తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షల్లో భూముల అంశం కూడా ఉంది. తెలంగాణలో భూ చట్టాలు అమలు అవుతాయని, పోడు భూములపై పట్టా హక్కు పొందాలని పోడు సాగుదారులు ఎంతగానో ఎదురుచూశారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై ఆరున్నర ఏండ్లు గడిచినా ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’అన్న చందంగా ప్రస్తుత పరిస్థితి ఉంది. పోడు రైతులు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. పాలకులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. హక్కుల కోసం ప్రశ్నిస్తున్న అమాయక గిరిజనులను అష్టకష్టాలపాలు చేస్తున్నారు.
అటవీ భూముల హక్కుల చట్టం అమలు కావట్లే
కేంద్రంలో యూపీఏ-1 ప్రభుత్వానికి 2004-–09 మధ్యకాలంలో కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికన వామపక్షాలు మద్దతిచ్చాయి. ఆ సమయంలోనే అనేక ప్రగతిశీల, ప్రజాప్రయోజనకర చట్టాలు అమోదం పొందాయి. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆ చట్టాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయి. అందులో ప్రధానమైనది సమాచార హక్కు చట్టం. కానీ ఇప్పుడు దానిని నిర్వీర్యం చేసే కుట్రను ఈనాటి ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. రైతు కూలీలు, వామపక్షాలు పేదల బతుకుల్లో వెలుగు నింపడానికి అనేక పోరాటాలు చేయడంతో ఆనాటి యూపీఏ సర్కారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం తీసుకు వచ్చింది. ఇది కూలీలకు ఒక వరంలా నిలిచింది. కానీ, నేడు ఈ పథకం నిర్లక్ష్యానికి, అలసత్వానికి గురవుతోంది. అనేక సంవత్సరాల పోరాటాల ఫలితంగా అటవీ ప్రాంతాల్లో ఉండే గిరిజన, సన్న, చిన్న కారు రైతులు అటవీ భూములను చదును చేసుకుని వ్యవసాయం ద్వారా పొట్ట పోసుకుంటున్నారు. వారికి చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని వామపక్షాలు ఎన్నో పోరాటాలు చేశాయి. దీని ఫలితంగా 2006లో అటవీ భూముల హక్కుల చట్టం వచ్చింది. దీని వల్ల పోడు రైతులకు జవసత్వాలు వచ్చాయి. మా బతుకులు మారుతాయని, మా కాళ్ల మీద మేము నిలబడే స్థాయికి చేరుకుంటామని గిరిజనులు, ఇతర కులాలవారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే అటవీ భూముల హక్కుల చట్టం ఈనాడు అనేక అడ్డంకులు, ఇబ్బందులకు గురవుతోంది. ఈ చట్టం సక్రమంగా అమలు కావడం లేదు. ఈ చట్టం వచ్చి 14 సంవత్సరాలు గడుస్తున్నా అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరం. పైగా పోడు రైతులపై అటవీ శాఖ అధికారులు, పోలీసుల దాడులు పెరిగిపోయాయి. మరోవైపు పంటపొలాల్లో దాడులు చేస్తూ వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ‘గోరుచుట్టుపై రోకలిపోటు’లాగా వారి భూములను వారికి ఇవ్వకుండా పీడీ యాక్టు లాంటి క్రిమినల్ కేసులు పెట్టి దొంగల మాదిరిగా జైల్లో పెడుతున్నారు.
రెండు లక్షల మందికిపైగా పోడు రైతులు
రాష్ట్రంలోని 24 జిల్లాల్లో గిరిజన రైతులు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. రెండు లక్షల మందికిపైగా రైతులు 6.96 లక్షల ఎకరాలకు సంబంధించి పోడు పట్టాల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు(ఉమ్మడి రాష్ట్రం, తెలంగాణలో కలిపి) కేవలం 3 లక్షల 5,320 ఎకరాలకు మాత్రమే పట్టాలు ఇచ్చారు. అంటే పోడు రైతులు పెట్టుకున్న అప్లికేషన్లలో సగం కూడా పరిష్కరించలేదు. వచ్చిన కంప్లయింట్లలో 80,995 దరఖాస్తులను తిరస్కరించామని అధికారులు చెబుతున్నారు. ఇది చాలా అన్యాయం. ఇప్పటికీ పెండింగ్ లో 18,673 అప్లికేషన్లు ఉన్నాయి. సామూహిక క్లెయిమ్స్ కోసం 3,427 అప్లికేషన్లు రాగా అందులో 1,721 దరఖాస్తులను మాత్రం పరిష్కరించారు. పోడు భూములకు పట్టాలివ్వాలని కోరుతున్న గిరిజన రైతులపై రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోంది. వారి కష్టాలను తీర్చడం మానేసి వాటిని పెంచి పోషిస్తోంది. గిరిజనుల హక్కుల కోసం చట్టాలు తీసుకురావడం కోసం వామపక్షాలు అనేక పోరాటాలు చేయాల్సి వచ్చింది. కానీ, ఆ చట్టాలు అమలు చేయడానికి అంతకంటే ఎక్కువ పోరాటాలు చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నేడు ఏర్పడింది. గోడదెబ్బ.. చెంపదెబ్బ లాగా రెండూ ఒకేసారి ప్రజల మీద వచ్చి పడ్డాయి.
