తెలుగు సినిమా ఇండస్ట్రీ సమస్యకు ఎండ్ కార్డ్ పడింది. తెలుగు సినిమా పెద్దలు ఏపీ సీఎం జగన్ తో చేసిన చర్చలు సఫలమయ్యాయి. సినీరంగ సమస్యలు పరిష్కరించినందుకు సీఎం జగన్ కు వారు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘సమస్యలు పరిష్కారమైనందుకు సంతోషంగా ఉంది. తక్కువ రేట్లకు వినోదాన్ని అందించాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. చిన్న సినిమాలకు సంబంధించి 5వ షోకు అంగీకారం తెలిపారు. పరిశ్రమ బాగోగులను ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ నెల చివరిలోగా ఇండస్ట్రీకి సంబంధించిన జీవో వస్తుంది. ఈ విషయంపై మంచి నిర్ణయం తీసుకున్నందుకు సీఎం జగన్ కు ధన్యవాదాలు’ అని చిరంజీవి అన్నారు.
మహేష్ బాబు
అందరి తరఫున ఈ విషయాన్ని సీఎం జగన్ తో మాట్లాడినందుకు చీరంజీవికి ధన్యవాదాలు. గత ఆరు ఏడు నెలల నుంచి తెలుగు సినిమా కన్ఫ్యూజన్ లో ఉంది. ఈ రోజు ఒక పెద్ద రిలీఫ్ లభించింది. త్వరలోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు.
రాజమౌళి
పెద్ద సినిమాల గురించి, చిన్న సినిమాల గురించి సీఎం జగన్ కు ఉన్న ఆలోచనా విధానం చాలా గొప్పది. అందరి అభిప్రాయాలను ఓపికగా విని ఓ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ పెద్ద సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్లిన చిరంజీవికి థ్యాంక్స్. తెలుగు సినిమాకు చిరంజీవి మరోసారి పెద్దగా వ్యవహరించారు.
ప్రభాస్
చాలా టైమిచ్చి సినిమా సమస్యలు విన్నందుకు సీఎం జగన్ కు థ్యాంక్స్. ముందుండి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించిన చిరంజీవి, పేర్ని నానికి కృతజ్ఞతలు.
నారాయణమూర్తి
ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో సగటు సినిమా పరిస్థితి చాలా కష్టంగా మారింది. పెద్ద సినిమాలు రిలీజ్ అయితే చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాం. ఆయన వెంటనే ఆ సినిమాల మనుగడ కోసం చర్యలు తీసుకోవాలన్నారు. సినిమా రంగ ఇబ్బందుల గురించి సీఎంతో మాట్లాడి.. పరిష్కారం చూపినందుకు చీరంజీవికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఓ మెగాస్టార్, మాజీ మంత్రి, పద్మభూషణ్. మీరు అటు తెలంగాణ సీఎంతో, ఇటు ఏపీ సీఎంతో మాట్లాడి చర్చలు జరిపినందుకు కృతజ్ఞతలు. అదేవిధంగా నంది అవార్డుల గురించి కూడా ఇద్దరు సీఎంలతో చర్చించాలి. ఈ సారి చర్చలకు పిలిచినపుడు ఫిలిం ఛాంబర్ ను కూడా పిలవాలి.
అంతొద్దు చిరంజీవి
మీడియాతో మాట్లాడుతూ.. నారాయణమూర్తి చిరంజీవిని ముందుకు పిలిచారు. దానికి మెగాస్టార్.. చెప్పండి సార్ అంటూ ముందుకొచ్చారు. వెంటనే నారాయణమూర్తి అంతొద్దు సార్ అంటూ చమత్కరించారు.
పేర్ని నాని
ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు సీఎం దృష్టికి తీసుకురావడంలో చిరంజీవి పాత్ర చాలా పెద్దది. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం ఆయన గొప్పతనం. ఈ ఫిబ్రవరి ఆఖరు లోపు అన్ని సమస్యలకు ఓ పరిష్కారం దొరుకుతుంది. షూటింగ్ ల విషయంలో ప్రభుత్వం మీకు చేయూతనిస్తుంది. హైదరాబాద్ ఎంతో ఏపీ కూడా అంతే.