చిన్న కాళేశ్వరానికి 571 కోట్లు

చిన్న కాళేశ్వరానికి 571 కోట్లు
  • రెండేండ్లలో మిగిలిన ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ఆదేశం 
  • అధికారులతో మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు రివ్యూ

హైదరాబాద్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర్) ఎత్తిపోతల పథకంలో మిగిలిన పనులను పూర్తి చేసేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2007లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు 75 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులను పూర్తి చేసేందుకు రూ.571.57 కోట్ల నిధులను సర్కారు మంజూరు చేసింది. రెండేండ్లలో పెండింగ్‌‌ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు శనివారం జల సౌధలో ప్రాజెక్టు పనులపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులతో రివ్యూ చేశారు.

 ఈ ప్రాజెక్టు పూర్తయితే మంథని నియోజకవర్గంలోని 63 గ్రామాల్లో 45 వేల ఎకరాలకు సాగు నీరు అందించడంతో పాటు అర టీఎంసీ నీటిని తాగు నీటి కోసం వినియోగించుకునేందుకు వీలవుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గోదావరి నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా నీటిని తరలించి కన్నెపల్లి ఒకటో పంప్​హౌస్ నుంచి 4.2 టీఎంసీల నీటిని దిగువన కాటారంలో ఏర్పాటు చేసే రెండో పంప్ హౌస్‌‌కు ఎత్తిపోస్తారని చెప్పారు. మొదటి పంప్ హౌస్ నుంచి మందిరం చెరువు, ఎర్ర చెరువుకు నీటి సరఫరా జరుగుతుందని, మిగిలిన నీరు రెండో పంప్ హౌస్‌‌కు చేరుతుందని తెలిపారు. కాటారం పంప్ హౌస్ ద్వారా గారెపల్లి, పోలారం, తాండ్ర, ఎల్లాపూర్, కొత్తపల్లి, రుద్రారం, ధన్వాడ, ఆదివారంపేట, గుమ్మలపల్లి, వీరాపూర్, గూడూర్ చెరువులకు గోదావరి జలాలను తరలిస్తామని మంత్రి చెప్పారు. ఈ పథకంలో భాగంగా ఎర్ర చెరువు సామర్థ్యాన్ని పెంచనున్నారు. వరదకు తెగిపోయిన రుద్రారం చెరువు గండిని పూడ్చి బలోపేతం చేసే పనులు కూడా పూర్తి కావొచ్చాయి. 

శ్రీరాంసాగర్ నీటితో 28 వేల ఎకరాల ఆయకట్టు..

ప్రస్తుతం మంథని నియోజకవర్గంలో శ్రీరాంసాగర్ జలాలతో 28,800 ఎకరాలకు సాగునీరు అందుతోంది. డీ83 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ద్వారా గుండారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌‌‌‌లోకి గోదావరి జలాలు చేరుకుంటాయి. అక్కడి నుంచి 24 మైనర్ కాల్వల ద్వారా మొత్తం 28,800 ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నారు. అయితే, ప్రస్తుతం మైనర్‌‌‌‌ కాల్వల్లో పూడిక చేరడంతో నిర్దేశిత ఆయకట్టుకు నీరు అందడం లేదు. దీంతో గుండారం చెరువు నుంచి మైనర్‌‌‌‌ కాల్వల చివరి వరకు మరమ్మతులు చేసి నీటి సామర్థ్యాన్ని పెంచాల్సిందిగా శ్రీరాంసాగర్ ఇంజనీర్లను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.