గిరిజన రైతుల మీదే ప్రతాపం
రాష్ట్రంలో అనేక ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, శిఖాలు, నాలాలు, వక్ఫ్, దేవాదాయ భూములు అన్యాక్రాంతమై పోతున్నాయి. ఈ అంశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మంత్రులు, ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఎక్కువగా ఉంది. వారిని అదుపు చేయలేని రాష్ట్ర ప్రభుత్వం పేదవాడు గుడిసె వేసుకుంటే చూడలేకపోతోంది. పోడు సాగు చేసుకునే గిరిజన రైతుల మీద కన్నెర్ర చేస్తోంది. పెద్దోళ్లను ఏమీ చేయలేని సర్కారు పేదోళ్లపై ప్రతాపం చూపడం దుర్మార్గం. ప్రతిసారి పోడు రైతులు సాగుకువెళ్లడం, అటవీ, రెవెన్యూ, పోలీసు అధికారులు వారిని అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం, ఉద్రిక్తత సర్వసాధారణం అయిపోయింది. కొమ్రుం భీమ్ తదితర జిల్లాల్లో అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులకు, పోడు రైతులకు మధ్య కొట్లాట జరిగి వ్యవహారం కేసుల వరకూ వెళ్లింది.
గిరిజన రైతుల్లో తీవ్ర అశాంతి
పోడు భూముల వ్యవహారంతో గిరిజనులు, గిరిజన ప్రజాప్రతినిధుల్లో తీవ్ర అశాంతి నెలకొన్నది. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా కళ్లు తెరిచి వాస్తవాలు గ్రహించాలి. అటవీ భూములకు సంబంధించి అన్ని అంశాలను పరిశీలించి అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నిజమైన, అసలైన పేద వారిని గుర్తించి కాస్తులో ఉండి పొట్ట పోసుకుంటున్న వారందరికీ మానవతా దృక్పథంతో పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలి. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం సర్వే నంబర్ల వారీగా సర్వే చేసి ఆదివాసీలకు న్యాయం చేయడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అటవీ భూములకు హక్కు పత్రాలను నిర్దిష్ట కాలపరిమితిలో అందజేయాలి. లేకపోతే అటవీ భూముల హక్కుల కోసం మరో ప్రజా ఉద్యమం తప్పదు.
కేసీఆర్ హామీ మరిచిన్రు
2014లో టీఆర్ఎస్ పార్టీ తొలిసారిగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో స్వయంగా సీఎం కేసీఆర్ పోడు సాగుదారులకు పట్టాలు ఇస్తామని ప్రకటించారు. కానీ, ఈ ఐదేండ్లలో ఆ హామీ అమలుకు నోచుకోలేదు. అసలు ఆ విషయాన్నే ముఖ్యమంత్రి మర్చిపోయారు. 2018లో రెండోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభల్లో కేసీఆర్ మాట్లాడుతూ.. కొత్తగూడెం, ఖమ్మం లాంటి జిల్లాల్లో కుర్చీ వేసుకుని కూర్చొని పోడు సాగుదారులకు నేనే స్వయంగా పట్టాలు ఇస్తానని మరోసారి బహిరంగ హామీ ఇచ్చారు. అదే కాకుండా ఎన్నో వరాల జల్లులు కూడా కురిపించారు. కానీ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా ఎక్కడా పోడు సాగుదారులకు పట్టా సర్టిఫికెట్ ఇచ్చిన దాఖలాలు లేవు. పైగా ఎన్నాళ్లుగానో పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల పంటలను అటవీ శాఖ అధికారులు, పోలీస్ శాఖ వారు ఎవరికి తోచిన విధంగా వారు ధ్వంసం చేస్తున్నారు. రైతుల పొలాలపై దాడులు చేస్తూ నానా బీభత్సం సృష్టిస్తున్నారు. ఊర పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తూ పేదల పైన జులుం చూపిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారుల మధ్య హద్దుల సమస్యలు పరిష్కారం కాక, ఒకరు పట్టాలు ఇస్తే మరో డిపార్ట్మెంట్ తిరస్కరిస్తోంది. అంటే అటవీ, రెవెన్యూ శాఖల మధ్య భూ వివాదాలు ఇప్పటి వరకూ పరిష్కారం కాలేదు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోంది.
పోడు భూములకు పట్టాలిచ్చేదెన్నడు?
- వెలుగు ఓపెన్ పేజ్
- January 19, 2021
లేటెస్ట్
- విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ
- బుద్వేల్లో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన DCM
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- హైదరాబాద్ నడిబొడ్డున రూ.11 లక్షల నకిలీ సిగరెట్లు సీజ్
- బీర్ల ధరల పెంపు.. కొత్త బ్రాండ్ బీర్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- తిండైన మానేస్తారు కానీ వాళ్ళు అది మాత్రం ఆపరు: రాశీ కన్నా
- షమీ వచ్చేశాడు.. ఇక వార్ వన్ సైడే: 14 నెలల తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ
- గుండెపోటుతో తాటిచెట్టుపైన గీతకార్మికుడు మృతి
- IND vs ENG: ఇంగ్లండ్తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- బుజ్జితల్లి వీడియో సాంగ్ రిలీజ్.. ఎమోషనల్ ట్రీట్ ఇచ్చారుగా..
Most Read News
- చేతిలో ఇంకో జాబ్ ఆఫర్ లేదు.. ఇన్ఫోసిస్లో జాబ్ మానేశాడు.. ఎందుకని అడిగితే 6 రీజన్స్ చెప్పాడు..!
- Fateh Box Office: గేమ్ ఛేంజర్కు పోటీగా సోనూ సూద్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
- కొత్త రేషన్ కార్డుల జారీకి పక్కాగా అర్హుల ఎంపిక: కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- జనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- IND vs ENG: ఇంగ్లండ్తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- తెలంగాణ తెల్ల కల్లు, మటన్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- Good Health: రోజూ 2 ఖర్జూర పండ్లతో కలిగే 6 లాభాలు..
- కాంటినెంటల్ హాస్పిటల్లో అరుదైన సర్జరీ
- Daaku Maharaj: డాకు మహారాజ్ బుకింగ్స్ ఓపెన్.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే?