కేజీబీవీ స్టూడెంట్లకు కాస్మొటిక్ చార్జీలు చెల్లిస్తలే
కరోనా తర్వాత పట్టించుకోని అధికారులు
సొంతంగా కొనుక్కుంటున్న స్టూడెంట్లు
బెల్లంపల్లి, వెలుగు : కేజీబీవీ (కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం) స్టూడెంట్లకు కాస్మొటిక్ చార్జీలను కరోనా తర్వాత ప్రభుత్వం బంద్పెట్టింది. కాస్మొటిక్ కిట్లకు బదులుగా డబ్బులు ఇస్తామన్న ప్రభుత్వం అవీ ఇప్పటికి చెల్లించడం లేదు. దీంతో స్టూడెంట్లు సొంతంగా కాస్మొటిక్స్ కొనుక్కుంటుండగా..నెల నెలా ఆర్థికభారమవుతోంది. స్కూళ్లలో చదివే పేద, అనాథ స్టూడెంట్ల కోసం సబ్బులు, పౌడర్, బొట్టుబిళ్లలు, దువ్వెన, నూనె వంటి వస్తువులతో కొంతకాలంగా ప్రభుత్వం కిట్లు పంపిణీ చేసింది. 2018, 19 నుంచి ప్రత్యేక కిట్ల రూపంలో పంపిణీ మొదలు పెట్టింది. సుమారు రెండేళ్లు కొనసాగిన ఈ విధానం.. కరోనా తర్వాత కనిపించడం లేదు.
జిల్లాలో 18 కేజీబీవీలు..
మొదట పదో తరగతి వరకు ఉన్న పాఠశా లల్లో క్రమంగా ఇంటర్ విద్యను ప్రవేశపెట్టారు. జిల్లాలోని 18 మండలాల్లో 18 కేజీబీవీలు ఉన్నాయి. వాటిలో తొమ్మిది పాఠశాలలు ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేశారు. వాటిలో బెల్లంపల్లి, మంచిర్యాల, తాండూర్, చెన్నూర్, మందమర్రి, జన్నారం, భీమారం, లక్షెట్టిపేట, నెన్నెల కేజీబీవీలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ లో దాదాపు 787 మంది స్టూడెంట్లు అభ్యసిస్తున్నారు. హై స్కూల్ స్థాయిలో 3వేల520 మంది అభ్యసిస్తున్నారు. మొత్తం జిల్లాలో 4వేల307 మంది విద్యార్థినులు కేజీబీవీల్లో చదువుకుంటున్నారు..
ఖాతాలు సేకరించినా..
కాస్మొటిక్స్ కిట్ల పంపిణీ నిలిచిపోవడంతో నెలకు రూ.100 చొప్పున 10 నెలలు రూ.1000 అదిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో విద్యాశాఖ అధికారులు విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు అందజేశారు. విద్యాలయాలు తెరిచి సుమారు ఎనిమిది నెలలు
గడిచింది. ఇప్పటి వరకు అటు కిట్ల...ఇటు నగదు రాకపోవ డంతో విద్యార్థులు నిరాశకు గురవుతున్నారు.
విద్యార్థుల అకౌంట్లు పంపించాం..
కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో చదువుకుటుంన్న విద్యార్థినీలకు కాస్మొటిక్స్ కిట్లకు సంబంధించిన డబ్బులను ప్రభుత్వం వారిఖాతాల్లోనే జమచేస్తామని పేర్కొనడంతో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 4,307 మంది స్టూడెంట్లకు బ్యాంకు ఖాతాలు తీయించాం. వారి ఖాతాలను ప్రభుత్వానికి పంపించాం. నిధులు విడుదల కాగానే విద్యార్థినీల ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటా.
- మంచిర్యాల జిల్లా డీఈవో వెంకటేశ్వర్లు