డీహెచ్ పోస్ట్ భర్తీకి సర్కారు కసరత్తు

హైదరాబాద్, వెలుగు: ఈ నెలాఖరులోగా ఫుల్ టైమ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన కసరత్తును వేగవంతం చేసింది. ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాను విడుదల చేసింది. దానిపై అభ్యంతరాలుంటే తెలపాలని కోరింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పంపకాల్లో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ పోస్టు ఏపీకి వెళ్లిపోయింది. 2014 నుంచి నేటి వరకు డీహెచ్ పోస్టును ఇన్ చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. కొద్ది రోజుల క్రితం డీహెచ్ పోస్టుతో పాటు తెలంగాణ వైద్యవిధాన పరిషత్ కమిషనర్, డ్రగ్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పోస్టుల్లో ప్రస్తుతం ఉన్న ఇన్ చార్జులను పక్కనబెట్టి రెగ్యులర్ ఆఫీసర్లను నియమించేందుకు చర్యలు ప్రారంభించింది. 

తాజాగా డీహెచ్ పోస్టుకు అర్హత ఉన్న ఆడిషనల్ డైరెక్టర్ల పేర్లతో సీనియారిటీ జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో ప్రస్తుత ఇన్​చార్జ్‌‌ డైరెక్టర్‌‌‌‌ రవీంద్ర నాయక్‌‌తో పాటు అడిషనల్ డైరెక్టర్లు అమర్ సింగ్ నాయక్, మోజీరాం రాథోడ్, కె.పద్మజ, ఆర్.పుష్ప పేర్లు ఉన్నారు. సీనియారిటీ జాబితాలో ముందు వరుసలో ఉన్న రవీంద్ర నాయక్‌‌నే రెగ్యులర్ డీహెచ్‌‌గా నియమించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. తనకు డిప్యుటేషన్ ఇవ్వడానికి రవీంద్ర నాయక్‌‌ లంచం తీసుకున్నారని ఓ ఉద్యోగిని ఆయనపై ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై విజిలెన్స్ డిపార్ట్‌‌మెంట్ ఎంక్వైరీ చేసి సర్కార్‌‌‌‌కు నివేదిక ఇచ్చింది. ఇటీవల జరిగిన జనరల్ ట్రాన్స్‌‌ఫర్ల విషయంలోనూ అనేక అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై కూడా విజిలెన్స్‌‌ దర్యాప్తు చేయిస్తున్నట్టు మంత్రి దామోదర రాజనర్సింహా స్వయంగా ప్రకటించారు.