రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, వెలుగు: ఏండ్ల తరబడి పోడు భూములను సాగు చేస్తూ, హక్కు పత్రాలు పొందని గిరిజన, గిరిజనేతరులకు పట్టాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సి. నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లో పోడు భూములపై కలెక్టర్, సంబంధిత జిల్లా అధికారులతో మంత్రి మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో 28,343 ఎకరాల అటవీ భూమి ఉందని చెప్పారు. అన్ని శాఖల అధికారులు కోఆర్డినేషన్‌తో గ్రామాల్లో మీటింగ్స్ ఏర్పాటు చేసి 2005 ముందు నుంచి పోడు భూములు సాగుచేస్తున్న గిరిజనుల, గిరిజనేతరులకు సంబంధించిన క్లెయిమ్ లపై సర్వే చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
ఆయా స్థాయి కమిటీల్లో తీర్మానాలను, రిజిష్టర్లను పక్కాగా నమోదు చేయాలని చెప్పారు. అటవీ భూములలో పోడు సాగు ఎప్పటి నుంచి చేస్తున్నరన్న వివరాలను శాస్త్రీయంగా నిర్ధారించేందుకు డిజిటల్ సర్వే చేసి, వివరాలు పక్కాగా ఆన్ లైన్ లో నమోదు చేయాలని ఆదేశించారు. భూమినే నమ్ముకుని బతుకుతున్న పేద రైతుల గుర్తించి పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వివరించారు. పట్టాలు పొందిన తర్వాత ప్రతి రైతుకు రైతు బంధు, రైతు బీమా పథకాలు అందుతాయని చెప్పారు.
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, అడిషనల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, ఎఫ్ఆర్వో రామకృష్ణ, అడిషనల్డీఆర్డీవో కృష్ణయ్య, తహసీల్దార్ రాజేందర్ గౌడ్ పాల్గొన్నారు.
పేదలకు పండుగ కానుకగా బతుకమ్మ చీరలు
దసరా పండుగ రోజు పేదల ఇండ్లలో సంతోషం నింపేందుకు పండుగ కానుకగా ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోందని మంత్రి సి. నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం రాత్రి వనపర్తి పట్టణంలోని మర్రికుంట కాలనీ లో బతుకమ్మ చీరల పంపిణీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్, క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ దుస్తుల పంపిణీ చేసినట్లుగానే దసరాకు పేద మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మ చీరలు పంపిణీ పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
అడిషనల్ కలెక్టర్ మనూచౌదరి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఎంపిక చేసిన ప్రతి పంచాయతీకి జాతీయ అవార్డు వచ్చేలా తీర్చిదిద్దాలని అడిషనల్కలెక్టర్ మనూచౌదరి ఎంపీడీవోలను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఎంపీడీవోలతో నిర్వహించిన మీటింగ్‌లో జాతీయ పంచాయతీరాజ్అవార్డుల ఎంపికకు కేంద్రం గైడ్‌లైన్స్‌ను విడుదల చేశారు. అనంతరం ఆన్లైన్ ప్రశ్నావళిపై ప్రొజెక్టర్ద్వారా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్నావళిలో 9 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 9 థీమ్స్పొందుపరిచి 113 ప్రశ్నలు ఇస్తారన్నారు. గ్రామంపై పూర్తి అవగాహన ఉంటేనే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వొచ్చన్నారు. జిల్లాలోని 20 మండలాల నుంచి ఒక్కో ఉత్తమ గ్రామాన్ని గుర్తించామన్నారు. ఆ గ్రామాల సెక్రటరీలు, ఎంపీడీవో, ఎంపీవోలకు ఈ నెల 27న ట్రైనింగ్ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో కృష్ణ, డీఆర్డీవో నర్సింగరావు, డీఈవో గోవిందరాజులు, చైల్డ్వెల్ఫేర్ఆఫీసర్వెంకటలక్ష్మి, ఈఈ ఇంట్ర శ్రీధర్ రావు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.
