హైదరాబాద్, వెలుగు: ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రతి జిల్లాకో క్లినిక్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న జిల్లా హాస్పిటళ్లు లేదా టీచింగ్ హాస్పిటళ్లలోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు. అవసరాన్ని బట్టి వారానికి రెండు లేదా మూడు రోజుల పాటు క్లినిక్స్ నిర్వహించనున్నారు. ప్రతి క్లినిక్‌లో జనరల్ ఫిజీషియన్, డెర్మటాలజిస్ట్, సైకియాట్రిస్ట్ అందుబాటులో ఉండనున్నారు. అవసరాన్ని బట్టి గైనకాలజిస్ట్, యూరాలజిస్ట్, ఇతర స్పెషలిస్ట్ డాక్టర్లను డిప్యూట్ చేయనున్నారు.
ఆరోగ్య, మహిళా సంక్షేమ శాఖ సంయుక్తంగా ఈ క్లినిక్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తాము అనారోగ్యం బారిన పడ్డప్పుడు హాస్పిటళ్లకు వెళ్లలేకపోతున్నామని, ఒకవేళ ధైర్యం చేసి వెళ్లినా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ట్రాన్స్‌జెండర్లు ఇటీవల ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. హాస్పిటల్స్‌లో తమకోసం ప్రత్యేకంగా ఓ రూమ్ కేటాయించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ట్రాన్స్‌జెండర్ల కోసం క్లినిక్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.