విశ్లేషణ: 317 జీవోతో  స్థానికతకు సమాధి

పాలకుల నిరంకుశత్వానికి, కర్కశత్వానికి పరాకాష్టే 317 జీవో. ఈ జీవో కారణంగానే కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు సమస్యాత్మకంగా మారింది. లోపభూయిష్టమైన ఈ జీవో అమలులో కూడా పారదర్శకత, పద్ధతి లేవు. తాము రూపొందించిన ఈ జీవోను అధికారులే పాటించడంలేదు. అయినా కూడా అడిగే నాథుడే లేడు. ఏ రూల్స్ పాటించకుండా, విచ్చలవిడిగా చెట్టుకొకరిని, పుట్టకొకరిని విసిరేశారు. ఆదుకునేవాడు కనిపించక, తమ మొర వినేవాళ్లే లేక, ఎంతో కష్టపడి సాధించుకున్న ఉద్యోగాన్ని వదులుకోలేక, పిల్లాజెల్లాతో దూరం వెళ్లలేక చాలా మంది ఉద్యోగులు, టీచర్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉద్యోగులు, టీచర్ల ఆవేదన అర్థం కావాలంటే 317 జీవోతో పాటు 124 జీవోను కూడా పరిశీలించాలి. 

371(డీ) ఏం చెబుతోందంటే.. 

రాజ్యాంగంలోని 371(డీ) ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి స్థానిక రిజర్వేషన్ల ఉత్తర్వులను జారీ చేయవచ్చు. రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్న ఉద్యోగాలను జిల్లా, జోన్, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలుగా విభజించి ప్రతి స్థాయిలో స్థానికులకు ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పిస్తాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 371(డీ) ప్రకారం 2018లో రాష్ట్రపతి స్థానిక రిజర్వేషన్ల ఉత్తర్వులను జారీ చేశారు. ఆ ఉత్తర్వులను రాష్ట్రానికి వర్తింప చేస్తూ వచ్చిందే 124 జీవో. రెండు ప్రయోజనాలను కోరి తెలంగాణ ఏర్పడిన తర్వాత స్థానిక రిజర్వేషన్లు కొనసాగాలని అనుకున్నాం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికీ పాలనా రంగంలో సమాన భాగస్వామ్యం కల్పించడానికి స్థానిక రిజర్వేషన్లు అవసరమని భావించాం. స్థానిక రిజర్వేషన్లు లేకపోతే ఇప్పుడున్న ఉద్యోగులను కక్షతో రాష్ట్రంలో ఎక్కడికి పడితే అక్కడికి ఇష్టానుసారం బదిలీ చేసే ప్రమాదం ఉన్నది. 371(డీ)ని కొనసాగిస్తే ఈ విచ్చలవిడితనానికి అడ్డుకట్ట వేయవచ్చన్నది రాష్ట్ర విభజన సమయంలో వచ్చిన మరొక ఆలోచన. అందువలన 371(డీ) కొనసాగింది. అయితే ఆ స్పూర్తికి విరుద్ధంగా ఇప్పుడు జీవోలు వచ్చాయి. 371(డీ) ప్రకారం స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. దాన్ని 124 జీవోలోని ఉద్యోగుల కేటాయింపుకు సంబంధించిన సెక్షన్ లోనూ, 317 జీవోలో మొత్తంగానే  గుర్తించ లేదు.

కొత్త జిల్లాలు.. స్థానిక రిజర్వేషన్లు 

రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్థానిక రిజర్వేషన్ల రూపకల్పన కొత్త జిల్లాల ఏర్పాటు వలన ఆలస్యమై గందరగోళంగా మారిపోయింది. జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వ శాఖల విభజన, ఉద్యోగుల కేటాయింపు వంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. రాజకీయ అవసరాలు, రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జిల్లాల ఏర్పాటుకు పూనుకున్నది. జిల్లాల ఏర్పాటును పరిశీలిస్తే ఒక ప్రాతిపదిక కానీ, పద్ధతి కానీ కనిపించవు. ఏ కోణం నుంచి చూసినా జిల్లాల మధ్య విపరీతమైన తేడాలున్నాయి. విస్తీర్ణంలో విపరీతమైన వ్యత్యాసాలున్నాయి. నల్లగొండ 31 మండలాలతో ఏర్పడితే జయశంకర్- భూపాలపల్లి, నారాయణపేట జిల్లాల్లో 11 మండలాలు, జనగామ, జోగులాంబ -గద్వాలలో 12 మండలాలున్నాయి. ములుగు జిల్లాలో అయితే 9 మండలాలే ఉన్నాయి. జనాభా రీత్యా చూస్తే మేడ్చల్–-మల్కాజిగిరి జిల్లాలో 24 లక్షల ఉంటే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా జనాభా 4.16 లక్షలు. ఎనిమిది జిల్లాలను ఒకటి కన్నా ఎక్కువ పాత జిల్లాల పరిధిలోని భూభాగాలను కలిపి ఏర్పాటు చేస్తే.. మిగతా జిల్లాలు ఏదో ఒక పాత జిల్లా నుంచి వేరైన భౌగోళిక ప్రాంతాలు. అందుకే ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ అన్ని శాఖలను ఏర్పాటు చేయలేదు. రకరకాల సైజులు, జనాభాలో వ్యత్యాసం, మండలాలు, మున్సిపాలిటీల సంఖ్య పరంగా తేడాలు కల జిల్లాలను కలిపి జోన్లుగా ఏర్పాటు చేయడంలోనూ గందరగోళం కొనసాగింది. జిల్లాలు, జోన్లను ఇష్టానుసారంగా చేయడంతో ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈ జీవోలు మరిన్ని సమస్యలను సృష్టించాయి.

