భూములు గుంజుకుని మూడేండ్లు..పరిహారానికి ఇంకెన్నేండ్లు?

భూములు గుంజుకుని మూడేండ్లు..పరిహారానికి ఇంకెన్నేండ్లు?

వరంగల్, వెలుగు: వరంగల్​సిటీ చుట్టూ ఇన్నర్‍ రింగ్‍ రోడ్‍ వేస్తామని మూడేండ్ల కింద రైతులు, భూనిర్వాసితుల దగ్గర భూములు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వారికివ్వాల్సిన పరిహారం ఇప్పటికీ ఇవ్వలేదు. దీంతో బాధితులు కుడా, కలెక్టర్ ఆఫీసు, ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో సాగు చేసుకుందామంటే భూములు లేక, మరెదైనా పనిచేసుకుందామంటే చేతిలో పైసల్లేక రైతులు మానసిక వేదనను అనుభవిస్తున్నారు.  

పనులు మొదలుపెట్టి పన్నెండేండ్లు 

జిల్లాలో ఐఆర్ఆర్‍ పనులకు శ్రీకారం చుట్టి  పన్నెండేండ్లవుతోంది. హైదరాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, నర్సంపేట, ఖమ్మం మీదుగా వచ్చే భారీ వాహనాలు వరంగల్, హనుమకొండ సిటీలోకి రాకుండా దారి మళ్లించేలా ప్రభుత్వం ఐఆర్ఆర్‍ ప్లాన్‍ చేసింది. 'కుడా'కు నిధులు సమకూర్చే బాధ్యత అప్పజెప్పింది. రోడ్డు నిర్మాణ పనులు ఆర్అండ్‍బీకి ఇచ్చారు. 1972 మాస్టర్‍ ప్లాన్ ఆధారంగా అప్పట్లో 200 అడుగుల రోడ్డు ప్రతిపాదన చేశారు. 89.36 ఎకరాల ల్యాండ్ అవసరముండగా, ఇందులో 60 నుంచి 70 ఎకరాలు ప్రైవేట్‍ ల్యాండ్‍ తీసుకోవాల్సి వచ్చింది. 2010లో పనులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం 2012లో భూసేకరణ కోసం రూ.20 కోట్లు కేటాయించింది. మొదటి దశలో రంగశాయిపేట, నాయుడు పెట్రోల్‍ పంప్‍ నుంచి గవిచర్ల క్రాస్‍ రోడ్, స్తంభంపల్లి, జానీపీరీలు, కీర్తినగర్, ఏనుమాముల, పైడిపల్లి, కొత్తపేట, ఆరెపల్లి దామెర జంక్షన్ దాకా సుమారు 8 కిలోమీటర్లు రోడ్డు వేయాలని ప్లాన్​వేశారు. రూ.50 కోట్లతో 25 ఎకరాలను కూడా సేకరించినట్టు చెప్పారు. మిగతా 40 ఎకరాలను ఒకేసారి సేకరిస్తామని చెప్పారు.  

పేపర్​ ప్రకటన ఇచ్చి భూములు గుంజుకున్నరు 

వరంగల్​ఇన్నర్​రింగ్‍ రోడ్‍ నిర్మాణం కోసం కలెక్టర్ G1/23/2019 & RDO  ఫైల్ నంబర్ F/02/2019 భూసేకరణ పేరుతో అధికారులు 02.05.2019లో ఓ పేపర్​ప్రకటన ఇచ్చి ఏనుమాముల, చింతల్, దూపకుంట, ఖిలావరంగల్ కు చెందిన 300 నుంచి 400  రైతులు దగ్గర భూములు తీసుకున్నారు. పరిహారం డబ్బులు ఇవ్వకుండానే వారి భూములకు కుడా (కాకతీయ అర్బన్​డెవలప్​మెంట్​అథారిటీ) ఆధ్వర్యంలో ఫెన్సింగ్‍ ఏర్పాటు చేశారు. భూములిచ్చిన వారు మళ్లీ అందులో పనులు చేయకుండా పలుచోట్ల  మొక్కలు నాటించారు.  

