సన్నాలకు 939 కోట్ల బోనస్.. అటు రైతుకు, ఇటు సర్కారుకు మేలు

సన్నాలకు 939 కోట్ల బోనస్.. అటు రైతుకు, ఇటు సర్కారుకు మేలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వానాకాలంలో సన్నరకాలు వేసిన రైతాంగానికి సాగు సంబురంగా మారింది. సర్కారు సన్న రకాల సాగును ప్రోత్సహించడంతో పాటు బోనస్ చెల్లింపుతో రైతులకు అదనంగా లబ్ధి చేకూరినట్టు అయింది. ఈ యేడు వానాకాలంలో రికార్డు స్థాయిలో వరి సాగు కాగా.. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు సన్నాలను సాగు చేశారు. 

వాతావరణం అనుకూలించడంతో దిగుబడులు కూడా అధికంగా వచ్చి రైతుల పంట పండినట్లయింది. గతంలో వ్యాపారులు పెట్టిందే ధర అన్నట్టు ఉండేది. కానీ, సర్కారు అదనంగా బోనస్​ఇస్తుండడంతో బహిరంగ మార్కెట్‎లో కూడా సన్నాలకు డిమాండ్​ పెరిగింది. దీంతో ఈయేడు సన్నాలు వేసిన రైతులు సంబురాల్లో ఉన్నరు. 

ఇచ్చిన మాట ప్రకారం బోనస్..

వానాకాలం సీజన్‎కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు 8.84 లక్షల మంది రైతుల నుంచి రూ.10,903 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇప్పటికే రూ.10,149 కోట్ల చెల్లింపులు పూర్తిచేసింది. అలాగే, ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు రూ.500 బోనస్ చెల్లించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3.36 లక్షల మంది రైతులు ఈ సారి సన్న వడ్ల బోనస్ అందుకున్నారు. 

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు18.78 లక్షల టన్నుల సన్న వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటికి అదనంగా ఇచ్చే రూ.500 బోనస్ ప్రకారం రూ.939 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.591 కోట్లు చెలింపులు చేసింది. ఎప్పటికప్పడు బోనస్​ చెల్లింపులు చేస్తుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. 

నిరుడు కంటే 6 లక్షల టన్నులు అధికంగా కొనుగోళ్లు..

రాష్ట్రంలో ప్రభుత్వం ఈసారి 8,318 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 47.01 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు సెంటర్ల ద్వారా సేకరించింది. అందులో 28.23 లక్షల టన్నులు దొడ్డు రకాలు కాగా.. 18.78 లక్షల టన్నుల సన్న ధాన్యాన్ని బోనస్‎తో కొనుగోళ్లు చేపట్టింది. 

గతేడాది (2023 వానాకాలం సీజన్​లో) ఇదే టైమ్‎కు 41.20 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా.. ఈ ఏడాది నిరుడుకంటే 6 లక్షల టన్నులు  ఎక్కువే కొనింది. ధాన్యం సేకరణలో కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి. 

రేషన్​ షాపుల్లో సన్న బియ్యం పంపిణీకి లైన్​ క్లియర్..​

రాష్ట్ర సర్కారు వచ్చే ఏడాది నుంచి రేషన్​ షాపుల్లో సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 18.78 లక్షల టన్నుల సన్న వడ్ల సేకరణ జరిగింది. దీంతో సన్న బియ్యం పంపిణీకి లైన్​ క్లియర్​అయినట్లయింది. సేకరణ పూర్తయ్యే నాటికి సివిల్​సప్లయ్స్​ అనుకున్న లక్ష్యానికి చేరుకుంటుందని ఆ డిపార్ట్​మెంట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

రైతులకు బోనస్​ ఇచ్చి సేకరించిన సన్న వడ్లను మిల్లింగ్​ చేసి.. వాటినే పేదలకు రేషన్​షాపులలో సన్న బియ్యాన్ని అందించేందుకు పౌర సరఫరాలశాఖ సన్నాహాలు చేస్తోంది. సన్న వడ్ల సేకరణ ద్వారా అటు రైతుకు లాభం చేకూరుతుండగా.. ఇటు సన్న బియ్యం ఇవ్వాలని భావిస్తున్న  సర్కారుకు బహిరంగ మార్కెట్​లో కంటే తక్కువకే సన్న బియ్యం లభిస్తుండడంతో ప్రభుత్వానికి  మేలు జరగనుంది.