ఆర్టీసీ డీఎంగా పరమేశ్వరి
వనపర్తి, వెలుగు: వనపర్తి ఆర్టీసీ డీఎంగా పరమేశ్వరి గురువారం బాధ్యతలు తీసుకున్నారు. డిపో లోని పలు రూట్లలో ఆమె సిబ్బంది తో కలిసి పర్యటించారు. అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ కి వనపర్తి జిల్లా కేంద్రంతో పాటు ముఖ్య పట్టణాల్లో బాగా ఆస్తులు ఉన్నాయని వాటిని రక్షించి ఆదాయ వనరులు గా మార్చాలని సూచించారు. ఆర్టీసీ యూనియన్లీడర్లు నీల స్వామి, రవీందర్ గౌడ్, రవి, వెంకటేశ్ గౌడ్ పాల్గొన్నారు.
రూల్స్ పాటించకుంటే ఆస్పత్రులు సీజ్
గద్వాల టౌన్, వెలుగు: జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లు రూల్స్ పాటించకపోతే సీజ్ చేస్తామని డిఫ్యూటీ డీఎంహెచ్‌వో సిద్ధప్ప హెచ్చరించారు. జిల్లాలోని పలు హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆయన గురువారం తనిఖీ చేశారు. జిల్లాలో మొత్తం మూడు టీమ్స్‌గా ఏర్పడి తనిఖీలు చేస్తున్నామని, రూల్స్ ప్రకారం క్వాలిఫైడ్ స్టాఫ్, డాక్టర్స్, టెక్నీషియన్స్ తప్పకుండా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఇర్షాద్, శశికళ, సిబ్బంది మధుసూదన్ రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బాలల చట్టాన్ని పక్కాగా అమలు చేస్తాం
కలెక్టర్ ఎస్.వెంకట్ రావు
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: బాలల చట్టం జిల్లాలో పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు తెలిపారు. గురువారం కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఇందివర పాండే .. బాలల న్యాయ చట్టంలో తీసుకువచ్చిన సవరణలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. గతంలో ఫ్యామిలీ కోర్టు ద్వారా మాత్రమే దత్తత, తదితర శాఖలుండేవని, ఇప్పుడు చట్టాన్ని సవరించి ఆ అధికారాలను కలెక్టర్లకు అప్పగించామన్నారు.
సవరించిన చట్టం ప్రకారం కలెక్టర్లు వ్యవహరించాలని సూచించారు. కొవిడ్టైమ్లో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలను ఆదుకునే విషయంలో కలెక్టర్లకు పూర్తి స్థాయిలో అధికారం ఇచ్చామని కేంద్ర సెక్రటరీ తెలిపారు. స్పాన్సర్షిప్స్కీం కింద అందిస్తున్న ఆర్థికసాయాన్ని రూ.2 వేల నుంచి రూ. 4 వేలకు పెంచినట్లు తెలిపారు. బాలల న్యాయ చట్టంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తామన్నారు. అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఐసీడీఎస్ఆఫీసర్ జరీనాబేగం, డీఆర్డీవో యాదయ్య, డిఎస్పీ రమణారెడ్డి పాల్గొన్నారు.
గ్రూప్–1 ఎగ్జామ్స్ సెంటర్లలో అన్ని ఏర్పాట్లు చేయాలి
వచ్చే నెల నిర్వహించనున్న గ్రూప్–1 ఎగ్జామ్ నేపథ్యంలో ఎగ్జామ్స్సెంటర్లలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు ఆదేశించారు. గురువారం ఆయన టౌన్ లోని రిషి జూనియర్ కాలేజీలలో ఏర్పాటు చేసిన ఎగ్జామ్ సెంటర్ ను తనిఖీ చేశారు. ఎగ్జామ్ సెంటర్ లో సీసీ కెమోరాలు లేని గదుల్లో వెంటనే ఏర్పాటు చేయాలని, అభ్యర్థులు ఎగ్జామ్ రాసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్నారు.
