పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గుంటిమడుగు రిజర్వాయర్, మంథని మండలంలోని పోతారం లిఫ్టులకు ఈ బడ్జెట్లోనూ ప్రభుత్వం నిధులను కేటాయించలేదు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెదరాత్పల్లి భీమునిగుళ్ల, సుంకరికోట లో రూ. 300 కోట్లతో బ్యారేజ్ నిర్మించడానికి నిర్ణయించింది. 2016లో స్థలాన్ని కూడా పరిశీలించారు. అప్పటి నుంచి బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. 2023–24 బడ్జెట్లో బ్యారేజీ కోసం రూపాయి కూడా కేటాయించకపోవడంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మంథని మండలంలోని పోతారం, దామరకుంట సమీపంలో స్థిరీకరించాలనుకున్న లిఫ్ట్ సిస్టంను కూడా సర్కార్ మరిచిపోయింది. లిఫ్టులు, రిజర్వాయర్ నిర్మాణాల వల్ల వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని రైతులు ఆశపడుతున్నారు.
బ్యారేజీతో టేల్ఎండ్కు మేలు...
గుంటిమడుగు బ్యారేజ్ నిర్మాణం వల్ల ఎస్సారెస్పీ టేల్ ఎండ్ రైతులకు మేలు జరుగుతుంది. 5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే బ్యారేజ్ వల్ల 50 నుంచి 60 వేల ఎకరాల పంటలకు నిరందే అవకాశం ఉంది. ఎలాంటి ముంపు లేకుండా రెండు గుట్టల నడుమ 400 మీటర్ల వరకు బ్యారేజ్ నిర్మిస్తే మానేరులో దాదాపు 9 కిలో మీటర్ల పొడవునా , హుస్సేన్మియా వాగులో మరో 9 కిలో మీటర్ల పొడవునా నీరు నిల్వ ఉంటుంది. గుంటిమడుగు బ్యారేజ్ ద్వారా కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, మంథని, ముత్తారం, కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, హుజురాబాద్, భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలాల్లోని గ్రామాలకు సాగు నీరందుతుంది. ఏటా మానేరు నుంచి 150 టిఎంసీల నీరు గోదావరి ద్వారా సముద్రంలో కలుస్తోంది. ఎల్ఎండీ, మిడ్‌మానేరు, ఎస్సారెస్పీ, హుస్సేన్మియా, నక్కలవాగు, చలివాగు, శ్రీరామసరోవర్ గుట్టల నుంచి పారే నీరంతా మానేరులో కలిసి వృథాగా పోతుంది.
లిఫ్టులతోనే సమస్య సాల్వ్...
పోతారం ఎత్తిపోతల పథకానికి దశాబ్దాలుగా డిమాండ్ ఉంది. పక్కనే కాళేశ్వరం ప్రాజెక్టు, మూడు బ్యారేజీలున్నాయి. అయినా మంథని, ముత్తారం, రామగిరి మండలాల్లోని టేల్ఎండ్ 20 గ్రామాలకు సాగునీరు అందటం లేదు. దీంతో దాదాపు 40 వేల ఎకరాల భూమి సాగుకు నోచుకోవడం లేదు. మరోవైపు సింగరేణి ఓసీపీల విస్తరణలో ఎస్పారెస్పీ కెనాల్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. తెలంగాణ ఏర్పాటు కాక ముందే మంథని మండల పరిధిలోని గోదావరి మీద పోతారం వద్ద లిఫ్టుకు ఆనాటి ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత పోతారం లిఫ్ట్‌ను టీఆర్ఎస్ సర్కార్ పక్కన పెట్టింది. కానీ గత ఎనిమిదేళ్లుగా సాగు నీటి కోసం గోదావరిపై మంథని మండలం పోతారం వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్సారెస్పీ డి 83 గుండారం కింది ప్రాంతానికి 2007 తర్వాత పొలాలకు కాలువ నీరు రావడం లేదు. మంథని మండలం పోతారం వద్ద లిప్ట్ ఏర్పాటు చేసి ఎస్సారెస్పీ కాలువల నీటిని అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గుండారం రిజర్వాయర్ కింది ప్రాంతమైన మండలాల్లో 40 వేల ఎకరాల ఆయకట్టుకు ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగునీరు అందడం లేదు. దీంతో పొలాలను పత్తి చేన్లుగా మార్చుకొని రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. మంథని ప్రాంతంలో మూడు బ్యారేజీల్లో 365 రోజులు నీరు ఉండి కూడా మంథని ప్రాంతానికి చుక్క నీరు సాగుకు రావడం లేదు. దీంతో స్థానిక రైతులు సాగునీరు కోసం లిఫ్టులు ఏర్పాటు చేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.