- కేసులు పెడుతున్న ఏసీబీ.. ఎత్తేస్తున్న సర్కారు
- ఏడాదిలో శిక్షలు పడింది 10 కేసుల్లోనే..
- ఐదేండ్లలో ఎత్తేసినవి 50కిపైనే..
- రాష్ట్రంలో సగటున రెండు రోజులకో కేసు నమోదు
- ప్రాసిక్యూషన్‌కు అనుమతివ్వక ఏండ్ల తరబడి పెండింగ్
- డిపార్ట్మెంటల్ ఎంక్వైరీల పేరిట కేసులు మూసేస్తున్న తీరు
- శిక్షలు పడవన్న ధీమాతోనే అవినీతి పెరుగుతోందన్న ప్రజా సంఘాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండు రోజులకో అవినీతి కేసు నమోదవుతోంది. ఏదో ఒక జిల్లాలో, ఏదో ఒక శాఖలో లంచం తీసుకుంటూ అధికారులు, సిబ్బంది ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడుతూనే ఉన్నారు. అవినీతిని సహించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని సర్కారు పెద్దలు తరచూ ప్రకటనలు చేస్తున్నా.. మరోవైపు లంచాల వ్యవహారం సాగుతూనే ఉంది. వందల కొద్దీ కేసులు నమోదవుతున్నా పదుల సంఖ్యలో కూడా శిక్షలు పడ్తలేవు. వారి ప్రాసిక్యూషన్‌కు సర్కారు అనుమతివ్వక చాలా కేసులు ఏండ్లకు ఏండ్లు పెండింగ్‌లోనే ఉండిపోతున్నయి. దీనికితోడు కొన్ని కేసులను సర్కారీ డిపార్ట్‌మెంట్లే డ్రాప్ చేసేస్తున్నాయి. ఇందువల్లే సర్కారీ ఉద్యోగులు ఏసీబీ అంటే భయపడ్తలేరని, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోతోందని పౌర సంఘాలు అంటున్నాయి. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు 811 ఏసీబీ కేసులు నమోదయ్యాయి.ఈ ఏడాదిలో డిసెంబర్ 16 వరకు నమోదైన కేసులు 147. ఈ ఏడాది పెండింగ్‌లో ఉన్న పది కేసుల్లో మాత్రమే దోషులకు శిక్ష ఖరారైంది. అవినీతి కేసుల్లో ఎక్కువగా రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పట్టుబడుతుండగా మున్సిపల్ శాఖ రెండో స్థానంలో ఉంది. పోలీస్, పంచాయతీరాజ్, జ్యుడిషియరీ ఉద్యోగులూ ఏసీబీకి దొరుకుతున్నారు.
రెవెన్యూలో ఎక్కువగా..
అటు సర్కారు నుంచి, ఇటు జనం నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నా రెవెన్యూ శాఖలో అధికారులు, సిబ్బంది లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కుతూనే ఉన్నారు. పైసల్లేనిదే పనులు కావడం లేదని, ఫైళ్లు కదలడం లేదని జనం మండిపడుతున్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న మొత్తం ఏసీబీ కేసుల్లో రెవెన్యూ శాఖనే మొదటి స్థానంలో ఉంది. 2018లో 147 ఏసీబీ కేసులు నమోదైతే 34 కేసుల్లో పట్టుబడ్డవారు రెవెన్యూ ఉద్యోగులే. ఈ ఏడాది ఇప్పటివరకు 26 కేసుల్లో రెవెన్యూ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. వారిలో నలుగురు తహసీల్దార్లు, ఒక డిప్యూటీ తహసీల్దార్, 12 మంది వీఆర్వోలు, ఐదుగురు సర్వేయర్లు, నలుగురు ఆఫీస్ సిబ్బంది ఉన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట తహసీల్దార్ నాగజ్యోతి ఏకంగా రూ.6.5 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్య ఆదేశాల మేరకు రూ.4 లక్షలు తీసుకుంటూ వీఆర్వో అనంతయ్య ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. లావణ్య ఇంట్లో సోదాలు చేసిన అధికారులు ఏకంగా రూ.93 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది. రెవెన్యూ శాఖలో ఎక్కువగా పట్టాదారు పాస్ పుస్తకాల కోసం, వాటిలో తప్పుల సవరణ, నాలా కన్వర్షన్, భూసేకరణ పరిహారం చెల్లింపునకు లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీకి చిక్కుతున్నారు.
రెండో స్థానంలో మున్సిపల్..
రెవెన్యూ శాఖ తర్వాత మున్సిపల్ శాఖ ఉద్యోగులు ఏసీబీకి ఎక్కువగా పట్టుబడుతున్నారు. ఈ ఏడాది ఆ శాఖ ఉద్యోగులపై 17 ఏసీబీ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, ఇతర సిబ్బందిపై 11 కేసులు, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో 6 కేసులు నమోదయ్యాయి. ఇంటి నిర్మాణ అనుమతులు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు, ఇతర పర్మిషన్ల విషయంలో మున్సిపల్ అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది పోలీసు శాఖలో 11 కేసులు నమోదుకాగా.. ఏసీబీకి చిక్కినవారిలో ఏడుగురు ఎస్సైలు, ఒక హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు.