బతుకమ్మ ఉత్సవాలుఘనంగా నిర్వహించాలి
ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంపు ఆఫీస్నుంచి గ్రూప్– 1, బతుకమ్మ ఉత్సవాలు, చీరల పంపిణీ, పోడు భూములు, పింఛన్‌కార్డుల పంపిణీ తదితర అంశాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఆదేశించారు. లైటింగ్, శానిటేషన్ తదితర పనులన్ని ముందే చేపట్టాలన్నారు. పింఛన్‌కార్డులు స్థానిక ఎమ్మెల్యే సమక్షంలోనే పంపిణీ చేయాలన్నారు.
- గర్భిణి మృతిపై బంధువుల ఆందోళన
- డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని ఆరోపణ
లింగాల, వెలుగు: మండలంలోని సూరారంలో ఆర్డీటీ డాక్టర్ల నిర్లక్ష్యంతో చెంచు గర్భిణి చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నిమ్మల తిరుపతి భార్య దేవమ్మ (35) గర్భిణి.. కాగా హెల్త్ చెకప్‌లో భాగంగా జిల్లాలోని పలు ప్రైవేట్ఆస్పత్రులలో స్కానింగ్ చేయిస్తే.. గర్భంలో పిండానికి తల ఏర్పడడం లేదని, వెంటనే తొలగించాలని డాక్టర్లు చెప్పారు.
దానికి ప్రైవేట్‌లో అయితే రూ.15వేలు ఖర్చు అవుతుందని చెప్పడంతో.. తిరుపతి ఉచిత చికిత్స అందించే ఆర్డీటీ ట్రస్టును సంప్రదించాడు. వారు కర్నూల్లోని బత్తులపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి పంపించారు. బుధవారం అడ్మిట్ చేసుకున్న డాక్టర్లు ముందుగా నార్మల్ డెలివరీ చేస్తున్నామని, అనంతరం కొద్ది సేపటికే ట్రీట్మెంట్ చేస్తుండగానే చనిపోయిందని చెప్పారన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై రవి ఆర్డీటీ ప్రతినిధులతో మాట్లాడి మృతురాలు కుమారుడిని సంస్థ చదివిం చడంతో పాటు అంత్య క్రియల కోసం తక్షణ సాయంగా రూ. 25 వేలు అందించడంతో బాధితులు ఆందోళన విరమించారు.
మార్కెట్ కమిటీ ఎన్నిక సీఎం నిర్ణయమే
ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
కల్వకుర్తి, వెలుగు: కల్వకుర్తి మార్కెట్ కమిటీ ఎంపిక సీఎం కేసీఆర్ నిర్ణయమేనని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఇటీవల కల్వకుర్తి మార్కెట్‌కమిటీ చైర్మన్ పదవి ఎంపికపై టీఆర్ఎస్లో అసమ్మతి రగలడంతో.. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయాల్లో ప్రతి కార్యకర్త , హైకమాండ్ నిర్ణయమే ఫైనల్‌గా భావించి పని చేయాలని చెప్పారు. పార్టీ అభివృద్ధికి పనిచేసిన ప్రతి నాయకుడిని , కార్యకర్తను హైకమాండ్ గుర్తిస్తుందన్నారు. హైకమాండ్ నిర్ణయానికి ఎవరూ వ్యతిరేకంగా పనిచేయకూడదని ఎమ్మెల్యే కోరారు.
బయో కంపెనీకి నీళ్లివ్వొద్దు
మరికల్, వెలుగు : మండలంలోని చిత్తనూర్ వద్ద ఉన్న ‘జూరాల అగ్రో బయో కంపెనీ’కి కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి నీళ్లివ్వొద్దని గ్రామస్తులు కేఎస్పీ ఈఈ ప్రతాప్‌సింగ్ ను కోరారు. గురువారం ఆయనకు వినతి పత్రం ఇచ్చిన గ్రామస్తులు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గ్రామానికి దగ్గరలో కాలువ పక్కన ఉన్న రోడ్డును తవ్వి నర్వ మండలంలోని ఉంద్యాల పంప్‌హౌస్‌నుంచి పైపులైన్ వేస్తున్నారని చెప్పారు. అక్కడ నీళ్లిస్తే తమ రైతుల పంటలకు సాగునీళ్లందక పంటలు ఎండిపోతాయన్నారు. వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులు మురళి, నాగేశ్, రఫీ, శివన్న తదితరులు పాల్గొన్నారు.
