బెంగళూరు: కర్నాటకలో సంచలనం రేపిన రేణుకాస్వామి మర్డర్ కేసులో అరెస్ట్ అయిన కన్నడ యాక్టర్ దర్శన్‌కు జైల్లో అధికారులు రాజభోగాలు కల్పించడంపై కర్నాటక గవర్నమెంట్ సీరియస్ అయ్యింది. జైల్లో దర్శన్‌కు రాచ మర్యాదలు కల్పించిన ఏడుగురు అధికారులపై వేటు వేసింది. కాగా, మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా జైల్లో ఉన్న దర్శన్‌కు అధికారులు వీఐపీ ట్రీట్మెంట్ కల్పించారు. జైల్లో దర్శన్‌కు మందు, సిగరెట్ అరెంజ్ చేశారు. దర్శన్ జైల్లో దర్జాగా మిత్రులతో కలిసి కూర్చొని మందు కొడుతూ.. సిగరెట్ తాగుతోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అంతేకాకుండా జైల్లోనే ఉన్న ఓ రౌడీ షీటర్‌తో దర్శన్ వీడియో కాల్ మాట్లాడిన వీడియాలు సైతం నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో జైలు అధికారులు తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. చట్టం ముందు అందరూ ఒక్కటి కాదా..? యాక్టర్స్ అయితే స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందా అని విమర్శలు కురిపించారు. ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. జైల్లో దర్శన్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించడంపై విచారణకు ఆదేశించింది. ఇందులో ఏడుగురు అధికారులు ప్రమేయం ఉందని తెలడంతో వారందరిని సస్పెండ్ చేసింది.
ఈ ఇష్యూపై కర్నాటక హోం మినిస్టర్ పరమేశ్వరన్ స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు. జైల్లో దర్శన్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించిన అధికారులపై వేటు వేశామని.. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. ఇందులో ఇంకా ఎవరి హస్తమైన ఉన్నట్లు తేలితే వారిపైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా, దర్శన్ ప్రియురాలు, నటి పవిత్ర గౌడ్‌పై రేణుక స్వామి అనే వ్యక్తి అభ్యంతర వ్యాఖ్యలు చేయడంతో దర్శన్ అతడిని హత్య చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా దర్శన్ ప్రస్తుతం బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఖైదీగా ఉన్నారు.