ఇక నుంచి జూన్​లో వానాకాలం, డిసెంబరులో యాసంగి.!

ఇక నుంచి జూన్​లో వానాకాలం, డిసెంబరులో యాసంగి.!
  • చెడగొట్టు, వడగండ్ల వర్షాల నుంచి నష్టాలను నివారించేందుకు సర్కారు ప్లాన్
  • నెల ముందే సాగు షురూ చేయాలంటున్న నిపుణులు
  • పంటనష్టం నివారణకు ముందస్తే మార్గమని సూచన

హైదరాబాద్, వెలుగు: యాసంగి సీజన్ లో వడగండ్ల వల్ల కలిగే నష్టాన్ని తప్పించేందుకు సీజన్లను కనీసం ఒక నెల ముందుకు జరపాలని సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలను జారీ చేసింది. గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణాధికారులు రైతులకు ఆ దిశగా అవగాహన కల్పించాలని సూచించింది. సాధారణంగా ఏటా వానాకాలం సీజన్ లో వరినాట్లు జులైలో ప్రారంభించి సెప్టెంబర్  వరకు వేస్తారు. దీంతో వానాకాలం కోతలు ఆలస్యమై యాసంగిపై ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో యాసంగి కోతలు మే నెల వరకు జరుగుతున్నాయి. దీంతో మార్చి, ఏప్రిల్ లో సరిగ్గా వరిపంట పొట్ట దశలో ఉన్న సమయంలో వడగండ్లు పడి తీవ్రనష్టం జరుగుతున్నది. దీనిని అధిగమించేందుకు ముందస్తుగా నాట్లు వేయించాలని అధికారులు భావిస్తున్నారు.  జూన్ 15 లోగా నారు పోసుకొని జులై 15 లోగా నాట్లు పూర్తి చేసేలా అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. అలాగే యాసంగి సీజన్ లో నవంబర్ 15 లోగా నారు  పోసుకొని డిసెంబర్ 15లోగా నాట్లు వేసేలా రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచిస్తోంది. అప్పుడే మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్​ ప్రారంభం నాటికి పంట చేతికి వచ్చే అవకాశం ఉంటుంది.

రాష్ట్రంలో జరుగుతున్నది ఇదీ..

 నిజానికి, రాష్ట్రంలో జులైలో వానాకాలం వరిసాగు ప్రారంభమవుతుంది. నవంబరు నెలాఖరుకు కోతలు అవుతున్నాయి. తర్వాత దాదాపు రెండు నెలలు భూములను పడావుగా వదిలేస్తున్నారు. డిసెంబరులో నారు పోసి సంక్రాంతి తర్వాత యాసంగి నాట్లకు శ్రీకారం చుడుతున్నారు. మార్చి రెండో వారం వరకూ కూడా నాట్లు వేస్తున్నారు. దాంతో, ఏప్రిల్‌‌  నెలాఖరు, మే నెలలో పంట చేతికి వస్తోంది. అప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు అటూ ఇటుగా ఉంటున్నాయి. దీనికితోడు మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్​ నెలల్లో  అకాల వర్షాలు, వడగండ్ల వానలు వచ్చి పంట తీవ్రంగా దెబ్బతింటోంది.

ముందస్తుతో పరిష్కారం ఇలా..

యాసంగి సాగును ముందుకు జరుపుకుంటే నీటి ఎద్దడి  సమస్యతో పాటు అటు అకాల వర్షాలు, వడగండ్ల వానల నుంచి సులభంగా బయట పడవచ్చని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇందుకు డిసెంబరులోనే వరినార్లు పోయడంతో యాసంగి సాగు నాట్లు ప్రారంభించాలని సూచిస్తున్నారు. దొడ్డు రకాల సాగుకు 150 నుంచి 160 రోజులు పడుతుంది. అదే సన్న రకాలైతే 120 నుంచి 125 రోజుల్లోనే పంట వచ్చేస్తుంది.  దొడ్డు రకాలకు స్వస్తి చెప్పి సన్న రకాలను సాగు చేయాలని చెబుతున్నారు. ఫలితంగా  డిసెంబరులో యాసంగి షురూ చేస్తే ఉగాది పండుగకల్లా పంట చేతికి వచ్చేస్తుంది. పక్క రాష్ట్రం ఏపీలో డిసెంబరులోనే యాసంగి సాగు ప్రారంభిస్తున్నారు. ఏప్రిల్‌‌  మొదటి పక్షానికే కోతలు పూర్తవుతున్నాయి. అలాగే, స్వల్పకాలిక రకాలైన ఆర్‌‌ఎన్‌‌ఆర్‌‌- 15048, జేజీఎల్‌‌- 1798, కేఎన్‌‌ఎం- 733, కేఎస్‌‌ఎం- 1638, జేజీఎల్‌‌- 3844, అంజన (జే18), ప్రద్యుమ్న (జేజీఎల్‌‌- 17004), వరంగల్‌‌- 962, హెచ్‌‌ఎంటీ సోనా రకాలను సాగు చేస్తే ఏప్రిల్‌‌ ఒకటో వారంలోపు పంట కోతకు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

 యాసంగి సాగును కనీసం 45 రోజుల పాటు ముందుకు జరపడం, కాలానికి అనుగుణంగా సన్న రకాలను సాగు చేయడమే పరిష్కారమని సూచిస్తున్నారు. దీంతో ఎండలు ముదరకుండానే కోతలు పూర్తి కావడం ఒకటైతే.. నీటి ఎద్దడితో పంటలు ఎండే పరిస్థితి నుంచి బయటపడడంతో పాటు అకాల వర్షాలతో పంట నష్టం జరిగే పరిస్థితి ఉండదు. ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే సమస్య చాలా వరకూ పరిష్కారమవుతుందని చెబుతున్నారు.  

చెడగొట్టు వానలకు 11 వేల ఎకరాల్లో పంటనష్టం

రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల గాలివానల బీభత్సానికి  11 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. పంటనష్టంపై గ్రామాల వారీగా సర్వే చేసి నివేదిక సమర్పించాలని అధికారులను వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం 13 జిల్లాల్లో  11 వేల ఎకరాల్లో పంటనష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనాలో తేలింది. మొక్కజొన్న, వరి, మామిడి కాయలు నేలరాలాయి. అలాగే కూరగాయల పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా నిజామాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, కరీంనగర్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్​లో పెద్ద ఎత్తున పంటనష్టం జరిగిందని అధికారులు  ప్రాథమికంగా గుర్తించారు.