మరిన్ని శాఖల్లోనూ అదే తీరు
పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల అధికారులు, కోర్టుల సిబ్బంది కూడా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. ఈ శాఖల్లో ఆరు కేసుల చొప్పున నమోదయ్యాయి. పంచాయతీరాజ్ శాఖలోని ఇంజనీరింగ్ విభాగంలో అవినీతి ఎక్కువగా ఉన్నట్టు కేసులను బట్టి తెలుస్తోంది. ప్రజలకు న్యాయం చేయాల్సిన కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, క్లర్కులు అవినీతికి పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది.
చిన్న ఉద్యోగులకే శిక్షలు..
అవినీతిని సహించేది లేదని, ఎంతటి వారైనా శిక్షిస్తామని పెద్దలు తరచూ చెప్తున్నా ఆచరణలో మాత్రం అమలు కావట్లేదన్న విమర్శలున్నాయి. ఏసీబీ కేసుల్లో చిన్నస్థాయి ఉద్యోగులకే శిక్షలు పడుతున్నాయని, వారిపైనే చర్యలు తీసుకుంటున్నారని లెక్కలు చెప్తున్నాయి. ప్రభుత్వ అధికారులపై ప్రాసిక్యూషన్ జరపాలంటే సర్కారు అనుమతి కావాలన్న నిబంధన కొందరికి వరంగా మారుతోంది. ఏసీబీకి పట్టుబడినవారు తమ పలుకుబడిని ఉపయోగించి, రాజకీయ నేతల ద్వారా ఒత్తిళ్లు చేయించి ఉన్నతాధికారులు ప్రాసిక్యూషన్‌కు అనుమతివ్వకుండా చూసుకుంటున్నారు. దీనివల్ల కేసులు ఏండ్ల తరబడి పెండింగ్‌లో పడిపోతున్నాయి. కొన్ని కేసులైతే కోర్టు విచారణకు వెళ్లకుండానే మూసివేస్తున్నారు కూడా. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత ఐదేండ్లలో ఒక్క రెవెన్యూ శాఖలోనే 50 ఏసీబీ కేసులను మూసివేయడం గమనార్హం. ఈ విషయంలో సెక్రటేరియట్ స్థాయిలో ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలదే కీలక పాత్ర అన్న ఆరోపణలు ఉన్నాయి.
మూసేసిన కేసుల్లో కొన్ని..
- హైదరాబాద్ కలెక్టరేట్‌లో పనిచేసిన సీనియర్ అసిస్టెంట్ మోహన్‌రావును 2010 ఫిబ్రవరి నాలుగో తేదీన ఏసీబీ పట్టుకుంది. సమగ్ర విచారణ జరిపి సదరు అధికారిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని సర్కారును కోరింది. కానీ నాలుగేళ్ల తర్వాత ఆ కేసు డ్రాప్ చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
- రంగారెడ్డి జిల్లాలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన సహదేవ్‌ను 2011 నవంబర్ 29న ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. కేసు సమగ్రంగా విచారణ జరిపి, ప్రాసిక్యూట్చేయడానికి 2012 సెప్టెంబర్ లో అనుమతి కోరింది. కానీ అనుమతివ్వకుండా.. రెండేళ్ల తర్వాత శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఇప్పటిదాకా ఎలాంటి విచారణ మొదలు కాలేదు.
- ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన వనజా కుమారి 2013 అక్టోబర్ 8న ఏసీబీకి పట్టుబడ్డారు. ఆమెను ప్రాసిక్యూట్ చేయడానికి ఏసీబీ అనుమతి కోరగా.. ఆరేళ్లపాటు నాన్చిన సర్కారు చివరికి ఎలాంటి చర్యలు లేకుండానే కేసును క్లోజ్ చేసింది.
రెడ్ హ్యాండెడ్‌గా చిక్కినా శిక్షలెవ్వి?
ఏసీబీ కేసుల్లో 90 శాతం కేసులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కినవే. ఎవరైనా ప్రభుత్వ అధికారిగానీ, సిబ్బందిగానీ లంచం డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదు వస్తే.. వారిని ట్రాప్ చేయడానికి ముందే ఏసీబీ అధికారులు ఆ విషయాన్ని ఆడియో, వీడియో రికార్డుల ద్వారా నిర్ధారించుకుంటారు. తర్వాతే బాధితులు డబ్బులిచ్చే సందర్భంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. ఈ సమయంలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల సమక్షంలో పంచనామా చేస్తారు. ఇంత పకడ్బందీగా పట్టుకుని కేసు నమోదు చేసినా శిక్షల నుంచి తప్పించుకోవడం గమనార్హం. సాధారణంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన తర్వాత ఆ కేసుపై విజిలెన్స్ కమిషన్‌కు లేఖ రాస్తారు. నిందితుల వివరాలు, వారి అక్రమార్జన గురించి వివరిస్తారు. విజిలెన్స్ కమిషన్ ఆ వివరాలను పరిశీలించి, సిఫార్సును ఓకే చేస్తుంది. తర్వాత సదరు నిందితుడిపై న్యాయ విచారణకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ అధికారులు సర్కారును కోరుతారు. సర్కారు అనుమతి ఇచ్చాక విచారణ మొదలవుతుంది. ఇలా ప్రాసిక్యూషన్ వరకు రావడానికి మూడు, నాలుగేళ్లు.. విచారణ పూర్తయి, శిక్ష పడేందుకు మరో మూడు, నాలుగేళ్లు పడుతోంది. 2018లో 24 కేసుల్లో 30 మంది వరకు శిక్ష పడగా, ఈ ఏడాది 10 కేసుల్లో 15 మందికి శిక్షపడింది.