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
గోపాల్ పేట, వెలుగు: మండలంలోని ఏదుట్ల గ్రామంలో భార్య చనిపోయిందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై నవీద్ వివరాల ప్రకారం.. రెమద్దుల గ్రామానికి చెందిన మోడల రాజు (28) భార్య రమాదేవి ఏడాది కింద చనిపోయింది. వీరికి ఇద్దరు పిల్లలు కాగా.. రాజు మళ్లీ పెళ్లి చేసుకునేందుకు యత్నించాడు. కానీ చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మనస్తాపం చెంది బుధవారం అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లి ఏదుట్ల గ్రామ శివారులోని ఓ రైతు పొలంలో పురుగుల మందు తాగి చనిపోయాడు. తండ్రి శ్రీనివాసులు కంప్లైంట్ మేరకు కేసు ఫైల్చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డీఈవోకు డాక్టరేట్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్ కర్నూల్ డీఈవో గోవిందరాజులు డాక్టరేట్పట్టా అందుకోనున్నారు. మహబూబ్నగర్బీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తూ నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలకు డీఈవోగా విధులు నిర్వహిస్తున్న ఆయన ఉమ్మడి జిల్లాలో 600 మంది సెకండరీ గ్రేడ్ సైన్స్, సోషల్ సబ్జెక్టుల టీచర్స్‌పై స్టడీ చేసి థీసిస్సమర్పించారు. ఓయూ ప్రొఫెసర్లు ఆయనకు డాక్టరేట్ ప్రకటించినట్లు తెలపడంతో డీఈవో ఆఫీస్అధికారులు, సిబ్బంది గోవిందరాజులును సన్మానించారు.
25 నుంచి గురుకుల కాలేజీలో ఆటల పోటీలు
మరికల్, వెలుగు: ఈ నెల 25 నుంచి 27 వరకు 3 రోజుల పాటు మరికల్ గురుకుల కాలేజీలో 8వ జోనల్ స్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని గురుకులాల రీజినల్ కో ఆర్డినేటర్ ప్లారెన్స్రాణి తెలిపారు. గురువారం మరికల్ గురుకుల కాలేజీలో ఆటల పోటీల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాలోని గురుకులాలకు చెందిన అండర్– 14, 17, 19 విభాగాల్లో పోటీ పడేందుకు 680 మంది స్టూడెంట్లు పాల్గొంటారన్నారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, సాఫ్ట్‌బాల్, టెన్నికాయిట్, అథ్లెటిక్స్, ఇండోర్ గేమ్స్ జరుగుతాయన్నారు. మరికల్, మక్తల్ప్రిన్సిపాళ్లు అనురాధ, మాధవి, వైస్ ప్రిన్సిపాల్అర్చనతో పాటు లెక్చరర్స్టీం
పాల్గొన్నారు.
జాబ్ మేళాను సక్సెస్ చేయండి
అడిషనల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
వనపర్తి, వెలుగు: జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజీలో ఈ నెల 28న నిర్వహించే జాబ్ మేళా ను సక్సెస్చేయాలని అడిషనల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కోరారు. గురువారం కలెక్టరేట్లో గవర్నమెంట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్ తో జాబ్ మేళా ఏర్పాట్లపై మీటింగ్నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ 2021–22 అకడమిక్ఇయర్ లో ఇంటర్ పూర్తి చేసుకున్న స్టూడెంట్లకు హెచ్ సీఎల్, ఎంఎన్ సీ కంపెనీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారన్నారు. భారీ సంఖ్యలో స్టూడెంట్లు హాజరయ్యేలా ప్రిన్సిపాల్స్చొరవ తీసుకోవాలని సంగ్వాన్ఆదేశించారు. డీఐఈవో జాకీర్ హుస్సేన్, జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల ప్రిన్సిపాల్స్పాల్గొన్నారు.