మహిళా సంఘాలకు అందని వడ్డీ రాయితీ డబ్బులు
- మహిళా దినోత్సవం సందర్భంగా చెక్కుల పంపిణీ
- జిల్లా వ్యాప్తంగా రూ.12.62 కోట్లు పెండింగ్
మంచిర్యాల, వెలుగు : మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన వడ్డీ రాయితీ పైసలు ఇంకా రాలేదు. మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్భాటంగా చెక్కులు పంపిణీ చేశారు. పంచి ఇప్పటికే నాలుగు నెలలవుతున్నా డబ్బులు రాకపోవడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. చెక్కులు పట్టుకొని డీఆర్డీఏ ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
ప్రభుత్వం నుంచి ఫండ్స్రాలేదని, త్వరలోనే వస్తాయని అధికారులు చెప్పి వారిని పంపించేస్తున్నారు. నాలుగేండ్ల వడ్డీ రాయితీ పైసలకు గానూ ప్రభుత్వం రెండేండ్లకు మాత్రమే చెక్కులు ఇచ్చింది. అవి కూడా చేతికందకపోవడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రూ.12.62 కోట్లు పెండింగ్
మంచిర్యాల జిల్లాలో 10,155 స్వయం సహాయక సంఘాలు, 468 గ్రామైక్య సంఘాలు, 16 మండల సమాఖ్యలున్నాయి. వీటిలో 1.11 లక్షల మంది సభ్యులున్నారు. జిల్లావ్యాప్తంగా యాక్టివ్గా ఉన్న 8,459 సంఘాలకు బ్యాంకు లింకేజీ లోన్లు అందించారు. లోన్లు తీసుకున్న గ్రూపు సభ్యులు 2018 నుంచి వడ్డీ రాయితీ పైసల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం 2018–19, 2019–20 సంవత్సరాలకు సంబంధించిన డబ్బులను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8న మంత్రులు, ఎమ్మెల్యేలు రూ.12.62 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
కానీ ఆ డబ్బులు మహిళా సంఘాల అకౌంట్లలో డబ్బులు జమ కాలేదు. వీటి పరిస్థితే ఇలా ఉంటే.. మిగతా మూడేండ్ల పైసలు ఎప్పుడు వస్తాయోనని మహిళలంతా ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై డీఆర్డీఏ అధికారులను అడిగితే.. విడతల వారీగా బ్యాంకు అకౌంట్లలో జమ అవుతున్నాయని చెప్తున్నారు.
2018 నుంచి ఇయ్యలే..
మహిళా సంఘాల సభ్యులు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని వివిధ వ్యాపారాలు చేసుకుంటున్నారు. తీసుకున్న డబ్బులకు నెలనెలా బ్యాంకులకు వడ్డీతో సహా కిస్తీలు కడుతున్నారు. కాగా ఈ వడ్డీ పైసలను ప్రభుత్వం ఇదివరకు ఎప్పటికప్పుడు చెల్లించేది. కానీ బీఆర్ఎస్ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీ రాయితీ చెల్లింపులు నిలిచిపోయాయి. 2018 నుంచి ఇప్పటివరకు పెండింగ్లోనే ఉన్నాయి.
దీంతో కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. కొన్నేండ్ల నుంచి ఈ డబ్బులు రిలీజ్ చేస్తామని మభ్యపెడుతూ ప్రభుత్వం కాలం గడుపుతోంది.