- చైర్మన్‌గా సెర్ప్ సీఈఓ..14 మంది సభ్యులు
- నెల రోజుల్లో యాక్షన్ ప్లాన్ సమర్పించాలని ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు : మూసీ నిర్వాసిత కుటుంబాలకు ఉపాధి కల్పించడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రివర్ బెడ్లో ఇండ్లు కోల్పోయిన ఫ్యామిలీలకు డబుల్ బెడ్రూమ్ఇండ్లు కేటాయించిన ప్రభుత్వం.. విద్య, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సెర్ప్ సీఈఓ చైర్మన్‌గా, జీహెచ్ఎంసీ కమిషనర్ వైస్ చైర్మన్‌గా 14 మంది సభ్యులతో జీవనోపాధి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ దాన కిషోర్ మెంబర్ కన్వీనర్‌గా ఉన్న ఈ కమిటీలో మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖతోపాటు పాఠశాల విద్య కమిషనర్, తెలంగాణ గురుకుల పాఠశాలల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కమిటీలోని సభ్యులు తమ తమ శాఖలకు సంబంధించిన కార్యాచరణను రూపొందించి 30 రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది. ఆరేండ్ల పిల్లలకు సమీపంలోని అంగన్ వాడీల్లో ప్రవేశాలు కల్పించడం
మహిళా స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇప్పించడం కమిటీ బాధ్యతలుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. జీహెచ్ఎంసీలోని యూసీడీ విభాగం ద్వారా జీవనోపాధి కోసం సర్వే చేయడం, మెప్మా ద్వారా బ్యాంకు లింకేజీలు సులభతరం చేయడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల సహకారంతో వివిధ సంక్షేమ పథకాల కోసం అర్హులైన వారిని గుర్తించడం, విద్యార్థులకు వారి సమీపంలోని పాఠశాలలు, రెసిడెన్షియల్ సంక్షేమ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించేలా చూడటం కమిటీ బాధ్యతలుగా ప్రభుత్వం పేర్కొంది.