నిజామాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ హామీలు సరిగా అమలయ్యేలా శాసన మండలిలో పోరాడుతానని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ కరీంనగర్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నాలుగు ఉమ్మడి జిల్లాల బీజేపీ అధ్యక్షుల మీటింగ్ గురువారం నిజామాబాద్ సిటీలో జరిగింది.
ఈ సందర్భంగా అభ్యర్థి అంజిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెరుగైన విద్య ,వైద్యం అందించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అబద్ధపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. గత బీఆర్ఎస్ పాలకులు కూడా హామీలతో మోసగించారన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ చార్జ్ లు చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, ఎమ్మెల్యేలు, వెంకట రమణారెడ్డి, పాయల్ శంకర్, ధనపాల్ సూర్య నారాయణ గుప్త పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి క్యూ ఆర్ కోడ్ పత్రాలను ఆవిష్కరించారు.