- తగ్గించాలని సర్కారు తిప్పలు
- ఆరుతడి వేయాలంటున్న అధికారులు
- ఆఫీసర్లు చెప్పినా.. ఈ సీజన్లో 3. 29 లక్షల ఎకరాలు దాటుతుందని అంచనా
యాదాద్రి, వెలుగు: వరి సాగును తగ్గించేలా సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. వాణిజ్య పంటలైన పత్తి, కందుల సాగు పెంచే విధంగా రైతులను ప్రోత్సహించాలని అగ్రికల్చర్ ఆఫీసర్ల ప్రభుత్వం ఆదేశించింది. సీఎం కేసీఆర్ సహా మంత్రులు కూడా వరి సాగును తగ్గించి ఆరుతడి పంటలను ఎక్కువగా సాగు చేయాలని రైతులకు తరచూ సూచిస్తున్నారు. అయితే సర్కారు చెప్పినట్టుగా 2020, 2021-, 2022 పంటలను సాగు చేసిన రైతులు, అమ్మకంపై తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో అప్పటి నుంచి వరినే సాగు చేస్తున్నారు. గత సీజన్ కంటే ఈ సీజన్లోనూ వరి ఎక్కువ సాగు చేస్తారని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు.
యాదాద్రి జిల్లాలో 6లక్షల ఎకరాల భూమి సాగుకు అనువుగా ఉంది. అయితే వర్షాభావం కారణంగా వరి సాగు తక్కువగా ఉండేది. అన్ని పంటలు కలిపి 2.50 లక్షల ఎకరాల్లో సాగు జరిగేదీ. 2016-17 వానాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 62,485 ఎకరాల్లో రైతులు వరిని సాగు చేశారు. అప్పటి నుంచి కాలం మంచిగా అవుతుండడంతో ప్రతి సీజన్లో వరి సాగు పెరుగుతూ వస్తోంది. 2019-20 యాసంగి సీజన్ వరకూ 1.99 లక్షల ఎకరాలకు వరి సాగు పెరిగింది. దీంతో సాగు తగ్గించడానికి అప్పట్లో సర్కారు నిర్ణయం తీసుకున్నది. దీంతో 2020 వానాకాలం సీజన్లో ఎక్కువ దిగుబడి వచ్చే దొడ్డు రకాలు కాకుండా తక్కువ దిగుబడి వచ్చే సన్న రకం వడ్లే సాగు చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సన్న రకాలపై మంత్రులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీంతో సీఎం సహా మంత్రులు, ఆఫీసర్లు చెప్పారని ఆ సీజన్లో చాలా మంది రైతులు సన్న రకం సాగు చేశారు. వడ్ల దిగుబడి వచ్చిన తర్వాత కొనుగోలు విషయంలో సర్కారు వెనుకడుగు వేసింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతులు, ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి చేయడంతో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి కలిగింది. 2016 నుంచి జిల్లాలో పత్తి, కందులను చెప్పుకోదగ్గట్టుగానే సాగు చేశారు. అయితే సర్కారు నుంచి సరైన రీతిలో సహకారం లేక ఇబ్బందిపడ్డారు. క్రమేపీ పత్తి ఓ మోస్తరుగా తగ్గినా కంది మాత్రం పెద్దఎత్తున తగ్గిపోయింది. 2020–-21లో సాగు చేయాలని వానాకాలం సీజన్లో ఆరుతడి పంటలను సాగు చేయాలని సర్కార్ పిలుపునిచ్చింది. ఆ సీజన్లో రైతులు 2 లక్షల ఎకరాలకు పైగా పత్తి, కందులను సాగు చేశారు. అయితే పత్తిని దళారులు కొనుగోలు చేసినా.. కందుల విషయంలో సర్కారు వెనుకడుగు వేసింది. అప్పట్లో వారాల తరబడి మార్కెట్ యార్డుల వద్ద కందులను అమ్ముకోవడానికి రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2021లో 45 వేల ఎకరాల్లో కందిని సాగు చేసిన రైతులు, గత సీజన్లో కేవలం 8 వేల ఎకరాలే సాగు చేశారు.
పత్తి, కందుల 2 లక్షల ఎకరాలు.?
ప్రతి సీజన్లోనూ వరి సాగును తగ్గించి, పత్తి, కందుల సాగు పెంచే విధంగా రైతులను ప్రోత్సహించాలంటూ ఆఫీసర్లకు సర్కార్ ఆర్డర్ ఇచ్చింది. ఈసారి పత్తి, కందులు కలిపి 2 లక్షల ఎకరాలు సాగు చేసేలా చూడాలని సూచించింది. అయితే రైతులు మాత్రం గత సీజన్ తరహాలోనే 3.29 లక్షల ఎకరాలకు పైగా వరిని సాగు చేసే అవకాశం ఉందని ఆఫీసర్లు అంఛనా వేశారు. 2022 సీజన్ కంటే పత్తి, కంది సాగు పెద్దగా పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయని
అంటున్నారు.
పత్తి, కందులు పెంచాలి
ప్రతి సీజన్లో వరి సాగు పెరుగుతోంది. ఈ సీజన్లో వాణిజ్య పంటలైన పత్తి , కందుల సాగు పెంచాలి. కనీసం 2 లక్షల ఎకరాల్లో ఈ రెండు పంటలను సాగు చేయాలి.
-కే అనురాధ, డీఏవో, యాదాద్రి జిల్లా