గాడిన పడుతున్నహెల్త్ కేర్.. వైద్యారోగ్య శాఖపై ఏడాదిలో రూ.10 వేల కోట్ల ఖర్చు

గాడిన పడుతున్నహెల్త్ కేర్.. వైద్యారోగ్య శాఖపై ఏడాదిలో రూ.10 వేల కోట్ల ఖర్చు

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్  హయాంలో కుంటుపడిన వైద్య రంగాన్ని కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రక్షాళిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే  వైద్యారోగ్య శాఖపై ఏకంగా రూ.10 వేల కోట్లు ఖర్చుచేసింది. డిపార్ట్ మెంట్‎లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేస్తుండటంతో పాటు ఏండ్లుగా పేరుకుపోయిన సమస్యలను సైతం పరిష్కరిస్తున్నది. ఏడాది కాలంలో ఏకంగా 7,332 పోస్టులను మెడికల్ అండ్ హెల్త్  సర్వీసెస్  రిక్రూట్‌‌మెంట్  బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్ బీ) భర్తీచేసింది. 442 సివిల్  అసిస్టెంట్ సర్జన్లు సోమవారం సీఎం రేవంత్​ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నారు.

ఎంహెచ్‌‌ఎస్‌‌ఆర్‌‌‌‌బీ ద్వారా మరో 6,470 పోస్టులకు కాంగ్రెస్  సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మరో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 1690 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్‌‌) పోస్టులు, 308 ఫార్మసిస్ట్‌‌ (ఆయుష్‌‌) పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు ఇవ్వనున్నది. సోమవారం  కొత్తగా 213 కొత్త అంబులెన్సులను సీఎం ప్రారంభించనున్నారు. వీటితో కలిపి రాష్ట్రంలో అంబులెన్స్‌‌ల సంఖ్య 790 నుంచి 1003కి పెరగనుంది. 
 

దీంతో అంబులెన్స్  రెస్పాన్స్  టైం సగటున 18 నిమిషాల నుంచి 14 నిమిషాలకు తగ్గనుంది. అంబులెన్స్‌‌ల నిర్వహణకు సంవత్సరానికి రూ.145 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తున్నది. అలాగే, ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేకంగా మైత్రి క్లినిక్​లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్‌‌లో ఇప్పటికే ఒక క్లినిక్  అందుబాటులో ఉండగా, మిగిలిన జిల్లాల్లోనూ ఒక్కో క్లినిక్  చొప్పున 32 క్లినిక్స్‌‌ను సీఎం రేవంత్  రెడ్డి సోమవారం వర్చువల్‎గా  ప్రారంభించన్నారు. వీటిలో  ట్రాన్స్‌‌జెండర్లకు వైద్యసేవలు అందించనున్నారు. 

పెరిగిన ఎంబీబీఎస్  సీట్లు

ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చింది. ములుగు, నారాయణపేట, మెదక్, గద్వాల, కుత్బుల్లాపూర్, నర్సంపేట, మహేశ్వరం, యాదాద్రిలో కాలేజీలు, హాస్పిటళ్లను ఏర్పాటు చేసింది. దీంతో ఒక్కో కాలేజీలో 50 సీట్ల చొప్పున, మొత్తం 400 ఎంబీబీఎస్  సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ 400 సీట్లతో కలిపి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్  సీట్ల సంఖ్య 3,690 నుంచి 4,090కి పెరిగింది. కొత్తగా 50 పీజీ సీట్లు మంజూరయ్యాయి. 

వీటితో కలిపి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల సంఖ్య 1191కు చేరింది.  6,956 నర్సింగ్  ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసింది. మరో 2,322 నర్సింగ్  ఆఫీసర్  పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. 16 నర్సింగ్  కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 960 సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. 28 పారామెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రారంభించింది. వీటితో కలిపి ప్రభుత్వ పారామెడికల్  కాలేజీల సంఖ్య 12 నుంచి 40కి పెరిగింది. కొత్తగా ప్రారంభించిన ఒక్కో కాలేజీలో 60 సీట్ల చొప్పున 1680 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో జిల్లాల్లోనూ ఐవీఎఫ్ సెంటర్లు 

ఇన్‌‌ఫర్టిలిటీ సమస్య పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారింది. మాతృత్వం కోసం పరితపిస్తున్న మహిళలకు లక్షల ఖరీదైన ఐవీఎఫ్  సేవలను ఉచితంగా అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గాంధీ హాస్పిటల్‌‌లో ఐవీఎఫ్  సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పేట్లబుర్జు దవాఖానలో రూ.4.15 కోట్లతో ఐవీఎఫ్‌‌  సెంటర్‌‌‌‌ను సోమవారం ప్రారంభించనున్నారు. కరీంనగర్‌‌‌‌, వరంగల్‌‌, ఖమ్మం వంటి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనూ భవిష్యత్తులో ఐవీఎఫ్ సెంటర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక రోడ్డు ప్రమాదాలు, ఇతర ఎమర్జన్సీ సమయంలో బాధితుల ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 74 ట్రామా కేర్  సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.