హైదరాబాద్: గుడిసె వాసుల ఆరాధ్యదైవం కాకా వెంకటస్వామి జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 5న వెంకటస్వామి జయంతిని, డిసెంబర్ 22న వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని ఆదేశిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 1929 అక్టోబర్ 5న నిజాం సంస్థానంలోని హైదరాబాద్ నగరంలోని తోపుఖాన ప్రాంతంలోని నిరుపేద కుటుంబంలో జన్మించిన వెంకటస్వామి.. కేంద్ర మంత్రిగా దేశానికి సేవలందించారు. 20 ఏండ్లు నిండకముందే ఎన్నో పోరాటాలు చేశాడు.
భవన నిర్మాణ కూలీగా, తెలంగాణ ఉద్యమకారుడిగా మొదలైన ఆయన జీవితం కార్మిక నాయకుడి నుంచి ఎంపీగా, కేంద్ర మంత్రిగా జాతీయ స్థాయికి చేరింది. కేంద్ర మంత్రిగా కార్మికుల పక్షపాతిగా ఆయన ఎన్నో సేవలు చేశాడు. తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమాలలో కాకా అని గుర్తింపు పొందిన వెంకటస్వామి కీలకపాత్ర వహించాడు. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి తెలంగాణ సాధన ఉద్యమం దాకా అన్నింట్లోనూ వెంకటస్వామి పాల్గొన్నారు.1969 ఉద్యమ సమయంలో అరెస్ట్ అయిన ఉద్యమకారుల కోసం ముషీరాబాద్ జైలుకు పోయి అక్కడ పోలీసుల కాల్పుల్లో బుల్లెట్ దెబ్బలు తిన్నాడు. మరణం అంచులదాకా పోయి పోరాటపటిమతో బతికాడు.
గుడిసెవాసుల కోసం..
హైదరాబాద్లో బతకడానికి వచ్చిన పేదలు ఖాళీ జాగాల్లో గుడిసెలు వేసుకునేవారు. భూముల విలువలు పెరగటంతో భూస్వాములు, గుండాలు దౌర్జన్యంగా పేదవారి భూములను లాక్కోవాలని చూశారు. సర్కారు కూడా గుడిసెలు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చింది. ఖాళీ చేయకపోవడంతో దౌర్జన్యంగా వారిపై లాఠీఛార్జ్ చేశారు. అప్పుడు ఆ సంఘటన చూసి చలించిన వెంకటస్వామి దేశంలోనే మొదటిసారిగా 1949లో మొదటి జాతీయ గుడిసెల సంఘం ఏర్పాటు చేశారు.
పేదవారి గుడిసెలు వారికేఇచ్చివేయాలని కాకా హైదరాబాదులో లక్షల మందితో భారీ ర్యాలీ చేశారు. ఈ సంఘటనతో ప్రభుత్వం దిగివచ్చి పేదలున్న జాగాలను వారికే ఇప్పించింది. ఈ పోరాటంతోనే హైదరాబాద్లో దాదాపు 80 వేల మందికి సొంతగూడు వచ్చింది. కాకా చేసిన బషీర్బాగ్ గుడిసెల పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. వెంకటస్వామి చేసిన ఈ గుడిసెల పోరాటానికి ప్రతీకగా చాలామంది గుడిసెల వెంకటస్వామి అని, కాకా అని ప్రేమగా పిలుచుకునేవారు.
సింగరేణిని సిరుల వేణి చేసిన మహనీయుడు
కాకా వెంకట స్వామి కార్మికుల సంక్షేమం కోసం సహకార సొసైటీలను ఏర్పాటు చేయించారు. కార్మికులకు కనీస వేతనాలు జీవన భద్రత కోసం పోరాడి విజయం సాధించారు. నష్టాలలో ఉన్న సింగరేణి కంపెనీ, అక్కడ పనిచేసే కార్మికుల జీవితాలు రోడ్డున పడవద్దని ఆలోచించి ఆ కాలంలోనే సింగరేణికి రూ.1100 కోట్ల నిధులు ఇప్పించి సింగరేణినీ ప్రగతి పథం వైపు నడిచేలా చూశాడు.
బొగ్గు గని కార్మికుల కోసం ప్రత్యేకంగా పీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ సౌకర్యం కల్పించారు. మొదటిసారిగా ప్రైవేట్ రంగంలో పెన్షన్స్ సౌకర్యం ఆలోచన చేసింది కూడా కాకానే. రామగుండం ఎరువుల కంపెనీ పునరుద్ధరణ కోసం ఆయన ఎంతో కృషి చేశారు. కాకా చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ జయంతి, వర్థంతి రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించనున్నది.