ఆర్‌‌‌‌ఎంపీలకు మెడికల్ ట్రైనింగ్ : మంత్రి హరీశ్‌‌ రావు

అనంతరం సర్టిఫికెట్ ఇవ్వాలని సర్కారు నిర్ణయం

ఇందు కోసం కమిటీ వేయాలని హెల్త్ సెక్రటరీకి మంత్రి హరీశ్‌‌ ఆదేశం

ప్రభుత్వం నిర్ణయంపై డాక్టర్ల అభ్యంతరం

హైదరాబాద్, వెలుగు : ఆర్‌‌‌‌ఎంపీలకు మెడికల్  ట్రైనింగ్, సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకు అవసరమైన గైడ్‌‌లైన్స్‌‌ రూపొందించేందుకు వెంటనే ఓ కమిటీ వేయాలని హెల్త్  సెక్రటరీ రిజ్వీని మంత్రి హరీశ్‌‌ రావు ఆదేశించారు. ఈ కమిటీ వారం రోజుల్లో తనకు నివేదిక ఇచ్చేలా చూడాలని మంత్రి సూచించారు. బుధవారం సెక్రటేరియెట్‌‌లో రిజ్వీ, డీఎంఈ రమేశ్‌‌ రెడ్డి, వీవీపీ కమిషనర్ అజయ్‌‌ కుమార్‌‌‌‌ తదితరులతో మంత్రి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆర్‌‌‌‌ఎంపీలకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఉన్న అడ్డంకులు, కోర్టు కేసులపై స్టడీ చేయాలన్నారు. కోర్టు కేసులతో ఇబ్బందులు రాకుండా ట్రైనింగ్ ఎలా ఇవ్వొచ్చో అధ్యయనం చేసేందుకు కమిటీని నియమించాలని ఆదేశించారు. ట్రైనింగ్ ఎలా ఇవ్వాలో, సబ్జెక్టులు ఏమేం ఉండాలో కమిటీ ఇచ్చే నివేదికలో ఉండాలన్నారు. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని డాక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. ప్రతి గ్రామానికో పల్లె దవాఖాన పెడ్తామని చెబుతున్న ప్రభుత్వం.. ఆర్‌‌‌‌ఎంపీలకు ట్రైనింగ్ ఇవ్వడమేంటని హెల్త్  రిఫార్మ్స్  డాక్టర్స్  అసోసియేషన్ ఓ ప్రకటనలో నిలదీసింది.

ప్రమోషన్లు త్వరగా పూర్తి చేయాలె

వర్షాల నేపథ్యంలో సీజనల్  వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి, వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని హరీశ్  అన్నారు. వెంటనే పరీక్షలు, చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. 32 సింగిల్  డోనార్ ప్లేట్ లెట్  సెపరేషన్  మెషీన్లను కొనుగోలు చేయాలన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల ప్రమోషన్లు, ప్రొఫెసర్ల ట్రాన్స్‌‌ఫర్ల పనులను త్వరగా పూర్తి చేయాలని డీఎంఈకి మంత్రి సూచించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ లోని 112 డిప్యూటీ సివిల్  సర్జన్, సివిల్  సర్జన్  పదోన్నతుల ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తిచేయాలని వీవీపీ కమిషనర్​కు సూచించారు. నర్సులు, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్స్​కు సంబంధించిన ప్రమోషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. గవర్నర్ తిప్పిపంపిన అడిషనల్  డీఎంఈ  ఏజ్ హైక్  బిల్లును మరోసారి గవర్నర్‌‌‌‌కు పంపించడంపైనా చర్చించారు. కొత్త కాలేజీల్లో విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.