వారసత్వ సంపదకు మెరుగులు

వారసత్వ సంపదకు మెరుగులు
  •    చారిత్రక కట్టడాలు, బ్రిడ్జిలు, బావులపై రాష్ట్ర సర్కార్ ఫోకస్  
  •     పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు బల్దియా అధికారులు ప్లాన్  
  •     పరిరక్షిస్తూ భవిష్యత్ తరాలకు అందించేలా నిర్ణయం

హైదరాబాద్, వెలుగు : సిటీలోని వారసత్వ సంపదను పరిరక్షిస్తూ.. పర్యాటకంగా డెవలప్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా  తీర్చిదిద్దేందుకు బల్దియా ఫోకస్ చేసింది. వారసత్వ కట్టడాలు, బ్రిడ్జిలు, బావులను అందంగా ముస్తాబు చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తోంది. రాష్ట్ర సర్కార్ ఆదేశాలతో నివేదికను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నవగా.. తొందరలోనే పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారు. ఇప్పటికే మూసీ రివర్ డెవలప్ మెంట్ పై రాష్ట్ర సర్కారు స్పెషల్ ఫోకస్ పెట్టింది.1930 వరకు మంచినీటిని అందించిన హుస్సేన్ సాగర్ ఇప్పుడెలా తయారైందో తెలిసిందే.

ఇలాంటివి సిటీలో 360 వారసత్వ కట్టడాలు ఉండగా.. హెచ్ఎండీఏ పరిధిలో మరో160 వరకు ఉన్నట్లు నిపుణులు తెలిపారు. 500 ఏండ్ల కిందటి భవనాలు ఎన్నో ఉన్నాయి. బన్సీలాల్ పేట మెట్ల బావి తరహాలోనే మిగతా ప్రాంతాల్లో గుర్తించి తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే గుడిమల్కాపూర్ లో మెట్ల బావి పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు బ్రిడ్జిలు కూడా అభివృద్ధి చేస్తుండగా ముసారంబాగ్ బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. ఇలాంటివాటిపై బల్దియా పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. 

భావితరాలకు అందించేలా..  

వారసత్వ సంపదను పరిరక్షిస్తూ, భావితరాలకు అందించే సంకల్పంతో చర్యలకు బల్దియా సిద్ధమైంది. రూ.18.33 కోట్లతో మోజం జాహి మార్కెట్, మౌలాలి కామన్,  క్లాక్ టవర్ సుందరీకరణ పనులు చేసింది. చార్మినార్ పెడిస్ట్రియన్ కింద చేపట్టిన వివిధ అసంపూర్తి పనులను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.  చార్మినార్ చుట్టు రాణి గంజ్ కమాన్, షేక్ ఫయిజ్ కమాన్, చట్ట బజార్ కమాన్, దివాన్ దేవుడి కమాన్

దబీర్ పూర్ కమాన్, హుస్సేనీ అలం ఆరు కమాన్ల పునర్నిర్మాణం, పునరుద్ధరణ పనులకు ఇప్పటికే ప్రతిపాదించారు. ముర్గి చౌక్, సర్దార్ మహల్ పనులు కూడా చేపట్టనున్నారు. వీటిని ఇదివరకే చేపట్టాల్సిన పనులు కాగా.. ఇప్పుడు వీటితో పాటు  మిగతా వాటిని కూడా అభివృద్ధి చేస్తారు. మొత్తంగా వారసత్వ ప్రాంతాలకు హంగులు అద్దుతారు.  

గత సర్కారు పట్టించుకోలే.. 

వారసత్వ కట్టడాలను పరిరక్షిస్తూ అభివృద్ధి చేస్తామని గత సర్కార్ చెప్పింది. ఇందులో భాగంగా  హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరి నీళ్ల లెక్క మారుస్తామని ప్రకటించి చేయలేకపోయింది. నాంపల్లి సరాయిని కూడా చేయనేలేదు. 2021 డిసెంబర్ లో నాంపల్లి సరాయి పక్కన రూ. 11 కోట్లలో 187 మందికి వసతి కల్పించేలా భవనం నిర్మించేందుకు బల్దియా స్టాండింగ్ కమిటీ అప్రూవల్ లభించినా పనులైతే చేయలేదు. ఇప్పుడా పరిస్థితి లేకుండా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. చారిత్రక కట్టడాల పరిరక్షణకు గ్రేటర్ హైదరాబాద్ హెరిటేజ్ కమిటీ (జీహెచ్ హెచ్​సీ) కూడా యాక్టివ్ కానుంది.

చారిత్రక కట్టడాల సమీప ప్రాంతాల్లోని అక్రమణలను తొలగించడంతో పాటు హెరిటేజ్ యాక్ట్ 22 ఆఫ్ 2017  మేరకు చర్యలు తీసుకోవాలని గతంలోనే నిర్ణయం తీసుకుంది.  కమిటీ చైర్మన్ గా బల్దియా కమిషనర్, జీహెచ్ హెచ్ సీ సభ్యులుగా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ కమిటీ   సమావేశాలు కూడా నిర్వహించే చాన్స్ ఉంది. వారసత్వ కట్టడాలతో పాటు పరిసర ప్రాంతాల పరిరక్షణ చర్యల్లో భాగంగా ఆక్రమణలను తొలగించడంతో పాటు హెరిటేజ్ ప్రాంతాలను పరిశుభ్ర పరిచి,  నిర్వహణకు చర్యలు తీసుకోనుంది.