టీఆర్ఎస్ కు టీచర్ల భయం..ఎన్నికల డ్యూటీకి దూరంగా పెట్టిన సర్కార్

టీఆర్ఎస్ కు టీచర్ల భయం..ఎన్నికల డ్యూటీకి దూరంగా పెట్టిన సర్కార్
  • జీహెచ్ఎంసీ ఎన్నికల డ్యూటీకి దూరంగా పెట్టిన సర్కార్
  • ముందు 15 జిల్లాల టీచర్లు కావాలని విద్యాశాఖకు ఈసీ రెక్వెస్ట్
  • తర్వాత కేవలం నాన్​టీచింగ్ స్టాఫ్​నే పంపించాలని ఆర్డర్స్
  • దుబ్బాకలో టీచర్ల ఎఫెక్ట్​తోనే ఓడామనే భావనలో టీఆర్ఎస్
  • రాష్ట్రంలో టీచర్లు లేకుండా నిర్వహించే తొలి ఎన్నికలివే!

హైదరాబాద్, వెలుగుటీఆర్ఎస్ ప్రభుత్వం టీచర్లంటే భయపడుతోందా? అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికలకు వారిని దూరం పెట్టిందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే 15 జిల్లాలకు చెందిన టీచర్లు కావాలన్న అధికారులు.. వెంటనే వెనక్కి తగ్గారు. కేవలం నాన్ టీచింగ్ స్టాఫ్​ను మాత్రమే పంపాలని కోరారు. దుబ్బాకలో టీచర్ల ఎఫెక్ట్​తోనే ఓడామనే భావనలో టీఆర్ఎస్  ఉందని, అందుకే వారిని జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఉపయోగించుకోవడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలోనే కాకుండా ఉమ్మడి ఏపీ చరిత్రలో కూడా టీచర్లు లేకుండా ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు తొలిసారిగా తాము లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయని టీచర్ల యూనియన్లు చెబుతున్నాయి.

అన్ని ఎన్నికల్లో వాళ్లే..

డిసెంబర్ 1న జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రతి ఎన్నికల నిర్వహణలోనూ టీచర్లది కీలకపాత్ర. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు తప్ప మిగతా అన్ని ఎన్నికల విధుల నిర్వహణలో వారే ఎక్కువగా ఉంటారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లతోపాటలు సహకార ఎన్నికలు, నీటిపారుదల ఎన్నికలు, గ్రాడ్యుయేట్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఇలా అన్నింటా వారి పాత్ర కీలకం. కానీ తొలిసారిగా టీచర్లు లేకుండా ఎన్నికల నిర్వహణకు సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది.

వివరాలు సేకరిస్తుండగానే..

గ్రేటర్ ఎన్నికలకు రిజర్వ్ సిబ్బందితో కలిపి మొత్తం 47 వేల మంది వరకు తీసుకుంటామని ఎన్నికల అధికారులు ప్రకటించారు. వీరిలో సగానికి పైగా టీచర్లు డ్యూటీల్లో ఉండాల్సింది. ఈ క్రమంలో 15  జిల్లాలకు చెందిన టీచర్లను పంపాలని ఎన్నికల అధికారులు.. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులకు సూచించారు. దీంతో ఏయే జిల్లాల నుంచి ఎంతమందిని పంపించాలనే వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉండగానే.. కేవలం నాన్ టీచింగ్ స్టాఫ్ ను మాత్రమే ఎన్నికల విధుల్లోకి పంపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు, మూడు రోజుల్లోనే నిర్ణయం మారడంతో అధికారుల్లోనూ అయోమయం నెలకొంది. దీంతో అన్ని విద్యాశాఖ హెడ్​ఆఫీసుల్లోని నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలను ఎన్నికల అధికారులకు పంపారు.

అందుబాటులోనే ఉన్నా..

టీచర్లకు సర్కారు ప్రతి ఎన్నికల్లోనూ డ్యూటీలు వేసేది. ఆరోగ్య సమస్యలున్నా.. ఒక్కోసారి మినహాయింపు ఇచ్చేది కాదు. ప్రస్తుతం పిల్లలకు పరీక్షలు లేవు.. అసలు ఫిజికల్ క్లాసులే ప్రారంభం కాలేదు. డిజిటల్ పాఠాల పర్యవేక్షణ కోసం టీచర్లు కేవలం వారంలో మూడు రోజులే బడులకు వెళ్లి వస్తున్నారు. ఇలా అందుబాటులోనే ఉన్నా టీచర్లకు ఎలక్షన్ డ్యూటీలు వేయకపోవడం గమనార్హం.

వ్యతిరేకంగా ఉంటారనా..?

2018 మే 16న ప్రగతి భవన్‌‌‌‌లో నిర్వహించిన మీటింగ్​లో టీచర్లకు, ఎంప్లాయీస్​కు సీఎం కేసీఆర్ అనేక హామీలిచ్చారు. కానీ వాటిలో ఒక్కటీ అమలు చేయలేదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2018 జూన్ 2న ఐఆర్ ప్రకటిస్తానని తెలిపారు. కానీ ఇప్పటికీ ప్రకటన చేయలేదు. అంతర్ జిల్లా బదిలీలు, ప్రమోషన్లు, కారుణ్య నియామకాలు, 61 ఏండ్లకు రిటైర్మెంట్ వయసు పెంపు.. ఇలా ఇచ్చిన అనేక హామీలు అమలు కాలేదు. వీటిపై టీచర్లు సర్కారుపై ఆగ్రహంతో ఉన్నారు. దీంతోపాటు దుబ్బాక ఉప ఎన్నికల్లో టీచర్లు ఇంటర్నల్​గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఒకవేళ టీచర్లను జీహెచ్ఎంసీ ఎన్నికల డ్యూటీలకు తీసుకుంటే, వారంతా సర్కారుకు వ్యతిరేకంగా మౌత్ క్యాంపెయిన్ చేసే అవకాశముందని ప్రభుత్వ పెద్దలు భావించారు. ఈ కారణంతోనే టీచర్లను ఎన్నికల డ్యూటీలోకి తీసుకోలేదని సమాచారం. మరోవైపు టీచర్స్ యూనియన్లు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. భవిష్యత్​లోనూ తమను ఎన్నికల డ్యూటీలకు దూరంగానే పెట్టాలని, కేవలం టీచింగ్ పనులే కేటాయించాలని కోరుతున్నాయి