50 కోట్లు ఇవ్వక ఆగిన ఐఆర్ఆర్

ఐఆర్ఆర్‍ నిర్మాణానికి అవసరమైన భూములను సేకరించే క్రమంలో 'కుడా' రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని 'ఓ సిటీ'( ప్లాట్ల అమ్మకం ద్వారా) ఆదాయం, ఎల్ఆర్ఎస్‍ ద్వారా వచ్చే ఫండ్స్​తో ఇవ్వాలని అనుకున్నారు. ఆర్డీఓ పేరుతో రూ.150 కోట్లను కూడా డిపాజిట్‍ చేశారు. కానీ ఐఆర్ఆర్​కోసం ఇంకా భూమి సేకరించాలని, ఈ డబ్బులు చాలవని, మరో రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు అవసరమని రెవెన్యూ శాఖ అధికారులు చెప్పారు. కానీ, కుడా పెద్దలు ఈ అంశాన్ని పక్కన పెట్టడంతో వరంగల్‍ కలల ప్రాజెక్ట్ ఐఆర్‍ఆర్‍ అక్కడే ఆగిపోయింది.  

మూడేండ్లలో భూముల ధరలు ట్రిపుల్

రింగ్‍ రోడ్‍ కోసం భూనిర్వాసితుల నుంచి ప్రభుత్వం భూములు తీసుకుని మూడేండ్లు దాటుతోంది. ఇప్పుడు గ్రేటర్‍ వరంగల్‍ సిటీ పరిధిలో భూముల రేట్లు అమాంతం పెరిగాయి. నాడు గజం ధర రూ.3 వేల నుంచి రూ.5 వేలలోపు ఉంటే ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.15 వేలు పలుకుతోంది. అయితే కుడా అధికారులు అప్పటి పరిహారమే ఇంకా ఇవ్వకపోవడంతో ప్రస్తుత మార్కెట్‍ రేట్‍ కట్టివ్వాలని భూములు ఇచ్చిన వారు డిమాండ్‍ చేస్తున్నారు.  

ఆందోళనలు చేసినా ఫలితం లేదు

భూనిర్వాసితులు ఎన్నోసార్లు కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసినా పరిహారం రాలేదు. హనుమకొండ, వరంగల్‍ కలెక్టరేట్ల ముందు ఆందోళనలు చేసినా ఫలితం లేదు. గతేడాది నవంబర్​లో ధర్నా చేసినప్పుడు వరంగల్‍ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‍ వచ్చి నెలలోపు పరిహారం ఇప్పిస్తానని మాటిచ్చారు. కానీ, ఇప్పటికీ ఏడు నెలలు గడుస్తున్నా పరిహారం ఇచ్చింది లేదు. దీంతో బాధితులంతా మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు.

తేల్చకపోతే పోరాటం తప్పదు

వరంగల్ ఇన్నర్‍ రింగ్‍ రోడ్‍ పేరు చెప్పి మూడేండ్ల కింద భూములు తీసుకున్నరు. నష్టపరిహారం ఇవ్వకుండానే మా భూముల్లో ఫెన్సింగ్‍ వేసిన్రు. 250 మంది బాధితులం కలిసి ఆఫీసర్లు, లీడర్ల ఇండ్ల చుట్టూ తిరుగుతున్నం. అయినా ఎవరు పట్టించుకోవట్లే. మా భూములపై మాకే హక్కుల్లేవు. చేతుల్లో పైసల్లేవు. ఏదో ఒకటి తేల్చకపోతే పోరాటం తప్పదు.  
– ఎండీ. రియాజుద్దీన్‍ (భూబాధితుల జేఏసీ సహాయ కార్యదర్శి)

ఫండ్స్​లేవట 

నెలలో పరిహారం ఇస్తామని భూములు గుంజుకున్నరు. కలెక్టర్ల దగ్గరకు పోయి అడిగితే ఫండ్స్​లేవని చెప్తున్నారు. ప్రపొజల్స్​పంపాం అని ఏండ్లుగా తిప్పుకుంటున్నరు. డబ్బులు ఇవ్వనప్పుడు భూములెందుకు తీసుకోవాలె. మూడేండ్లలో భూముల రేట్లు మస్తు పెరిగినయ్​. ప్రభుత్వం మార్కెట్‍ రేట్‍ ఆధారంగా పరిహారం ఇయ్యాలె. లేదంటే మా భూములు మాకు ఇచ్చెయ్యండి.  
– పాలకుర్తి సత్యనారాయణ, బాధితుడు