ఏడేండ్లయినా సంచార జాతులకు సాయం అందలే

ఏడేండ్ల తెలంగాణలో సంచార జాతుల బతుకులు మారలేదు. సర్కారు ఆర్భాటంగా ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వేల కోట్లు బడ్జెట్​కేటాయింపులు చూపిందే తప్ప ఆ మొత్తంలో ఒక శాతం కూడా ఖర్చు చేయలేదు. రెండేండ్లుగా ఎంబీసీ కార్పొరేషన్​ చైర్మన్​ పదవి ఖాళీగా ఉంది. రాష్ట్రంలో ఎన్నో సంచార జాతుల కులాల బిడ్డలు దళితుల కంటే కూడా దీన స్థితిలో బతుకుతున్నారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలె. హుజూరాబాద్​ నియోజకవర్గంలోనే దాదాపు 22 వేల మంది సంచార జాతుల కులాల ఓటర్లు ఉన్నారు. ప్రభుత్వం ఇదే వేదిక నుంచి వారి అభివృద్ధి కోసం సాయం ప్రకటించాలె. లేదంటే సంచార జాతులు సమర భేరి మోగించి హక్కుల కోసం పోరాటం చేస్తయి.

రాష్ట్రంలో 52 సంచార జాతి కులాలు ఉండగా వాటిలో 35 కులాలకు ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. 4 కులాలకు ఫెడరేషన్ ఏర్పాటు చేసింది. మిగతా13 కులాలకు బీసీలుగా గుర్తింపు ఇచ్చి అటు ఎంబీసీ కార్పొరేషన్ లో లేకుండా, ఇటు ఫెడరేషన్ లో లేకుండా అలాగే ఉంచింది.  తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 35 సంచార జాతుల కులాల్లో 3,65,486 జనాభా ఉంది. ఎంబీసీ కార్పొరేషన్ కింద 35 సంచార జాతి కులాల బిడ్డలను అన్ని రకాలుగా ఆదుకుంటామని ప్రకటించిన ప్రభుత్వం 2017 నుంచి 2021–22 బడ్జెట్​వరకు దాదాపు 3 వేల కోట్లు కేటాయించింది. స్వయం ఉపాధి కోసం ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకుంటే లోన్లు ఇస్తామని ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అర్జీలు పెట్టుకున్నారు. దరఖాస్తు చేసుకున్నాక తీరా చూస్తే రాష్ట్రంలో కేవలం 1,419 మంది సంచార జాతి బిడ్డలకు మాత్రమే సాయం అందజేశారు. అదీ ఒక్కొక్కరికి 50 వేల రూపాయల చొప్పున మాత్రమే. కేటాయించిన మొత్తం బడ్జెట్​లో రూ. 7 కోట్ల 95 వేలు మాత్రమే ఖర్చు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. బడ్జెట్​లో కేటాయింపులు చేసిన ప్రతీసారి సంబరాలు చేసుకున్న సంచార జాతుల ప్రజలకు చివరకు నిరాశే మిగిలింది. కేటాయించిన బడ్జెట్​లో ఖర్చు చేసిన మొత్తం ఒక శాతం కూడా లేకపోవడం గమనార్హం. 52 కులాలకు చెందిన సంచార జాతుల ప్రజలు రాష్ట్ర జనాభాలో 10 నుంచి12 శాతం ఉన్నారని జాతీయ బాలకృష్ణ రేణుకే కమిషన్ తెలిపింది. కమిషన్​రిపోర్ట్​ ప్రకారం.. వీరిలో 98 శాతం మందికి ఇండ్లు లేవు, ఉపాధి మార్గాలు లేక దీన స్థితిలో 
జీవనం సాగిస్తున్నారు.

కార్పొరేషన్​కు చైర్మన్​ లేక..

రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాటు చేసిన ఎంబీసీ కార్పొరేషన్ కు చైర్మన్ లేక రెండు ఏండ్లు కావస్తోంది. చైర్మన్​ పోస్టు ఖాళీగా ఉండటంతో సంచార జాతుల వారి గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ప్రభుత్వం వెంటనే చైర్మన్​ను నియమించడంతోపాటు, కార్పొరేషన్ పాలక వర్గాన్ని పూర్తిగా సంచార జాతుల కుల నాయకులతో నింపాలి. అలాగే రాష్ట్రంలో ఉన్న సంచార జాతికి చెందిన వడ్డెర, పూసల, మేదర, బోయ ఫెడరేషన్స్ కు జాతి కుల నాయకులతో పాలక వర్గం నియమించాలి. హుజూరాబాద్ లోని సంచార జాతి కులాల ఓట్లు దాదాపు 22 వేల వరకు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించకుంటే సంచార జాతుల బిడ్డల ఆలోచన విధానం మారే అవకాశం ఉంది. హుజూరాబాద్​ నియోజకవర్గం వేదికగా లక్ష మంది సంచార జాతి బిడ్డలతో ‘సంచార జాతుల సమర భేరి’ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ రూపకల్పన చేసి హక్కుల కోసం పోరాటం సాగిస్తాం.

ప్రభుత్వానికి పట్టింపేది..

హుజూరాబాద్ ఉప ఎన్నిక దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అక్కడి నుంచే కొత్తగా పథకాలను ప్రకటించడం, పదవులను కేటాయిస్తుండటాన్ని గమనించిన సంచార జాతుల సంఘం తమ సంక్షేమానికి కూడా ఏమైనా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్​ను వేడుకున్నారు. కానీ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. ఎలక్ట్రిక్​ఆటోలు ఇస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 15 వేల చొప్పున డిపాజిట్స్​సేకరించిన ఎంబీసీ కార్పొరేషన్ రెండేండ్లు కావొస్తున్నా.. ఆటోలు ఇవ్వడం లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కంటే ముందే సంచార జాతులకు ఇప్పటి వరకు అలాట్ చేసిన రూ. 3 వేల కోట్ల నిధులతో పాటు మరో రూ. 20 వేల కోట్లు కేటాయించాలని సంచార జాతుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్​ చేస్తోంది. సంచార జాతి బిడ్డల కోసం ‘సంచార సహాయ నిధి’ ఏర్పాటు చేసి వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షల నగదు జమచేయాలి. అలా చేస్తే 35 కులాలతోపాటు కొత్తగా బీసీ ‘ఏ’ లో కలిపిన13 కులాల కుటుంబాలు ఆర్థికంగా వృద్ధిలోకి వస్తాయి. సంచార జాతికి చెందిన పూసల, వడ్డెర, మేదర, బోయ కులాలకు కూడా ఫెడరేషన్స్ ఏర్పాటు చేయాలి. ఒక్కో ఫెడరేషన్ కు రూ. 500 కోట్లు కేటాయించి వారి అభివృద్ధికి, ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

తిపిరిశెట్టి శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి,సంచారజాతుల సంఘం