మూడేండ్లు మొద్దునిద్రలో సర్కారు

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలోనే తప్పులున్నాయి. స్థానిక రిజర్వేషన్లను రాష్ట్రానికి వర్తింప చేసిన జీవో 124 ఉద్యోగుల కేటాయింపులో స్థానికతను పరిగణనలోనికి తీసుకో లేదు. స్థానికత అనే అంశాన్ని గుర్తించకపోవడమే ఇప్పుడు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు మూలకారణమైంది. జిల్లాల మధ్య ఉద్యోగుల కేటాయింపుకు జీవోలోని సెక్షన్ 4 మార్గదర్శకాలను ఏర్పాటు చేసింది. అందులోని సబ్ సెక్షన్ 2 లోని క్లాస్ (ఏ)  నుంచి (ఈ) వరకు మార్గదర్శకాలను విపులీకరిస్తున్నాయి. ఇందులో స్థానికత అనే అంశాన్ని ప్రభుత్వం చేర్చలేదు. ఈ తప్పిదం ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. సెక్షన్ 4 కింద  4 నుంచి 7 వరకు కల సబ్ సెక్షన్లు కేటాయింపునకు తీసుకోవలసిన చర్యలను, పాటించవలసిన జాగ్రత్తలను  సూచిస్తున్నాయి. 2018లో జారీ అయిన ఈ జీవో ప్రకారం మూడేండ్లలోఉద్యోగుల కేటాయింపు పూర్తి కావాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపు అంశాన్ని విస్మరించి మొద్దునిద్ర పోయింది. మూడేండ్లు పూర్తయిన తర్వాత మేల్కొని హడావుడిగా కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసే ప్రయత్నం చేసింది. దాని వలన అన్నీ తప్పులే జరిగాయి.  

స్థానికతకు గౌరవం లేకుండా చేసిన్రు

సమస్యలు విన్నవిస్తూ బాధితులు లెటర్లు ఇచ్చినా వాటి అతీగతీ తెలియదు. ఈ లోగా రాత్రికి రాత్రి జిల్లాలకు కేటాయింపు మాత్రమే కాదు డైరెక్టుగా పోస్టింగ్ ఆర్డర్లు కూడా వాట్సప్ కు వచ్చాయి. కౌన్సిలింగ్ ద్వారా తప్ప, బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వరాదన్న నియమాన్ని కూడా ప్రభుత్వం తుంగలో తొక్కింది. చేరడానికి కూడా ఎక్కువ సమయం ఇవ్వలేదు.  చేరకపోయినా చేరినట్టుగా భావిస్తామని ప్రకటించడంతో గత్యంతరం లేక అందరూ డ్యూటీలో చేరిపోయారు. కానీ సమస్యలకు పరిష్కారం కనపడక ఇప్పటికీ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. 124 జీవో ప్రకారం ఆరు నెలల వరకు బాధితులు తమకు  జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి విన్నవించవచ్చు. కానీ ఆ అవకాశం ఎవరికీ దక్కలేదు. ఇచ్చిన లెటర్లను పట్టించుకుంటారో లేదో తెలియదు. ఇదీ ఉద్యోగుల కేటాయింపు వ్యవహారం. ప్రభుత్వం తెలంగాణ ఉద్యమానికి ఆత్మ వంటి స్థానికతకు గౌరవం లేకుండా చేసింది. చాలా మంది ఉద్యోగులు ఆ రకంగా అస్థిత్వాన్ని కోల్పోయి బతకవలసి వస్తోంది. ఏ అస్థిత్వ పరిరక్షణ కోసం కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నామో.. ఆ రాష్ట్రంలో ఆత్మగౌరవానికి, అస్థిత్వానికి సమాధి అయింది.

- ఎం.కోదండరామ్, అధ్యక్షుడు, తెలంగాణ జన సమితి