ఏడాది కిందే ముగిసిన మిర్యాలగూడ మార్కెట్‌‌‌‌ పాలకవర్గ గడువు

మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ అగ్రికల్చర్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ కమిటీ పాలక వర్గ గడువు ముగిసి ఏడాది దాటినా ప్రభుత్వం కొత్త పాలకవర్గాన్ని నియమించడం లేదు. ఈ మార్కెట్‌‌‌‌ కమిటీ సెలక్షన్‌‌‌‌ గ్రేడ్‌‌‌‌ కమిటీగా గుర్తింపు పొందింది. ఈ కమిటీ పరిధిలో మాడ్గులపల్లి, మిర్యాలగూడ, వేములపల్లి, అడవిదేవులపల్లి, దామరచర్ల మండలాలతో పాటు త్రిపురారం, నిడమనూరు మండలాల పరిధిలోని 8 గ్రామాలు ఉన్నాయి. గత పాలకవర్గ గడువు 2021 ఆగస్టుతో ముగిసింది. గతంలో పదవీకాలం ముగిసిన నెల రోజుల్లోనే కొత్త కమిటీని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు మాత్రం ఏడాది గడిచినా పట్టించుకోవడం లేదు. దీంతో పదవుల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  

ఎస్సీ రిజర్వ్‌‌‌‌ కావడం వల్లే అంటున్న దళిత సంఘాలు

మిర్యాలగూడ మార్కెట్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ పదవి 2018లో ఎస్టీకి రిజర్వ్‌‌‌‌ కావడంతో చిట్టిబాబునాయక్‌‌‌‌ చైర్మన్‌‌‌‌గా పనిచేశారు. తర్వాత 2019 ఆగస్టులో ఓసీ జనరల్‌‌‌‌కు రిజర్వ్‌‌‌‌ అయింది. దీంతో అందరినీ కో ఆర్డినేట్‌‌‌‌ చేస్తూ నెలరోజుల్లోనే కొత్త పాలకవర్గాన్ని నియమించారు. యాద్గార్‌‌‌‌పల్లికి చెందిన చింతరెడ్డి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి చైర్మన్‌‌‌‌గా నియామకం కాగా 2021 ఆగస్టు వరకు పనిచేశారు. అప్పటి నుంచి పాలకవర్గం ఖాళీగానే ఉంది. ప్రస్తుతం చైర్మన్‌‌‌‌ పదవి ఎస్సీలకు రిజర్వ్‌‌‌‌ అయింది. దీనివల్లే ప్రభుత్వం కమిటీని నియమించడం లేదని దళితసంఘాల లీడర్లు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కొత్త కమిటీని నియమించాలని డిమాండ్‌‌‌‌ చేస్తున్నారు.

ఏటా రూ. 19.35 కోట్ల ఇన్‌‌‌‌కం

మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్‌‌‌‌ పరిధిలో సుమారు 100 రైస్‌‌‌‌ ఇండస్ట్రీస్‌‌‌‌ ఉన్నాయి. అలాగే ఈ మార్కెట్‌‌‌‌ ఆవరణలో వారానికి రెండు సార్లు పశువులు, మేకల సంత జరుగుతుంది. దీంతో మార్కెట్‌‌‌‌కు సెస్‌‌‌‌ రూపంలో ఏడాదికి రూ. 19.35 కోట్ల ఇన్‌‌‌‌కం వస్తోంది. 
అలాగే మార్కెట్‌‌‌‌ ఆవరణలో ఆరు గోడౌన్లు ఉండగా వీటి ద్వారా నెలకు రూ. 5.60 లక్షల రెంట్‌‌‌‌ వస్తోంది. ఈ ఆదాయంతో మార్కెట్‌‌‌‌కు వచ్చే రైతులకు వసతులు కల్పింస్తుంటారు. కానీ ఏడాది కాలంగా కమిటీ లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.