హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్సర్టిఫికేషన్ సిస్టమ్(టీజీ ఐపాస్) ద్వారా ఏడాది కాలంలో 1,901 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినట్టు ప్రభుత్వం వెల్లడించింది. వీటి ద్వారా రూ.12,626 కోట్ల పెట్టుబడులు సమకూరడంతో పాటు 49,384 మందికి ఉపాధి కల్పించినట్టయిందని తెలిపింది. అనుమతులు పొందిన వాటిలో ఇప్పటికే 409 కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించగా, మరికొన్ని పనులు దశల్లో ఉన్నాయని చెప్పింది. రూ.9,646 కోట్ల విలువైన మరో 882 పరిశ్రమలకు సంబంధించిన అనుమతులు ప్రాసెస్‌లో ఉన్నాయని, వీటి ద్వారా 40,468 మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొంది.
ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ గురువారం ప్రోగ్రెస్ రిపోర్టు విడుదల చేసింది. రూ.2,700 కోట్ల పెట్టుబడులతో కేయిన్స్ సెమికాన్, రూ.258.21 కోట్లతో మహారాష్ట్ర సీమ్‌లెస్ లిమిటెడ్, రూ.194 కోట్లతో బ్యాక్టోలాక్ న్యూట్రాస్యుటికల్స్, రూ.192 కోట్లతో జీఎం నెక్సస్ ఇండియా, రూ.127.27 కోట్లతో ఆర్ఎంజే వెరిటయబుల్ప్రొడక్ట్స్ వంటి పెద్ద సంస్థలు టీజీఐపాస్ ద్వారా అనుమతులు పొందాయని రిపోర్టులో పేర్కొంది.
16 మెగా ప్రాజెక్టులు..
నిరుడు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 16 మెగా ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ రిపోర్టులో వెల్లడించింది. ఆయా ప్రాజెక్టులతో రూ.14,433 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 8,894 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపింది. ములుగు జిల్లాలోని కమలాపూర్ వద్ద ఏర్పాటు చేసిన బిల్ట్ పరిశ్రమను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించింది.
ఏడాదిలో 10,751 పరిశ్రమలకు 796.74 కోట్ల ఇన్సెంటివ్స్ ఇచ్చినట్టు చెప్పింది. జనరల్ ఎంట్రప్రెన్యూర్స్ కేటగిరీలో 2,489 పరిశ్రమలకు రూ.272.24 కోట్లు, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు సంబంధించి 2,623 యూనిట్లకు రూ.159.63 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సంబంధించి 5,430 యూనిట్లకు రూ.350.87 కోట్ల మేర ఇన్సెంటివ్స్ ఇచ్చినట్టు ప్రకటించింది.
తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు..
ఆటోమొబైల్ రంగంలోనూ పెట్టుబడులను తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ రిపోర్టులో పేర్కొంది. పొల్యూషన్‌ను తగ్గించి పర్యావరణహితమైన వాహనాల తయారీకి ప్రోత్సాహం అందిస్తున్నదని తెలిపింది. అందుకు అనుగుణంగా తెలంగాణ మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలో ఆటోమోటివ్ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఆటోమోటివ్టెస్ట్ సిస్టమ్స్(ఏటీఎస్), టీయూవీ రైన్లాండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయని పేర్కొంది.
ఎంకతల క్లస్టర్లో ఏర్పాటు చేసే ఈ హబ్‌లో ఈవీ టెక్నాలజీ, టెస్టింగ్, డ్రైవింగ్ డెవలప్మెంట్కు సంబంధించిన కార్యకలాపాలను చేయనున్నారు. కనెక్టెడ్ అటానమస్వెహికల్స్(సీఏవీ), అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్(అడాస్)తో టెస్టింగ్ట్రాక్లను ఏర్పాటు చేసేందుకు సహకరిస్తాయని వివరించింది. వాటితో పాటు బిలిటి ఎలక్ట్రిక్ సంస్థ ఎలక్ట్రిక్ ఆటోల పరిశ్రమను ఏర్పాటు చేయనుందని, హ్యూందాయ్ మోటార్ ఇండియా మెగా టెస్ట్ సెంటర్ ఏర్పాటు చేస్తుందని తెలిపింది.
