![ముందు రైతు భరోసా.. తర్వాత ఆత్మీయ భరోసా.. నాలుగు స్కీములు వేర్వేరుగానే అమలు](https://static.v6velugu.com/uploads/2025/02/the-government-has-decided-to-implement-the-four-schemes-separately_wXRb5zHVSy.jpg)
- ముందు రైతు భరోసా.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధుల జమ
- ఇప్పటికే ఒక ఎకరా ఉన్న రైతులకు పెట్టుబడి సాయం జమ
- నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం గత నెల 26వ తేదీన ప్రారంభించిన నాలుగు పథకాలను వేర్వేరుగానే అమలు చేయాలని నిర్ణయించింది. ఒకటే గ్రామం.. అర్హులందరికీ నాలుగు పథకాలు అని ప్లాన్ చేసినప్పటికీ సాధ్యపడకపోవడంతో రూట్ మార్చింది. సులువుగా పూర్తయ్యే పథకాలను ముందుగా అమలు చేసి.. మిగతా వాటిని తరువాత పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఈ నాలుగు ప్రజా పథకాలను మండలానికి ఒక గ్రామం చొప్పున గత నెలలో ప్రభుత్వం ప్రారంభించింది.
ఈ నెల మొదటి వారంలో ప్రతి గ్రామానికి షెడ్యూల్వేసి.. మార్చి 31 వరకు అన్ని గ్రామాల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనుకోవడం, ఒక్కొక్క గ్రామం చేయడం సమయం వృథాతో పాటు అంత సులువుగా లేదనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు. దీంతో నాలుగు ప్రజా పాలన పథకాల్లో ముందు నేరుగా లబ్ధిదారుడి ఖాతాలకు నిధులు జమ చేసే వాటిని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నది.
రేపటి నుంచి రైతు భరోసా
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలకు సంబంధించి లబ్ధిదారుల డేటా ప్రభుత్వం దగ్గర క్లియర్గా ఉన్నది. రాళ్లు, రప్పలు, సాగుకు పనికి రాని ఇతర భూములు రెండున్నర లక్షల ఎకరాలుగా గుర్తించి ఆ సర్వే నంబర్లను బ్లాక్ చేసింది. దీంతో మిగిలిని కోటి 50 లక్షల ఎకరాలకు రైతు భరోసా డబ్బులు వేసేందుకు ఇబ్బంది లేదని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ఒక్కొక్క గ్రామం కాకుండా.. గతంలో ఇచ్చినట్లుగానే ఎకరా, రెండు ఎకరాలు, మూడు ఎకరాలు ఇలా విడతల వారీగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది.
అందులో భాగంగానే ఇటీవలె ఒక ఎకరా వరకు దాదాపు 17 లక్షల మంది రైతులకు నిధులు జమ చేసింది. సోమవారం లేదా మంగళవారం రెండు ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వనుంది. అదే సమయంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం ప్రభుత్వం భూములు లేని వ్యవసాయ కూలీల లెక్కను కూడా తేల్చింది. వారి బ్యాంక్ అకౌంట్ నంబర్లను కూడా సేకరించింది. వారికి కూడా ఏకకాలంలో నిధులు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఇక రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగించనున్నారు.
ఎప్పటికప్పుడు వెరిఫై చేస్తూ ఆన్లైన్లోనే రేషన్ కార్డుల వివరాలను ఆప్డేట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా అర్హుల గుర్తింపు దాదాపుగా పూర్తయింది. అయితే మొదటి విడత లబ్ధిదారులు నాలుగున్నర లక్షల మందిని ఫైనల్ చేసేందుకు ఇన్చార్జ్ మంత్రులు ఆమోదం తెలపాల్సి ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా ఇన్చార్జ్ మంత్రులు లబ్ధిదారుల జాబితా ఫైనల్ చేసిన తరువాత వారి ఖాతాల్లో ఫస్ట్ ఫేజ్లో రూ.ఒక లక్ష జమ చేయనున్నారు.