- యాదాద్రి జిల్లాలో 16,143 వేల మందికి లబ్ధి
- సూర్యాపేటలో 26,376 మందికి..
- నల్గొండలో 83,650 మందికి..
- ఉమ్మడి జిల్లాలో రూ.1430.55 కోట్లు మాఫీ
యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, వెలుగు : రెండో విడత రుణమాఫీకి ప్రభుత్వం అంతా రెడీ చేసింది. అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రైతులు తీసుకున్న రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేస్తోంది. ఇందులో భాగంగా మొదటి విడతగా ఈనెల 18న రూ.లక్షలోపు రుణం తీసుకున్న రైతులకు మాఫీ చేసింది. రెండో విడతలో రూ.లక్షన్నరలోపు తీసుకున్న వారికి మాఫీ చేస్తోంది. రూ.2 లక్షలలోపు రుణాలు తీసుకున్న వారికి వచ్చే నెలలో మాఫీ
చేయనుంది.
యాదాద్రిలో16,143 వేల మందికి లబ్ధి..
రుణమాఫీ పేరుతో గత సర్కారు కాలయాపన చేయడంతోపాటు పూర్తి స్థాయిలో హామీ నిలబెట్టుకోలేదు. దీంతో గుర్రుగా ఉన్న రైతులు కాంగ్రెస్కు అండగా నిలిచి గెలిపించారు. లోక్సభ ఎన్నికల సమయంలోనే ఈ ఏడాది పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లాలో ఇప్పటికే రూ.లక్షలోపు రుణం తీసుకున్న 36,483 మంది రైతులకు రూ.199.87 లక్షలను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించి వారి ఖాతాల్లో రుణం మొత్తం జమ చేసింది.
రెండో విడతలో రూ.లక్షన్నర తీసుకున్న రైతులకు మాఫీ చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా జిల్లాలోని 17 మండలాలకు చెందిన 16,143 వేల మందికి పైగా రైతుల జాబితాను విడుదల చేసింది. వీరికి రూ.165.87 మాఫీ చేస్తామని ప్రకటించింది. వీరందరికీ మంగళవారం రుణ విముక్తి కలగనుంది. మొత్తంగా యాదాద్రి జిల్లాలో 52 వేల మందికి పైగా రుణాలు మాఫీ అవుతున్నాయి.
సూర్యాపేటలో 26,376 మందికి..
సూర్యాపేట జిల్లాలో మొదటి విడతలో రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న 56,217 మంది రైతులకు రూ.282.78 కోట్లు మాఫీ అయ్యాయి. రెండో విడతలో రూ.1.50 లక్షలలోపు రుణాలు తీసుకున్న 26,376 మంది రైతులకు రూ.250 కోట్లు మాఫీ కానున్నాయి. రెండు విడతల్లో దఫాలుగా జిల్లాలోని 82,593 రైతులకు రూ.532.78 కోట్లు మాఫీ అవుతున్నాయి.
నల్గొండలో 83,650 మందికి..
నల్గొండ జిల్లాలో మొదటి విడతలో రూ.లక్షలోపు రుణం తీసుకున్న 83,124 మంది రైతులకు రూ.454.49 కోట్లు మాఫీ అయ్యాయి. రెండో విడతలో రూ.లక్షన్నరలోపు రుణాలు తీసుకున్న 83,650 మంది రైతులకు రూ.1014.68 కోట్లు మాఫీ కానున్నాయి. ఈ రెండు విడతల్లో కలిపి నల్గొండ జిల్లాలో 1,66,774 మంది రైతులకు రూ.1469.17 కోట్లు మాఫీ అవుతున్నాయి.
పది రోజుల వ్యవధిలోనే 3,01,993 మందికి మాఫీ..
పదేండ్లు పవర్లో ఉన్న బీఆర్ఎస్ సర్కారు.. రుణమాఫీపై ఇచ్చిన హామీని పూర్తిగా అమలు చేయలేక కాలయాపన చేసింది. 2018 నుంచి 2023 వరకు మూడు విడతల్లో అపసోపాలు పడుతూ రూ.లక్షలోపు రుణాలను కొందరికే మాఫీ చేసింది. కాంగ్రెస్గవర్నమెంట్ పవర్లోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రుణమాఫీ అమలుకు ముందుకొచ్చింది. ఈనెల 18 నుంచి పది రోజుల వ్యవధిలోనే యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో కలిపి 3,01,993 మంది రైతులకు సంబంధించిన రూ.2.371.84 కోట్లను మాఫీ చేసి రుణ విముక్తులను చేసింది.