ఏరో స్పేస్ రంగంలో వృద్ధి..
ఏరో స్పేస్ రంగంలో రాష్ట్రానికి వరుసగా నాలుగోసారి బెస్ట్ స్టేట్అవార్డు వచ్చిందని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ రిపోర్టులో తెలిపింది. ఈ ఏడాది జులైలో హెచ్ఐసీసీలో నిర్వహించిన ఏరోమార్ట్ హైదరాబాద్సదస్సులో బీసీఐ ఏరో స్పేస్ ఫ్రాన్స్, ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరిందని పేర్కొంది. హైదరాబాద్‌లో కమర్షియల్విమానాలకు కార్గో డోర్స్తయారు చేసేందుకు టాటా అడ్వాన్స్ సిస్టమ్స్‌తో ఎయిర్‌బస్ ఒప్పందం చేసుకుందని చెప్పింది. జీఈ వెర్నోవా స్టీమ్పవర్మాన్యుఫ్యాక్చరింగ్ఫెసిలిటీకి, ఏరో స్పేస్ పార్క్‌లో అపోలో మైక్రో సిస్టమ్స్లిమిటెడ్కు చెందిన వెపన్స్ సిస్టమ్స్ఇంటిగ్రేషన్ఫెసిలిటీకి శంకుస్థాపన చేశారని వివరించింది.
అదానీ ఏరోస్పేస్ పార్క్‌లో దేశీయంగా అభివృద్ధి చేసిన దృష్టి 10 స్టార్ లైనర్ యూఏవీలను ఇండియన్ నేవీకి అందించేలా మాన్యుఫ్యాక్చరింగ్ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. ఫ్రాన్స్‌కు చెందిన ఏరోస్పేస్ శాఖ గిఫాస్ నేతృత్వంలోని వంద మంది ఫ్రాన్స్పారిశ్రామికవేత్తలు ఇక్కడకు వచ్చి పరిశీలించారని తెలిపింది. అలాగే, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం అందించేందుకు ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చినట్టు ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ రిపోర్టులో పేర్కొంది.
లైఫ్ సైన్సెస్సెక్టార్కు బూస్ట్..
రాష్ట్రంలో 140 లైఫ్ సైన్సెస్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నట్టు ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ రిపోర్టులో వెల్లడించింది. ఆయా పరిశ్రమల ద్వారా రూ.36 వేల కోట్ల విలువైన పెట్టుబడులు రావడంతో పాటు 51 వేల మందికి ప్రత్యక్షంగా, మరో లక్షన్నర మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపింది. జీనోమ్ వ్యాలీలో లారస్ ల్యాబ్స్‌తో కలిసి యూరప్‌కు చెందిన కేఆర్కేఏ సంస్థ రూ.2 వేల కోట్లతో బయో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి పరిశ్రమను ఏర్పాటు చేయనుందని, రూ.250 కోట్లతో లారస్ అత్యాధునిక ఆర్అండ్డీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుందని పేర్కొంది. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా 2,800 మందికి జాబ్స్ వస్తాయంది.
బయోలాజికల్–ఈతో కలిసి 5 కోట్ల డెంగ్యూ వ్యాక్సిన్లను తయారు చేసే ఇండస్ట్రీని ఏర్పాటు చేసేలా జపాన్ ఫార్మా సంస్థ తకిడా ఒప్పందం చేసుకుందని తెలిపింది. జీనోమ్‌వ్యాలీలో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడితో ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్, టెర్మినస్ గ్రూప్‌లు కలిసి ఆర్ అండ్ డీ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపింది. థర్మోఫిషర్, మిల్టెన్యీ బయోటెక్, నాచారంలో అరాజెన్విస్తరణ, స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్ఫార్మా, అమెరికాకు చెందిన వివింట్ ఫార్మా, యామ్జెన్ బయోటెక్కంపెనీ, జోయిటిస్, ఒలంపస్, హెచ్‌సీఏ హెల్త్‌కేర్, సిగ్నా, ఆర్ఎక్స్ బెనిఫిట్స్, మెట్ట్రానిక్స్, సనోఫి, బీఎంఎస్, ప్రావిడెన్స్వంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపింది.