- 11–40 మంది ఉంటే ఇద్దరు,41–60 మంది ఉంటే ముగ్గురు టీచర్లు
- స్టూడెంట్, టీచర్ రేషియోను తగ్గించిన ప్రభుత్వం
- గత సర్కార్ ఇచ్చిన జీవోలు సవరణ
- గతంలో 19 మంది వరకు ఒక్కరే టీచర్
- 20 – 60 మంది ఉంటే ఇద్దరు,61 – 90 మంది ఉంటే ముగ్గురు
హైదరాబాద్, వెలుగు : టీచర్ల బదిలీల నేపథ్యంలో స్టూడెంట్, టీచర్ రేషియోను ప్రభుత్వం తగ్గించింది. స్టూడెంట్ల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను కేటాయించాలని నిర్ణయించింది. ఇందుకోసం గత సర్కార్ తెచ్చిన జీవోలను సవరించింది. దీంతో ప్రైమరీ స్కూళ్లలో టీచర్ల సంఖ్య కాస్త పెరగనుంది. గతంలో 19 మంది వరకు పిల్లలు ఉన్నా ఒక్కరే టీచర్ ను కేటాయించాలనే నిబంధన ఉండగా, ఇప్పుడు 10 మంది వరకు విద్యార్థులకే ఒక టీచర్ ను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 11 నుంచి 40 మంది ఉంటే ఇద్దరు, 41 నుంచి 60 మంది ఉంటే ముగ్గురు టీచర్లను కేటాయించనున్నట్టు ప్రకటించింది.
ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో స్టూడెంట్, టీచర్ నిష్పత్తిని పెంచారు. ప్రైమరీ స్కూల్లో 0 నుంచి19 మంది విద్యార్థులు ఉంటే ఒక టీచర్, 20 నుంచి 60 మంది ఉంటే ఇద్దరు, 61 నుంచి 90 మంది ఉంటే ముగ్గురు టీచర్లను కేటాయించేలా రూల్స్ తెచ్చారు. ఇందుకు అనుగుణంగా 2015లో జీవో నెంబర్ 27, 2021లో జీవో నెంబర్ 25 జారీ చేశారు. గతంలో ఈ జీవోల ఆధారంగానే టీచర్ల బదిలీలు జరిగాయి. 60 మందికి పైగా ఉంటే పోస్టులకు అనుగుణంగా.. రాష్ట్రంలో ప్రస్తుతం టీచర్ల బదిలీలు, ప్రమోషనన్ల ప్రక్రియ కొనసాగుతున్నది.
ఇప్పటికే రంగారెడ్డి మినహా అన్ని జిల్లాల్లో ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం ఎస్జీటీ, దానికి సమానమైన హోదా ఉన్న టీచర్ల బదిలీ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే స్టూడెంట్, టీచర్ రేషియోను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రైమరీ స్కూళ్లలో ఉన్న టీచర్లపై ఎక్కువ భారం పడకుండా వాళ్ల సంఖ్యను పెంచింది. దీనికి అనుగుణంగా పాత జీవోలను సవరించింది.
ఈ లెక్కన ప్రైమరీ స్కూళ్లలో 11 మంది పిల్లలు ఉన్నా ఇద్దరు టీచర్లు, 41 మంది పిల్లలుంటే ముగ్గురు టీచర్లు ఉండనున్నారు. మరోపక్క 60 మందికి పైగా పిల్లలు ఉన్న బడులకు... ఆయా బడులకు మంజూరైన పోస్టులకు అనుగుణంగా టీచర్లను కేటాయించనున్నారు. బడుల్లో ప్రస్తుతమున్న పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఖాళీలను చూపించారు. ఒకవేళ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగితే, అందుకు అనుగుణంగా టీచర్లను కేటాయిస్తామని ప్రభుత్వం తెలిపింది.
పిల్లలు లేని బడులకు బదిలీల్లేవ్..
రాష్ట్రవ్యాప్తంగా ఒక్క విద్యార్థి కూడా లేని బడులు 1,739 ఉన్నాయి. వాటిల్లో 1,609 మంది టీచర్లు పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయా బడుల్లో 8 ఏండ్లు పని చేసినోళ్లు తప్పనిసరిగా బదిలీ అవుతారు. అయితే ఈ బడులకు బదిలీల్లో కొత్తగా టీచర్లను కేటాయించడం లేదు. ఆయా బడుల్లో 8 ఏండ్లు పూర్తికాని టీచర్లు అక్కడే ఉంటారు. బదిలీల ప్రక్రియ పూర్తయి, పోస్టుల కేటాయింపు తర్వాతే పిల్లలు లేని బడుల్లో ఎంత మంది టీచర్లు ఉన్నారనే విషయంపై క్లారిటీ రానుంది. కాగా, ఈ జీరో ఎన్రోల్ మెంట్ బడుల్లో ఒకరిద్దరు పిల్లలు చేరినా, అంతకంటే ఎక్కువ మంది పెరిగినా.. ఆ సం ఖ్యకు అనుగుణంగా టీచర్లను కేటాయించనున్నారు.
నేడు ఎస్జీటీలకు స్కూళ్ల కేటాయింపు..
ప్రస్తుతం రాష్ట్రంలో 25 వేల మంది సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నది. ఆయా స్కూళ్లలో పిల్లల సంఖ్యకు అనుగుణంగా బడుల్లో ఖాళీలను చూపించారు. రంగారెడ్డి మినహా మిగిలిన జిల్లాల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆదివారం రాత్రి వరకు పూర్తయింది. టీచర్లు పెట్టుకున్న అప్లికేషన్ల ఆధారంగా సోమవారం ఉదయం కొత్త స్కూళ్లను కేటాయించనున్నారు. వారంతా ఆయా స్కూళ్లలో జాయిన్ కావాల్సి ఉంటుంది.