజూరు చేశారు. రాష్ట్రంలో 60 లక్షల బీసీ కుటుంబాలు ఉంటే ఏడేండ్లలో 90 వేల మందికే సబ్సిడీ రుణాలు ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో అత్యంత వెనుకబడిన తరగతుల కోసం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటైంది. అయితే బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్లకు కొన్ని ఫెడరేషన్లకు మాత్రమే బడ్జెట్ కేటాయిస్తున్నారు. సబ్సిడీ రుణాలు మాత్రం ఇవ్వడం లేదు. 

రుణాలు మాత్రం ఇయ్యట్లే

సబ్సిడీ రుణాలు ఇస్తామని ఈ ఏడేండ్లలో రెండుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చి బీసీ కులాల అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు తీసుకున్నారు. 2014-–15 లో నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు బీసీ కార్పొరేషన్ ద్వారా 1,62,000 దరఖాస్తులు, బీసీ కుల ఫెడరేషన్ల ద్వారా 1,33,000 దరఖాస్తులు వచ్చాయి. కానీ సబ్సిడీ రుణాలు మంజూరు చేయలేదు. 2017లో మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించగా.. అప్పట్లో 5,77,000 పైగా దరఖాస్తులు వచ్చాయి. 2018లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు 40 వేల మందికి రూ.50 వేల చొప్పున సబ్సిడీ రుణాలిచ్చి చేతులు దులుపుకున్నారు. మిగతా 5,37,000 వేల మంది రుణాలు ఎప్పుడు వస్తాయని కాళ్లు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా.. జవాబు చెప్పే దిక్కు లేదు. ఒక్కో బీసీ కుల ఫెడరేషన్ కు రూ.200 కోట్లు కేటాయిస్తామని గతంలో సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చారు. కానీ, బడ్జెట్ లో చూస్తే పది పైసలు కూడా కేటాయించలేదు. ఫెడరేషన్లలో పనిచేసే వారి జీతభత్యాలకు కూడా నిధులు కేటాయించలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతి దరఖాస్తుదారునికి సబ్సిడీ రుణాలు ఇస్తామని ప్రకటించారు. వాస్తవానికి రాష్ట్రంలో 60 లక్షల బీసీ కుటుంబాలు ఉన్నాయి. అయితే సరైన ప్రచారం లేకపోవడంతో సబ్సిడీ రుణాలకు 5,77,000 దరఖాస్తులే వచ్చాయి. మరోవైపు రెండేండ్లుగా కొత్త రుణాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. దీంతో దరఖాస్తు చేసుకోవడానికి లక్షల మంది ఎదురు చూస్తున్నారు. 

పాలక మండళ్లు ఏర్పాటు చేయలే

టీఆర్ఎస్ పాలనలో 13 బీసీ కుల ఫెడరేషన్లకు పాలక మండళ్లు ఏర్పాటు చేయ లేదు. దీంతో ఈ ఫెడరేషన్లు ఉత్సవ విగ్రహాలుగా మారాయి. వీటిలో దర్జీ, సంచార జాతుల ఫెడరేషన్ల ఉనికే లేదు. ఈ రెండూ ఉన్నాయో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. రుణాలు ఇవ్వకుండా, పాలక మండళ్లు ఏర్పాటు చేయకుండా ఈ కులాల నాయకత్వాన్ని అణచివేస్తున్నారనే విమర్శలు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ఫెడరేషన్లకు పాలక మండళ్లను ఏర్పాటు చేస్తే ఈ కులాల నాయకత్వం పెరుగుతుంది. వారిలో చైతన్యం వస్తుంది. కులాల సమస్యలపై అవగాహన ఉన్న వారు తమకు కావలిసిన పథకాలను డిజైన్ చేయగలరు. బీసీ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలని, కొత్తగా మరో 42 బీసీ కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని మంత్రి గంగుల కమలాకర్​కు ఇటీవల బీసీ కుల సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఆంధ్రప్రదేశ్ లో 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడమే కాక చైర్మన్ తోపాటు 11 మంది డైరెక్టర్లను నియమించారు. అదే విధంగా మన రాష్ట్రంలో ఇప్పుడున్న 13 ఫెడరేషన్లతోపాటు మున్నూరు కాపు, యాదవ, కుర్మ, ముదిరాజ్, పద్మశాలి, ఆరెకటిక, జంగమ తదితర 42 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినా స్పందించడం లేదు. 20 వేల కంటే ఎక్కువ జనాభా కలిగిన ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆయా కులాల నాయకత్వం పెరుగుతుంది. ఆయా కులాలు ఎదుర్కొంటున్న సమస్యలను కింది స్థాయిలో అర్థం చేసుకుని పరిష్కరించే అవకాశం కలుగుతుంది. మిగతా కులాలకు ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా, సంచార జాతుల కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటే ఈ కులాల్లో సమగ్ర అభివృద్ధికి పునాదులు పడతాయి. 

కుల వృత్తులను దెబ్బతీసిన కరోనా

యాంత్రీకరణతో కార్పొరేట్ ప్రాబల్యం పెరిగిపోతోంది. మరోవైపు కరోనా మహమ్మారి దెబ్బతో కుల వృత్తులు–చేతి వృత్తులు దెబ్బతిన్నాయి. కరోనా కల్లోలంతో దెబ్బతిన్న కుల వృత్తుల కుటుంబాలకు రూ.10 వేల చొప్పున కర్నాటక ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రూ.10 వేల చొప్పున అన్ని కుల వృత్తుల వారికి అందజేసింది. గుజరాత్ ప్రభుత్వం రూ.15 వేల చొప్పున ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. మన ప్రభుత్వం మాత్రం బీసీ కుల వృత్తుల వారికి సాయం చేయడానికి ముందుకురాకపోవడం శోచనీయం. కనీసం కుల వృత్తులు–చేతి వృత్తుల వారికి చేయూత అందిస్తామనే ప్రకటన కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి రావడం లేదు. 

బ్యాంకులూ లోన్లు ఇవ్వట్లేదు

కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం సబ్సిడీ రుణాలు ఇవ్వకపోగా.. బీసీలకు రూ.లక్ష- రూ.2 లక్షల రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు కూడా ముందుకు రావడం లేదు. కానీ, బడా కంపెనీలకు, పారిశ్రామిక వేత్తలకు వేల కోట్ల రుణాలు ఇస్తున్నారు. వారు వాటిని కట్టకపోతే మాఫీ చేస్తున్నారు. పేదలకు రుణాలు ఇవ్వడానికి మాత్రం ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా బ్యాంకులు తమ వైఖరి మార్చుకుని బీసీలకు సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలి. అందుకు బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి ప్రతి దరఖాస్తుదారుకు బ్యాంకు రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆకలి, అజ్ఞానం, అమాయకత్వం, అనారోగ్యం, పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం జరగాలంటే జాతి, వనరులు, సంపద, అధికారం అన్ని వర్గాలకూ సమానంగా దక్కాలి. శ్రమ సంస్కృతి పెరగాలి. మానవ వనరులు పూర్తి స్థాయిలో వాడుకోవాలి. శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే తమ హక్కుల కోసం ఈ కులాలు ఉద్యమం చేయడం తప్పదు.

-ఆర్.కృష్ణయ్య,
అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం